Nadendla: ప్రజల్ని అయోమయంలోకి నెట్టేలా మాట్లాడుతున్నారు: నాదెండ్ల మనోహర్‌

రాష్ట్ర విభజనపై వ్యాఖ్యలు చేసిన వైకాపా నేతలు క్షమాపణ చెప్పాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ డిమాండ్ చేశారు.

Updated : 09 Dec 2022 12:17 IST

విశాఖ: రాష్ట్ర విభజనపై వ్యాఖ్యలు చేసిన వైకాపా నేతలు క్షమాపణ చెప్పాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ డిమాండ్ చేశారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి అయోమయస్థితిలోకి నెట్టేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

రంగులు వేసుకునే వారికి నిబంధనలు ఏం తెలుస్తాయి?

‘‘ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసి హైకోర్టు వేసిన మొట్టికాయలు తిన్న వారు కూడా జనసేన పార్టీ వారాహి వాహనం రంగు గురించి మాట్లాడుతున్నారు. నిబంధనల గురించి వైకాపా నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. వారాహి వాహనం నిబంధనలకు అనుగుణంగా సిద్ధం అవుతోంది. నిబంధనలు పరిశీలించకుండా, ఏ రంగు వేశారో చూడకుండా రవాణా శాఖ అధికారులు అనుమతి ఎలా ఇస్తారు? ఏ మాత్రం ఆలోచన లేకుండా విమర్శలు చేయడం వైకాపా నాయకుల అవగాహన రాహిత్యాన్ని, మూర్ఖత్వాన్ని తెలుపుతోంది. జనసేన పార్టీ ఎప్పుడూ నిబంధనల ప్రకారమే నడుచుకుంటుంది. పవన్ కల్యాణ్ చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజాహితంగా, చట్టానికి లోబడి ఉంటుంది. వైకాపా నాయకులకు వ్యక్తిగత విమర్శలు చేయటం అలవాటుగా మారిపోయింది. పవన్ ఒక్కసారి చెప్పు చూపిస్తే వైకాపా నేతలు భయపడ్డారు. అది నిజాయతీకి ఉన్న దమ్ము’’ అని వ్యాఖ్యానించారు.

రేపు కీలక ప్రకటన..

‘‘ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధిపై జనసేన పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తుంది. ఉత్తరాంధ్రలో జనసేన పార్టీ త్వరలో చేపట్టబోయే కీలక కార్యక్రమం గురించి శనివారం (రేపు) ప్రకటిస్తాం.  పవన్ రాష్ట్రవ్యాప్త పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ కాస్త వైఎస్‌ఆర్‌సీపీ ఆర్టీసీగా మారిపోయింది. పార్టీ కార్యక్రమాలకు ప్రభుత్వ బస్సులు వాడుకోవడం సిగ్గుచేటు. 14 ఎకరాలు కబ్జా చేస్తున్న వారిని ప్రశ్నించిన అనంతపురం జిల్లా జన సైనికుడు సురేష్ మీద దాడికి పాల్పడ్డారు. జనసేన పార్టీ పర్యటన ఉందని తెలిసి అన్నమయ్య ప్రాజెక్టు బాధితుల ఖాతాల్లో అప్పటికప్పుడు డబ్బులు వేశారు. మరోసారి పవన్ వారి ప్రాంతంలో పర్యటిస్తే అందరికీ ప్రభుత్వం ఇల్లు కట్టిస్తుందని బాధితులు కోరుకుంటున్నారు. అంటే.. అది ప్రజలకు జనసేన మీద ఉన్న నమ్మకం. వైకాపా ప్రభుత్వ పాలన వైఫల్యాలు చెప్పడంతోపాటు ప్రజలకు అర్థమయ్యే విధంగా సాంకేతిక సైన్యం పని చేయాలి’’ అని నాదెండ్ల తెలిపారు.

జనవరి 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన ఆధ్వర్యంలో యువజనోత్సవాన్ని వేడుకగా నిర్వహిస్తామని నాదెండ్ల మనోహర్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో అధినేత పవన్‌కల్యాణ్‌ పాల్గొంటారన్నారు. జనసేన ఎన్నికల ప్రచార వాహనం వారాహిపై వైకాపా నేతలు కంగారు పడిపోతున్నారని.. తాము నిబంధనల ప్రకారమే నడుచుకుంటామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని