Narendra Modi: తిరుగులేని సమర సేనాపతి

వ్యూహం...ప్రతివ్యూహం...ఎన్నికల సమరంలో విజయాన్ని నిర్దేశించేది ఈ అంశాలే. ప్రత్యర్థుల ఎజెండాను కూడా తానే నిర్దేశించి వారి ఊహలకందని విధంగా ఫలితాలను సాధించడం ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకత.

Updated : 05 Jun 2024 07:26 IST

సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ హ్యాట్రిక్‌
ఆధిక్యం తగ్గినా ఆయనే అధినేత

వ్యూహం...ప్రతివ్యూహం...ఎన్నికల సమరంలో విజయాన్ని నిర్దేశించేది ఈ అంశాలే. ప్రత్యర్థుల ఎజెండాను కూడా తానే నిర్దేశించి వారి ఊహలకందని విధంగా ఫలితాలను సాధించడం ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకత. వరుసగా మూడో సార్వత్రిక ఎన్నికల్లోనూ ఎన్డీయేను గెలుపు బాట పట్టించి తన నాయకత్వ పటిమను మరోసారి చాటారు. సంఖ్యాపరంగా తొలి రెండు దఫాల కన్నా మెజారిటీ తగ్గినప్పటికీ...జాతీయ స్థాయిలో ఆయనే అగ్రగణ్య నేత.

ఈనాడు, దిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని వరుసగా విజయపథంలో నడిపించి తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత అంతటి ఘనతను సాధించిన కమలదళ నేతగా చరిత్ర పుటలకెక్కారు నరేంద్ర మోదీ. 1951, 1957, 1962 ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్‌ వరుస విజయాలు సాధించడంతో ఓటమి ఎరుగని నేతగా నెహ్రూ నిలిచారు. తొలి సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ 479 స్థానాల్లో పోటీచేసి 364 చోట్ల (76%) గెలిచింది. రెండో లోక్‌సభ ఎన్నికల్లో 490 మంది అభ్యర్థులను బరిలోకి దింపి 371 (దాదాపు76%) సీట్లు సాధించింది. మూడో ఎన్నికలో పోటీకి దిగిన 488 సీట్లలో 361 స్థానాలు (74%) చేజిక్కించుకొంది. ఆ తర్వాత ఏ ప్రధానీ వరుసగా మూడుసార్లు తమ సారథ్యంలోని పార్టీలను ఈ స్థాయిలో గెలిపించిన దాఖలాల్లేవు. ఇప్పుడు మోదీ నేతృత్వంలోని భాజపా సొంతంగా మేజిక్‌ ఫిగర్‌ను అందుకోలేకపోయినా దాని నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారాన్ని చేజిక్కించుకునే స్థాయిని చేరుకుంది. 2014లో సంపూర్ణ మెజార్టీతో అధికారం చేపట్టి 30 ఏళ్ల తర్వాత ఆ ఘనత సాధించిన తొలి ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారు. వరుసగా మరో రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ పైచేయి సాధించి నవభారత రాజకీయాల్లో తిరుగులేని నేతగా నిలిచారు.

నలుదిశలకూ జైత్రయాత్ర

ప్రధాని మోదీపై వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు లేకపోయినా ఆయన ప్రభుత్వం కొద్ది మంది పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వ్యవహరించిందని, నిరుద్యోగం, ధరల పెరుగుదల, రాజ్యాంగ వ్యవస్థల విధ్వంసం, మానవ హక్కుల హననం వంటి విమర్శలను ఎదుర్కొంది. అయినప్పటికీ ప్రజలు మాత్రం మోదీ నాయకత్వానికి మూడోసారి జైకొట్టారు. 2014 వరకు మధ్యతరగతి ప్రజల పార్టీగా ఉన్న భాజపాను ప్రధాని మోదీ  మరింత విస్తృతం చేయగలిగారు. ఉత్తరాది పార్టీ అనే ముద్రను చెరిపేసి తూర్పు, పడమర, దక్షిణాదికీ విస్తరించేలా చేశారు. కమలదళం అగ్రశ్రేణి నేతలు వాజ్‌పేయీ, ఆడ్వాణీలకు సాధ్యంకాని విజయాలను ఒడిసిపట్టుకొన్నారు.

వెనుకడుగు ఎరుగని జననేత

1950 సెప్టెంబరు 17న గుజరాత్‌లోని పేద కుటుంబంలో జన్మించిన నరేంద్ర మోదీ స్వశక్తితో ఒక్కో మెట్టు ఎక్కుతూ అందరూ అచ్చెరువొందే స్థాయికి చేరుకున్నారు. 2001లో అప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రి కేశూభాయ్‌ పటేల్‌ రాజీనామాతో ఖాళీ అయిన పీఠాన్ని అధిష్ఠించే అవకాశం దక్కించుకున్న నరేంద్ర మోదీ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. 2012 వరకు తన నేతృత్వంలో గుజరాత్‌లో నాలుగు దఫాలు భాజపా ప్రభుత్వాలకు విజయం చేకూర్చిపెట్టారు. 2014 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కమలం పార్టీ సంపూర్ణ మెజార్టీ సాధించిందంటే అందుకు కారణం మోదీ సమ్మోహన శక్తే. ప్రధాన మంత్రి పదవికి మోదీ మినహా మరెవరూ అర్హులు కాదన్న విశ్వాసాన్ని దేశ ప్రజల మనస్సులో నాటుకునేలా చేశారు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఆ నమ్మకం కొంత సడలినా అందరి కంటే ఆయనే ముందు వరుసలో ఉన్నారు. 

దృఢచిత్తం ఆయన సొంతం

 ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న పెద్దనోట్ల రద్దు, పాకిస్థాన్‌ భూభాగాల్లోని ఉగ్రమూకలపై మెరుపుదాడులు, రాజ్యాంగ అధికరణం 370 రద్దు, ముమ్మారు తలాక్‌ రద్దు, కొవిడ్‌ సమయంలో నిర్ణయాలు, పౌరసత్వ సవరణ చట్టం, అయోధ్యలో రామాలయ నిర్మాణం లాంటి అంశాలపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినప్పటికీ అవన్నీ సామాన్య ప్రజల్లో మోదీ ప్రతిష్టను తగ్గించలేక పోయాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆయన పార్టీని మించి ఎదిగిపోయారన్న భావనను కల్గించాయి. అందుకే ఈ ఎన్నికల్లో భాజపా వాగ్దానాలు అని చెప్పకుండా ‘మోదీ గ్యారంటీ’ పేరుతో విస్తృత ప్రచారం చేశారు. కమలం గెలుపు బాధ్యతలను తన భుజస్కంధాల మీద వేసుకున్నారు.

మోదీ స్వప్నం వికసిత భారత్‌

ప్రధానిగా మోదీ అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత భాజపాలో 75 ఏళ్ల వయసు నిండిన వారందర్నీ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంచుతూ వచ్చారు. వచ్చే ఏడాది మోదీ ఆ వయసుకు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో వయో పరిమితి నిబంధన ఆయనకూ వర్తిస్తుందా? అన్న చర్చ మొదలైంది. అయితే, ఈ వాదనలను తోసిపుచ్చుతూ మోదీ ఉన్నంత కాలం ఆయనే తమ నాయకుడని అమిత్‌ షా ప్రకటించారు. మరోవైపు మోదీ కూడా 2047నాటికి భారత్‌ను వికసిత(అభివృద్ధి చెందిన) దేశంగా చూడాలన్నదే తన కల  అని వెల్లడించారు. దీని ప్రకారం సమీప భవిష్యత్తులో రాజకీయ విరమణ చేసే ఉద్దేశం ఆయనకు లేదని స్పష్టమవుతోంది.


వారణాసిలో మోదీ హ్యాట్రిక్‌ 

లఖ్‌నవూ: ప్రధాని నరేంద్రమోదీ వరసగా మూడోసారి కూడా ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించారు. కాకపోతే మునుపటితో పోలిస్తే ఆధిక్యం మాత్రం తగ్గిపోయింది. కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌రాయ్‌పై మోదీ 1,52,513 ఓట్ల తేడాతో గెలుపొందారు. 2014లో ఆప్‌ అభ్యర్థి అరవింద్‌ కేజ్రీవాల్‌పై 3,71,784 ఓట్ల ఆధిక్యం సాధించిన మోదీ.. 2019లో దానిని 4,79,505 ఓట్లకు పెంచుకున్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా అజయ్‌రాయ్‌ పోటీ చేశారు. ఈసారి కూడా మోదీపై ఆయనే పోటీకి దిగారు. రికార్డుస్థాయి మెజార్టీని ప్రధాని సాధిస్తారని భాజపా ప్రచారం చేసినా వాస్తవ ఫలితం దానికి కొంత భిన్నంగా వచ్చింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని