Nara Lokesh: మంగళగిరిలో లోకేశ్‌ విజయదుందుభి

గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెదేపా యువనేత నారా లోకేశ్‌ ఘన విజయం సాధించారు.

Updated : 05 Jun 2024 07:34 IST

91,413 ఓట్ల మెజారిటీతో గెలుపు

ఆర్వో రాజకుమారి నుంచి ఎన్నిక ధ్రువపత్రం అందుకుంటున్న నారా లోకేశ్‌ 

ఈనాడు, అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెదేపా యువనేత నారా లోకేశ్‌ ఘన విజయం సాధించారు. 91,413 ఓట్ల భారీ మెజారిటీతో సమీప ప్రత్యర్థి.. వైకాపా అభ్యర్థి మురుగుడు లావణ్యను మట్టి కరిపించారు. 1985 తర్వాత తెదేపా గెలవని మంగళగిరిలో పార్టీ జెండా ఎగరేసి చరిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకున్నారు. 1985 తర్వాత పొత్తులో భాగంగా మిత్రపక్షాలకు ఈ సీటు కేటాయించగా.. ఆ తర్వాత 2014, 2019లో తెదేపా పోటీ చేసినా విజయం దక్కలేదు. ఈ గెలుపు కోసం లోకేశ్‌ తీవ్రంగా శ్రమించారు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రజలకు మరింత దగ్గరయ్యారు. నియోజకవర్గంలో ఎవరికి కష్టం వచ్చినా నేనున్నా అంటూ అండగా నిలిచారు. సొంత నిధులతో 29 రకాల సంక్షేమ పథకాలను అందించి ప్రజల మనసు చూరగొన్నారు.

ప్రతి హామీ నెరవేరుస్తాం

గుంటూరు (ఎ.ఎన్‌.యు.), న్యూస్‌టుడే: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తామని గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన తెదేపా (కూటమి) అభ్యర్థి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి 91,413 ఓట్ల మెజారిటీతో ఆయన భారీ విజయం సాధించారు. ఎన్నిక ధ్రువపత్రం తీసుకునేందుకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి వచ్చిన ఆయనకు పార్టీ కార్యకర్తలు, నేతలు ఘన స్వాగతం పలికారు. భారీ జన సందోహం మధ్య కౌంటింగ్‌ కేంద్రానికి వెళ్లి రిటర్నింగ్‌ అధికారి రాజకుమారి నుంచి ఆయన డిక్లరేషన్‌ అందుకున్నారు. అనంతరం లోకేశ్‌ మీడియాతో మాట్లాడుతూ తనకు భారీ విజయం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 1985 తరవాత మంగళగిరిలో తెదేపా గెలవలేదన్నారు. మంచి మెజారిటీ సాధిస్తానని తనకు ముందు నుంచే నమ్మకం ఉందని, దానిని నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మరింత బాధ్యతతో పనిచేసి మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని చెప్పారు. తమ కూటమిపై ప్రజలు పెద్ద బాధ్యత పెట్టారని, ముందు రాష్ట్రాన్ని సరైన దారిలో నడిపించడమే తమ ప్రాధాన్యమని వెల్లడించారు. సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. యువగళంలో ఇచ్చిన హామీ మేరకు చట్టానికి వ్యతిరేకంగా పనిచేసిన అధికారులపై న్యాయవిచారణ చేయిస్తానని, వారి ప్రమేయం ఉన్నట్లు తేలితే ఉద్యోగం నుంచి తొలగించి జైలుకి పంపిస్తామన్నారు. వైకాపా నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగబోమని తేల్చిచెప్పారు. ప్రజలకు సేవ చేయడమే తమ కర్తవ్యమని, ప్రజలకు ముందు చెప్పినట్లు వంద రోజుల్లో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని వివరించారు. తన తల్లిని అవమానించిన వారిని జైలుకు పంపే ఆలోచన లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ విభజన హామీలను సాధించేందుకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. వైకాపా చేసిన తప్పులను తాము చేయబోమన్నారు. ప్రతిపక్షం ఉందా? లేదా అనే అంశం ప్రస్తుతానికి అప్రస్తుతమన్నారు. రెవెన్యూ పెంపు, ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ చట్టం రద్దు, డీఎస్సీ ప్రకటించడంపైనే దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని