MLC Bypoll: నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.

Published : 27 May 2024 06:10 IST

ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం
జూన్‌ 5వ తేదీన కౌంటింగ్‌

నల్గొండలో పోలింగ్‌ సామగ్రితో వెళ్తున్న ఎన్నికల సిబ్బంది బస్సును జెండా ఊపి ప్రారంభిస్తున్న
నల్గొండ కలెక్టర్, ఉప ఎన్నిక ఆర్వో హరిచందన

ఈనాడు, నల్గొండ: వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. మొత్తం 12 జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నిక జరుగుతుంది. 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఎన్నికకు నల్గొండ జిల్లా కలెక్టర్‌ దాసరి హరిచందన రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో)గా వ్యవహరిస్తుండగా.. హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జయశంకర్‌ భూపాలపల్లి, జనగామ, ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లోని అదనపు కలెక్టర్లు, జిల్లా రెవెన్యూ అధికారుల క్యాడర్‌లో ఉన్న 37 మంది అధికారులు అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అధికారు(ఏఆర్వో)లుగా వ్యవహరిస్తున్నారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికలో భారాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌ తరఫున తీన్మార్‌ మల్లన్న, భాజపా అభ్యర్థిగా జి.ప్రేమేందర్‌రెడ్డి, భారాస అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి పోటీచేస్తున్నారు. ఇందులో గెలుపొందే అభ్యర్థి 2027 మార్చి వరకు ఎమ్మెల్సీగా కొనసాగుతారు. ఈ ఎన్నికకు మొత్తం 4,63,839 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరి కోసం 605 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల మాదిరిగా కాకుండా ఈ ఎన్నికలను బ్యాలెట్‌ పద్ధతిలో, అభ్యర్థికి ప్రాధాన్య క్రమంలో ఓటు వేసేలా నిర్వహిస్తున్నారు. ఇందుకు అవసరమయ్యే బ్యాలెట్‌ బాక్సులు, సామగ్రిని ఆదివారం ఆయా జిల్లాల్లోని పోలింగ్‌ అధికారులు సిబ్బందికి అందజేశారు. పంపిణీ ప్రక్రియను నల్గొండలో జిల్లా కలెక్టర్, ఉప ఎన్నిక ఆర్వో దాసరి హరిచందన పర్యవేక్షించారు. అనంతరం వారు వెళ్లే వాహనాలను ప్రారంభించారు. సిబ్బంది ఆదివారం సాయంత్రం పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. అత్యవసర సమయాల్లో కూడా అవసరానికి పనికొచ్చేలా, కొరత లేకుండా అధికారులు మొత్తం 807 బ్యాలెట్‌ బాక్సులను, సుమారు 8 లక్షల బ్యాలెట్‌ పత్రాలను సిద్ధంగా ఉంచారు.

ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పార్టీలు

ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికకే ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించడం గమనార్హం. ఆయా పార్టీల అగ్రనేతలు నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి తమ పార్టీ అభ్యర్థికి మద్దతివ్వాలని పట్టభద్రులను కోరారు. ఈ ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటముల్లో కీలకం కానున్నారు. వారు  ప్రధాన పార్టీలకు దీటుగా ప్రచారాన్ని నిర్వహించడంతో.. వారు ఎవరి గెలుపు అవకాశాలను దెబ్బతీస్తారోనని అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్ష భారాస, భాజపా అభ్యర్థులు, ఆయా పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. జూన్‌ 5న ఈ ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి.


అన్ని సౌకర్యాలు కల్పించాం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్‌కు 12 జిల్లాల్లో ఏర్పాట్లు చేశాం. ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కోకుండా సౌకర్యాలు కల్పించాం. ఓటు ఎలా వేయాలో సూచిస్తూ ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాం. పోలింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించాం.

హరిచందన, రిటర్నింగ్‌ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టర్‌


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు