Modi: ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో గొప్ప విజయం సాధించాం: మోదీ

మన ఎన్నికల ప్రక్రియను చూసి ప్రజలంతా గర్వపడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 

Published : 04 Jun 2024 21:29 IST

దిల్లీ: మన ఎన్నికల ప్రక్రియను చూసి ప్రజలంతా గర్వపడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం దేశ ప్రజలనుద్దేశించి మోదీ మాట్లాడారు. ఈ ఎన్నికల వల్లే మన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోందన్నారు. ‘‘రాష్ట్రాల్లో ఎన్డీయేకు గొప్ప విజయం దక్కింది. 1962 తర్వాత ఏ ప్రభుత్వం కూడా మూడోసారి అధికారంలోకి రాలేదు. సబ్‌ కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌.. నినాదంతోనే మేం మూడుసార్లు అధికారంలోకి వచ్చాం. ఒడిశాలో భాజపా ప్రభుత్వం ఏర్పాటవుతుంది. పూరీ జగన్నాథుడి ఆశీర్వాదంతో అక్కడ విజయం దక్కింది. ఏపీ, ఒడిశా రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు. ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో గొప్ప గెలుపు సాధించాం. తెలంగాణలో మా సీట్లు రెండింతలు పెరిగాయి.

మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, దిల్లీలో దాదాపు క్లీన్‌ స్వీప్‌ చేశాం. దేశంలోని కోట్ల మంది మహిళలు మమ్మల్ని ఆశీర్వదించారు. పేద ప్రజలకు సేవ చేసేందుకు మరింత ఉత్సాహంగా ఉన్నాం. మేం రాకముందు దేశ ప్రజలు నిరాశ, నిస్పృహల్లో ఉన్నారు. 2014కి ముందు అన్ని పేపర్లలో కుంభకోణాలే కనిపించేవి. మా సేవలు చూసే ప్రజలు మూడోసారి పట్టం కట్టారు. ఈసారి మహిళలు భారీగా ఓటింగ్‌లో పాల్గొని గత రికార్డులు తిరగరాశారు. 12 కోట్ల మందికి సురక్షిత తాగునీరు అందించాం. నాలుగు కోట్ల మంది పేదలకు పక్కా ఇళ్లు కట్టించాం. దేశ హితం కోసం నిత్యం ఆలోచిస్తాం... ఆ దిశగా అడుగులు వేస్తాం. మేం చేపట్టిన పనుల వల్ల దేశం ప్రగతిపథంలో పయనిస్తోంది. మీ ఆశీర్వాదమే నిరంతరం పనిచేసేందుకు నాకు ప్రేరణ కలిగిస్తోంది. మీరిచ్చిన స్ఫూర్తితో రోజుకు 18గంటలు పనిచేస్తున్నా. మన ఎన్నికల ప్రక్రియ చూసి ప్రజలంతా గర్వపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికలు.. మన ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలు. మన ఎన్నికలను ప్రపంచ దేశాలు ఎంతో ఉత్సాహంతో చూశాయి. ఎన్నికల క్రతువులో పాల్గొన్న ప్రతి ఓటరుకూ అభినందనలు’’ అని మోదీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని