Nara Lokesh: వచ్చేవారం నారా లోకేశ్‌ ‘యువగళం’ తిరిగి ప్రారంభం..!

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నిలిపివేసిన యువగళం పాదయాత్రను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. వచ్చేవారం నుంచి ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Updated : 24 Sep 2023 11:43 IST

రాజోలు: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో నిలిపివేసిన యువగళం పాదయాత్రను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌.. వచ్చేవారం నుంచి ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టుతో పాదయాత్ర నిలిచిన ఉమ్మడి తూ.గో. జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ నుంచే యువగళాన్ని తిరిగి ప్రారంభించనున్నారు. చంద్రబాబు అరెస్టు, తదనంతర పరిణామాలపై పార్టీ ముఖ్యనేతలతో నారా లోకేశ్‌ ఇవాళ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ మద్దతుగా నిలుస్తున్న వివిధ వర్గాలకు ఆయన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. 

ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. చంద్రబాబుపై అవినీతి మరక వేయలేకపోయారని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజలు, పార్టీ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలను ప్రభుత్వం పోలీసులతో అణిచివేయడం, కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. చంద్రబాబుపై అక్రమ కేసు విషయంలో దిల్లీలో న్యాయవాదులతో నిత్యం సంప్రదిస్తున్నట్లు లోకేశ్‌ తెలిపారు. అటు లీగల్ ఫైట్ కొనసాగిస్తూ.. ఇటు యువగళంతో మళ్లీ రోడ్డెక్కాలని నిర్ణయించారు. చంద్రబాబు అక్రమ అరెస్టు, జగన్ రాజకీయ కక్ష సాధింపు గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు నాయకులంతా ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని