Arvind Kejriwal: ‘నా పేరు అరవింద్ కేజ్రీవాల్, నేను ఉగ్రవాదిని కాదు’: ప్రజలకు దిల్లీ సీఎం సందేశం

దేశం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలకు ఓ కొడుకులా, సోదరుడిలా పని చేసిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిహాడ్‌ జైలు నుంచి ప్రజలకు సందేశం పంపారని ఆప్‌ ఎంపీ సంజయ్ సింగ్ పేర్కొన్నారు.

Published : 16 Apr 2024 15:15 IST

దిల్లీ: దేశం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలకు ఓ కొడుకులా, సోదరుడిలా పనిచేసిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిహాడ్‌ జైలు నుంచి ప్రజలకు సందేశం పంపారని ఆప్‌ ఎంపీ సంజయ్ సింగ్  పేర్కొన్నారు.  మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రసంగించిన సంజయ్‌సింగ్‌  ‘‘నా పేరు అరవింద్ కేజ్రీవాల్, నేను ఉగ్రవాదిని కాదు’’ అని ముఖ్యమంత్రి పంపిన సందేశాన్ని వినిపించారు. కేజ్రీవాల్‌ను కలవడానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ జైలుకు వెళ్తే వారిని గ్లాస్‌ గోడకు ఇరువైపులా ఉండి ఇంటర్‌కామ్‌ ద్వారా మాట్లాడుకునేలా చేశారని, దీన్ని బట్టి దిల్లీ సీఎంపై ప్రధానికి ఎంత ద్వేషముందే అర్థమవుతోందని ఆయన పేర్కొన్నారు.  కేజ్రీవాల్‌ను మానసికంగా కుంగదీసేందుకు, నిరుత్సాహపరిచేందుకు తిహాడ్‌లో 24 గంటలు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆప్ నేత ఆరోపించారు.

అతడు అరవింద్ కేజ్రీవాల్. అతన్ని ఎంత అణగదొక్కాలని ప్రయత్నిస్తే అంత బలంగా తిరిగి వస్తాడు అని అన్నారు.  ఆదివారం సీఎం భగవంత్ మాన్ కేజ్రీవాల్‌ను చూసి భావోద్వేగానికి గురయ్యారని తెలిపారు.  ఈవిధమైన చర్యలకు పాల్పడటం భాజపాకు, ప్రధాని మోదీకి సిగ్గుచేటని సంజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు. 

ప్రధాని మోదీ ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూ గురించి ఆప్‌ ఎంపీ మాట్లాడుతూ “ఆదివారం ప్రధాని ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.  షాకింగ్‌ విషయం ఏంటంటే అతిపెద్ద కుంభకోణమైన ఎలక్టోరల్‌ బాండ్ల జారీని ఆయన  సమర్థించుకుంటున్నారు.  సుప్రీంకోర్టు సైతం ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని, చట్ట విరుద్ధమని తెలిపినా లెక్క చేయకుండా న్యాయస్థానాన్ని అవమానించారు.  సుప్రీంకోర్టుకు, దేశ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలి’’ అని డిమాండ్‌ చేశారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని