‘6 గ్యారంటీలకు తెల్ల రేషన్ కార్డే ప్రధాన అర్హత’పై.. బండి సంజయ్‌ సందేహం

ఆరు గ్యారంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించడాన్ని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay Kumar) స్వాగతించారు.

Updated : 25 Dec 2023 18:24 IST

కరీంనగర్‌: ఆరు గ్యారంటీల అమలుకు దరఖాస్తుల స్వీకరణ షెడ్యూల్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రకటించడాన్ని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay Kumar) స్వాగతించారు. అయితే తెల్ల రేషన్ కార్డే అందుకు ప్రధాన అర్హతగా పేర్కొనడంపై ఆయన సందేహం వ్యక్తం చేశారు. మాజీ ప్రధాని వాజ్‌పేయీ జయంతి సందర్భంగా కరీంనగర్‌ జిల్లా పార్టీ కార్యాలయంలో ‘సుపరిపాలన దినోత్సవం’ నిర్వహించారు. వాజ్‌పేయీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అనంతరం మీడియాతో సంజయ్‌ మాట్లాడారు.

‘‘రాష్ట్రంలో గత పదేళ్లుగా కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వలేదు. ఇప్పటికే 10 లక్షల కుటుంబాలు కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. ఇంకా లక్షలాది కుటుంబాలు దరఖాస్తు చేసుకునేందుకు వేచి చూస్తున్నాయి. వాళ్లందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారు? తక్షణమే కొత్త రేషన్ కార్డుల మంజూరుకు దరఖాస్తులను ఆహ్వానించాలి. రాజకీయాలకు అతీతంగా నిజమైన లబ్ధిదారులను గుర్తించాలి. భారాస చేసిన అప్పుల గురించి ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి తెలుసు. ఆ అప్పులను ఎలా తీరుస్తారు? ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ఎలా అమలు చేస్తారో? ప్రజలకు వివరించాలి’’ అని బండి సంజయ్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని