MLC Election: ఎమ్మెల్సీ ఉపఎన్నికలో 72.37% ఓటింగ్‌

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చెదురుమదురు ఘటనలు మినహా సోమవారం ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గవ్యాప్తంగా 4,63,839 ఓట్లలో 72.37 శాతం పోలయ్యాయని ఆర్వో హరిచందన ‘ఈనాడు’కు తెలిపారు.

Published : 28 May 2024 03:07 IST

చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతం
ఓటుకు వెళ్తూ ప్రమాదాల్లో ముగ్గురి మృతి
జూన్‌ 5న ఓట్ల లెక్కింపు

సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఓటు వేసేందుకు బారులు తీరిన పట్టభద్రులు

ఈనాడు, నల్గొండ-న్యూస్‌టుడే యంత్రాంగం: వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక చెదురుమదురు ఘటనలు మినహా సోమవారం ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గవ్యాప్తంగా 4,63,839 ఓట్లలో 72.37 శాతం పోలయ్యాయని ఆర్వో హరిచందన ‘ఈనాడు’కు తెలిపారు. 2021 మార్చిలో జరిగిన ఎన్నికల్లో 76.35 శాతం పోలింగ్‌ నమోదైంది. ప్రస్తుతం ఇది దాటే అవకాశాలు లేవని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. జూన్‌ 5న నల్గొండలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్న యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో ఓటేశారు. భారాస అభ్యర్థి ఏనుగుల రాకేశ్‌రెడ్డి హనుమకొండలోని వడ్డేపల్లి, భాజపా అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి సుబేదారి హంటర్‌రోడ్డులోని కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. భార్యతో ఓటు వేయించేందుకు వెళ్తుండగా టేకులపల్లికి చెందిన దంపతులు పాయం జానకి(35), కృష్ణయ్య(39); ఓటు వేసి పాల్వంచ వెళ్తుండగా అశ్వాపురం మండలానికి చెందిన ఉపాధ్యాయుడు కుంజా రాజశేఖర్‌(32) మరణించారు. 

దాడి చేశారని ఠాణా ముందు బైఠాయింపు.. 

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఓ ప్రధాన పార్టీకి చెందిన వారు డబ్బులు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్‌కుమార్‌ అక్కడికి వెళ్లి అడ్డుకునేందుకు యత్నించగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. కొందరు అశోక్‌కుమార్‌పై దాడి చేయడంతో ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్‌ వద్ద బైఠాయించి ఆందోళన చేశారు. అదనపు ఎస్పీ రాములు నాయక్‌ వచ్చి పోలింగ్‌ ముగిసే వరకు గన్‌మెన్‌ను కేటాయిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన ఆందోళనను విరమించారు. ఈ ఘటనలో రెండు వర్గాలు పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. సాధారణంగా అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగడంతో ఈ ఎన్నికా అలాగే ఉంటుందనే ఉద్దేశంతో కొందరు ఓటర్లు 4 గంటల అనంతరం వచ్చారు. వారికి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. 

ఓటుకు రూ.500 చొప్పున పంపిణీ 

ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీలు ఓటుకు రూ.500 చొప్పున పంపిణీ చేయగా..మరో ప్రధాన పార్టీ ఓటుకు రూ.300 చొప్పున ఇచ్చింది. నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చాలా పోలింగ్‌ కేంద్రాల వద్ద బహిరంగంగానే డబ్బులు పంపిణీ చేశారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని పలువురు స్వతంత్ర అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.  

తీన్మార్‌ మల్లన్నను అడ్డుకున్న భాజపా నేతలు 

హనుమకొండ నగరం ప్రశాంత్‌నగర్‌ తేజస్వీ పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రంలో కాంగ్రెస్‌ అభ్యర్థి తీన్మార్‌ మల్లన్నను హనుమకొండ జిల్లా భాజపా ఉపాధ్యక్షుడు అమరేందర్‌రెడ్డి పార్టీ కార్యకర్తలతో కలిసి అడ్డుకున్నారు. మూడు వాహనాల్లో 15 మంది అనుచరులతో కలిసి పోలింగ్‌ కేంద్రం గేటు దాటి లోపలికి ఎలా వచ్చారని.. వెంటనే బయటకు వెళ్లాలన్నారు. తమను ప్రశ్నించేందుకు మీరెవరంటూ మల్లన్న అనుచరులు అనడంతో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. దీంతో మల్లన్న అక్కడి నుంచి వెళ్లిపోయారు.


కౌన్సిల్‌ బదులు అసెంబ్లీ.. 

పలు పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ కంపార్ట్‌మెంట్లపై తెలంగాణ రాష్ట్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు ఉప ఎన్నిక(టీఎస్‌ఎల్‌సీ) బదులు తెలంగాణ రాష్ట్ర లెజిస్లేటివ్‌ అసెంబ్లీ(టీఎస్‌ఎల్‌ఏ) అని ఉండటంతో ఈ విషయాన్ని ఎన్నికల ఆర్వో దాసరి హరిచందన దృష్టికి ‘ఈనాడు -ఈటీవీ’ తీసుకెళ్లింది. దీంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన యంత్రాంగం టీఎస్‌ఎల్‌ఏ అని రాసి ఉన్న చోట స్టిక్కర్‌లను అతికించింది. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని 28వ పోలింగ్‌ కేంద్రంలో బ్యాలెట్‌ పత్రాలపై ముద్రణ సరిగా లేదని.. మరకలతో కూడిన ఆకారాలు ఉన్నాయని పలువురు ఎన్నికల సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. దాదాపు 45 బ్యాలెట్‌ పత్రాలు అలా ఉన్నాయని గుర్తించి వాటిని తొలగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని