Narendra Modi: మోదీకే పట్టం

దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది. తమ కూటమికి నాయకుడిగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి.

Updated : 06 Jun 2024 06:55 IST

9న ప్రమాణస్వీకార మహోత్సవం
ఎన్డీయే నాయకుడిగా ఏకగ్రీవ ఎన్నిక
మూడోసారి ప్రధాని పదవిని చేపట్టేందుకు మార్గం సుగమం
కూటమి సమావేశానికి హాజరైన చంద్రబాబు, నీతీశ్, పవన్‌కల్యాణ్‌
రేపు భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీ
17వ లోక్‌సభను రద్దు చేసిన రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రాజీనామా లేఖ సమర్పిస్తున్న ప్రధాని మోదీ 

ఈనాడు, దిల్లీ: దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది. తమ కూటమికి నాయకుడిగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. ఈ నెల 9న మోదీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఉండనుంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయేకు మెజార్టీ లభించిన నేపథ్యంలో నూతన సర్కారు ఏర్పాటు దిశగా బుధవారం వేగంగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలుత మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం.. తక్షణం 17వ లోక్‌సభను రద్దు చేయాలని తీర్మానించింది. మోదీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిసి ఆ తీర్మాన ప్రతిని అందజేశారు. తనతోపాటు మంత్రిమండలి రాజీనామానూ సమర్పించారు. దీంతో 17వ లోక్‌సభను రద్దు చేసిన రాష్ట్రపతి.. మంత్రిమండలి రాజీనామాకు ఆమోదముద్ర వేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేదాకా పదవుల్లో కొనసాగాలని  మోదీ సహా మంత్రులను కోరారు. 

మోదీని ప్రశంసిస్తూ తీర్మానం 

ప్రధాని అధికారిక నివాసంలో సాయంత్రం 4 గంటలకు ఎన్డీయే కూటమి నేతలు మోదీ అధ్యక్షతన సమావేశమయ్యారు. మోదీని తమ నాయకుడిగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన్ను ప్రశంసిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ‘‘గత పదేళ్లలో మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన ప్రజాసంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి రంగం అభివృద్ధి చెందడాన్ని 140 కోట్లమంది భారతీయులు చూశారు. దాదాపు 6 దశాబ్దాల అనంతరం దేశ ప్రజలు వరుసగా మూడోసారి సంపూర్ణ మెజార్టీతో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మోదీ నాయకత్వంలో కలిసికట్టుగా పోటీచేసి గెలిచినందుకు మేమంతా గర్విస్తున్నాం. ఇప్పుడు మేమంతా ఏకాభిప్రాయంతో ఆయన్ను మా నాయకుడిగా ఎన్నుకున్నాం. మోదీ నేతృత్వంలో ఎన్డీయే సర్కారు పేదలు, మహిళలు, యువత, రైతులు, పీడిత, వంచిత వర్గాల ప్రజల సేవకు కంకణబద్ధమై ఉంటుంది. దేశ వారసత్వ వైభవాన్ని సంరక్షిస్తూ సర్వతోముఖాభివృద్ధికి, ప్రతిఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు నిరంతరం కృషి చేస్తుంది’’ అని అందులో పేర్కొన్నారు.

విచ్చేసిన అతిరథ మహారథులు 

ఎన్డీయే సమావేశంలో భాజపా తరఫున పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, అమిత్‌ షా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి, కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్‌ పటేల్, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌ కూడా భేటీకి హాజరయ్యారు. మొత్తంగా 16 పార్టీలకు చెందిన 21 మంది కీలక నేతలు సమావేశంలో పాల్గొన్నారు.

మోదీకి చంద్రబాబు, నీతీశ్‌ శుభాకాంక్షలు

ఎన్డీయే సమావేశం ప్రారంభమైన వెంటనే మోదీకి నడ్డా పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం చంద్రబాబు, నీతీశ్‌.. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో దేశం కొత్త శిఖరాలకు చేరుకుందని మిగతా నాయకులంతా కొనియాడారు. జాతి నిర్మాణం కోసం ప్రధానమంత్రి చేస్తున్న కఠోర శ్రమను అభినందించారు. 2047 కల్లా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే విషయంలో మోదీ స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తున్నారని, ఆయన నేతృత్వంలో ఆ లక్ష్యాన్ని చేరుకునే ప్రయాణంలో తామూ భాగస్వాములం కావాలనుకుంటున్నామని ముక్తకంఠంతో చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారత ప్రతిష్ఠను పెంచడంలో, పేదరిక నిర్మూలనలో మోదీ కృషిని కొనియాడారు. మున్ముందు కూడా అదేతరహా సేవకు తామంతా కలిసికట్టుగా మద్దతిస్తామని వాగ్దానం చేశారు. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి సంపూర్ణ మెజార్టీ దక్కడాన్ని మోదీ చరిత్రాత్మకంగా అభివర్ణించారు. 

గోయల్‌కు మద్దతు లేఖల అందజేత 

సమావేశానంతరం ఎన్డీయే పక్షాల నేతలంతా.. మోదీ నాయకత్వానికి మద్దతిస్తున్నట్లు తమ పార్టీల తరఫున కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌కు లేఖలు అందజేశారు. ఇందులో భాగంగా చంద్రబాబునాయుడు ఆయన నివాసానికి వెళ్లి సుమారు 30 నిమిషాలపాటు సమావేశమయ్యారు.

రేపు రాష్ట్రపతి వద్దకు! 

కూటమిపరంగా లాంఛనాలన్నీ పూర్తికావడంతో.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరుతూ ఎన్డీయే నేతలంతా శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు అధికారికంగా విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. అంతకంటే ముందు- అదే రోజు భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశమై మోదీని తమ నాయకుడిగా ఎన్నుకోనుంది. అనంతరం ఎన్డీయే పక్షాల ఎంపీలు, ఎన్డీయే పక్షాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులంతా సమావేశమై ఆయన నాయకత్వానికి మద్దతు పలుకనున్నారు.


ఎన్డీయేలో లేకపోతే కలిసి ఎలా పోటీచేస్తాం?: చంద్రబాబు 

తాము ఎన్డీయేతోనే ఉన్నట్లు తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. ఎన్డీయే పక్షనేతల సమావేశంలో పాల్గొన్న అనంతరం దిల్లీలో గల్లా జయదేవ్‌ నివాసానికి ఆయన వచ్చారు. కూటమి భేటీ ఎలా జరిగిందంటూ అక్కడ విలేకర్లు ప్రశ్నించగా.. ‘ఫలవంతంగా సాగింది’ అని చంద్రబాబు బదులిచ్చారు. ‘మీరు ఎన్డీయేలో ఉన్నారా?’ అని అడిగినప్పుడు.. ‘‘ఎన్డీయేలో లేకపోతే కలిసికట్టుగా ఎలా పోటీ చేస్తాం? రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి పోటీ చేసినప్పుడు మీకెందుకు ఇలాంటి అనుమానాలొస్తున్నాయి’’ అని ఎదురుప్రశ్న వేశారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని