సీఎం సోదరుడి ఓటు గల్లంతు..

తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లిన సీఎం సోదరుడుకి అనూహ్య పరిస్థితి ఎదురైంది. 

Updated : 20 May 2024 18:01 IST

కోల్‌కతా: ఈ లోక్‌సభ ఎన్నికల వేళ.. పోలింగ్ కేంద్రానికి వెళ్లిన తర్వాత ఓటరు జాబితాలో పేరు లేకపోవడంతో పలువురు ఓటు వేయలేకపోయిన సందర్భాలు వెలుగుచూశాయి. తాజాగా ఓ సీఎం సోదరుడికే అలాంటి పరిస్థితి ఎదురైంది. జాబితాలో పేరు గల్లంతు కావడంతో తన హక్కును వినియోగించుకోలేకపోయారు.

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) సోదరుడు బబున్ బెనర్జీకి హావ్‌డా ప్రాంతంలో ఓటు ఉంది. ఐదోవిడతలో భాగంగా పోలింగ్ కేంద్రానికి వెళ్లిన ఆయనకు తన ఓటు గల్లంతయిందన్న విషయం వెల్లడైంది. దీనిపై ఆయన్ను మీడియా ప్రశ్నించగా స్పందించేందుకు నిరాకరించారు. మరోవైపు ఈ వ్యవహారంపై తృణమూల్ కాంగ్రెస్ స్పందించింది. ‘‘ఈ వ్యవహారాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. ఏం జరిగిందనే దానిపై అదే వివరణ ఇస్తుంది’’ అని పేర్కొంది.

హావ్‌డా నుంచి తృణమూల్ తరఫున మరోసారి ప్రసూన్‌ బెనర్జీకి టికెట్ ఇవ్వడంపై బుబున్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. టికెట్ ఆశించిన ఆయనకు నిరాశే ఎదురైంది. ఆ తర్వాత మమత, ఆమె సోదరుడి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ‘‘ప్రతీ ఎన్నికల ముందు ఆయనొక సమస్య సృష్టిస్తారు. నాకు దురాశపరులు ఇష్టం ఉండదు. అలాగే నేను వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించను’’ అని ఆ సందర్భంగా మమత మీడియాతో వ్యాఖ్యానించారు. ఆ స్థానం నుంచి బబున్‌ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అలాగే భాజపాలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. ప్రస్తుతం ఆయన బెంగాల్ ఒలింపిక్ అసోసియేషన్, బెంగాల్ హాకీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాగే బెంగాల్‌ బాక్సింగ్ అసోసియేషన్ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తృణమూల్ క్రీడా విభాగం బాధ్యతలు చూస్తున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని