Nara Lokesh: ప్రభుత్వంలో నా పాత్ర ఏంటో చంద్రబాబు నిర్ణయిస్తారు: లోకేశ్‌

ఏపీ ప్రజలు తెదేపా, జనసేన, భాజపాపై గురుతరమైన బాధ్యత పెట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. 

Updated : 05 Jun 2024 07:11 IST

మంగళగిరి: ఏపీ ప్రజలు తెదేపా, జనసేన, భాజపాపై గురుతరమైన బాధ్యత పెట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. మంగళగిరి తెదేపా అభ్యర్థిగా   ఘన విజయం సాధించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దారి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు.. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు.. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల బండిలా ముందుకు తీసుకెళ్లేందుకు గొప్ప బాధ్యత అప్పగించారు. ఆ బాధ్యత నెరవేర్చేందుకు అహర్నిశలు కష్టపడతాం. 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రానికి పూర్వవైభవం తెస్తాం. ప్రజలు ఇచ్చిన విజయాన్ని గుండెల్లో పెట్టుకుంటాం. 1985 నుంచి మంగళగిరిలో పసుపు జెండా ఎగరలేదు. తెదేపా, జనసేన, భాజపా శ్రేణుల సహకారంతో 91వేల పై చిలుకు మెజార్టీతో విజయం సాధించా. 

మంగళగిరిని ఆదర్శనియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై చర్యలు ఉంటాయి. కక్ష సాధింపులు, వేధింపులు లాంటివి మాకు తెలియదు. ఆస్తుల ధ్వంసం అనేది మాకు తెలియదు. వ్యక్తిగతంగా దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించబోం. తప్పు చేయని వారిపై కక్ష సాధింపులు ఏమీ ఉండవు. విభజన చట్టం మేరకు ఏపీకి రావాల్సిన వాటి గురించి అడుగుతాం. ప్రభుత్వంలో నా పాత్ర ఏంటో చంద్రబాబు నిర్ణయిస్తారు. ఒకే రాజధాని అమరావతి.. 3 పార్టీల నేతలు దీనికి కట్టుబడి ఉన్నాం. అన్ని జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం. వైకాపా ప్రభుత్వం చేసిన తప్పులు మేం చేయబోం. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెడతాం’’ అని లోకేశ్‌ స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని