Modi 3.0 Cabinet: కీలక శాఖలు కమలం వద్దే

ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణం చేయడానికి రంగం సిద్ధమైంది. వరసగా మూడోసారి విజయంతో హ్యాట్రిక్‌ సాధించిన ఆయనతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయిస్తారు.

Updated : 09 Jun 2024 12:37 IST

కేంద్ర మంత్రివర్గ కూర్పుపై ముమ్మర కసరత్తు  
మిత్రపక్షాలతో సీనియర్‌ నేతల మంతనాలు 
కూటమి పార్టీలకు ఐదు నుంచి ఎనిమిది శాఖలు కేటాయిస్తారని సమాచారం
రామ్మోహన్‌నాయుడు, చిరాగ్‌ పాస్వాన్‌లకు క్యాబినెట్‌లో చోటు
హ్యాట్రిక్‌ ప్రధానిగా మోదీ ప్రమాణం నేడే 

నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు

దిల్లీ: ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ ఆదివారం సాయంత్రం ప్రమాణం చేయడానికి రంగం సిద్ధమైంది. వరసగా మూడోసారి విజయంతో హ్యాట్రిక్‌ సాధించిన ఆయనతో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణం చేయిస్తారు. దీనికి దేశ, విదేశీ అతిథులు హాజరు కానున్నారు. జవహర్‌లాల్‌ నెహ్రూ తర్వాత వరసగా మూడుసార్లు ప్రధాని పగ్గాలు చేపడుతున్న ఘనత మోదీకి దక్కుతుంది. ఎన్డీయే కూటమిలోని పక్షాలకు మంత్రివర్గ బెర్తులు ఎన్నెన్ని లభిస్తాయి, వాటిని పొందబోయేది ఎవరనే ఉత్కంఠ నెలకొంది. క్యాబినెట్‌ కూర్పుపై భాజపా సీనియర్‌ నేతలు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్, జె.పి.నడ్డా తమ కూటమిలోని భాగస్వాములతో చర్చిస్తున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందేలతో వారు మంతనాలు జరిపారు. హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలు వంటి కీలక శాఖలతోపాటు విద్య, సాంస్కృతిక వంటివి భాజపా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిత్రపక్షాలకు ఐదు నుంచి ఎనిమిది శాఖల్ని కేటాయిస్తారని సమాచారం. 

అమిత్‌ షా, రాజ్‌నాథ్‌లకు అవకాశం! 

భాజపా నుంచి అమిత్‌ షా, రాజ్‌నాథ్‌లకు కేబినెట్‌ బెర్తులు ఖాయమైనట్లే! లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గిన మాజీ ముఖ్యమంత్రులు శివరాజ్‌సింగ్‌ చౌహాన్, బసవరాజ్‌ బొమ్మై, మనోహర్‌లాల్‌ ఖట్టర్, సర్బానంద సోనోవాల్‌లకు; మిత్రపక్షాల నుంచి కింజరాపు రామ్మోహన్‌నాయుడు (తెదేపా); లలన్‌సింగ్‌ లేదా సంజయ్‌ఝా లేదా రామ్‌నాథ్‌ ఠాకుర్‌ (జేడీయూ); చిరాగ్‌ పాస్వాన్‌ (ఎల్‌జేపీ-రాంవిలాస్‌) వంటివారికి కేబినెట్‌ బెర్తులు లభించే అవకాశాలున్నాయి. మహారాష్ట్ర, బిహార్‌లలో కూటమి కొంతమేర దెబ్బతినడంతో అక్కడ పట్టుసాధించేలా కొందరిని కేబినెట్‌లో చేర్చుకుంటారని అంచనా వేస్తున్నారు. మహారాష్ట్రలో అక్టోబరులో, బిహార్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. భాజపాలో అంతర్గతంగా ఉన్న సవాళ్లు కూడా మంత్రివర్గ కూర్పుపై కసరత్తును కొంత క్లిష్టంగా మార్చాయి. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా నడ్డా పదవీకాలాన్ని పొడిగించిన విషయం తెలిసిందే. నడ్డాను క్యాబినెట్‌లోకి తీసుకుని, పార్టీ వ్యవహారాలను చక్కదిద్దే బాధ్యతను మరో కీలక నేతకు అప్పగించవచ్చని పార్టీవర్గాలు చెబుతున్నాయి. 


మాకు ఆహ్వానం రాలేదు

-కాంగ్రెస్‌ 

మోదీ ప్రమాణ వేడుక కోసం ఇండియా కూటమి నేతలకు ఇంకా ఆహ్వానం అందలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ చెప్పారు. ‘అంతర్జాతీయ నాయకులను మాత్రమే ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. మా నేతలకు ఇంకా అందలేదు. అందాక ఆ విషయంపై ఆలోచిస్తాం’ అని తెలిపారు. 


కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నా

-మస్క్‌ 

భారత ప్రధానిగా మరోసారి బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్రమోదీని అమెరికా సాంకేతిక దిగ్గజం ఎలాన్‌ మస్క్‌ అభినందించారు. భారత్‌తో కలిసి ఉత్తేజభరిత పని చేసేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పారు. ఆయన శుభాకాంక్షలకు ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశ జనాభా, ప్రతిభావంతులైన యువత, స్థిరమైన విధానాలు మంచి వ్యాపార అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు. టెస్లా కార్ల తయారీ కర్మాగారాన్ని భారత్‌లో నెలకొల్పే ప్రణాళికను మస్క్‌ ప్రకటిస్తారని భావిస్తున్నారు.


విదేశీ నేతల రాక 

మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనే నిమిత్తం ఏడు దేశాల అధినేతలు దిల్లీకి వస్తున్నారు. బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా, సీషెల్స్‌ ఉపాధ్యక్షుడు అహ్మద్‌ అఫీఫ్‌ శనివారం సాయంత్రమే దిల్లీ చేరుకున్నారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు, నేపాల్‌ ప్రధాని పుష్పకమల్‌ దహాల్, శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే, మారిషస్‌ ప్రధాని ప్రవిండ్‌ కుమార్‌ జగన్నాథ్, భూటాన్‌ ప్రధాని షెరింగ్‌ టోబ్గే రాబోతున్నారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. వేడుకకు 8,000 మందికి పైగా ప్రత్యేక అతిథులు హాజరు కానున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని