MP Laxman: భారాస మాదిరిగానే కాంగ్రెస్‌ది మాటల గారడీ: భాజపా ఎంపీ లక్ష్మణ్‌

కాంగ్రెస్‌పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ అన్నారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 16 Apr 2024 14:11 IST

హైదరాబాద్‌: కాంగ్రెస్‌పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ అన్నారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు వరి పంట బోనస్‌ ఇవ్వలేదని, వచ్చే సీజన్‌కు ఇస్తామంటున్నారని చెప్పారు. ఇదేమైనా వాయిదాల ప్రభుత్వమా అని ఎద్దేవా చేశారు. రైతు స్వరాజ్య వేదిక, కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ 60 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారన్నారు. కానీ మంత్రి ఉత్తమ్‌ ఆత్మహత్యలే లేవని చెబుతున్నారని విమర్శించారు.

‘‘రైతులు ఈ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలో సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలి. భారాస మాదిరిగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం మాటల గారడీతో కాలం వెల్లదీస్తోంది. ఆ పార్టీ అంటేనే పచ్చి అబద్ధాలు, మోసం, కుట్రలు. తెలంగాణ ప్రజలు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేదు. కోడ్‌ను అడ్డుపెట్టుకొని గ్యారంటీల అమలు నుంచి తప్పించుకోవాలని చూస్తే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెబుతారు. మీకెందుకు ఓటు వేయాలి? వంద రోజుల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేయనందుకా? రైతు భరోసా రూ.15 వేలు ఇవ్వనందుకా? రూ.12 వేలు రైతు కూలీల ఖాతాలో వేయనందుకా? ప్రతి మహిళకు రూ.2,500 ఇవ్వనందుకా?

కాళేశ్వరం, మేడిగడ్డ, ధరణి, డ్రగ్స్‌ మాఫియా, విద్యుత్‌ కొనుగోలు, ఫోన్‌ ట్యాపింగ్‌ అవినీతిపై ఆరోపణలు చేశారు. వీటిలో ఒక్కరినైనా శిక్షించడానికి చర్యలు తీసుకున్నారా? గతంలో భారాస నేతలు అవినీతిపరులన్న రేవంత్‌రెడ్డి.. ఇప్పుడెందుకు కాంగ్రెస్‌ పార్టీలో చేర్చుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో భారాస, భాజపా ఒక్కటే అని అపోహ సృష్టించి లాభపడ్డారు. గులాబీ పార్టీ పూర్తిగా చతికిలపడింది. కారు పూర్తిగా ధ్వంసమైతే దాన్ని జాకీ పెట్టి లేపడానికి రేవంత్‌ ప్రయత్నిస్తున్నారు’’ అని లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని