VK Pandian: ఒడిశాలో బీజేడీ ఓటమి.. రాజకీయాలకు వీకే పాండ్యన్‌ గుడ్‌బై

VK Pandian: వీకే పాండ్యన్‌ రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. బిజూ జనతా దళ్‌ ఓటమి నేపథ్యంలో వీడియో సందేశం విడుదల చేశారు.

Updated : 09 Jun 2024 18:43 IST

VK Pandian | భువనేశ్వర్‌: ఒడిశా మాజీ సీఎం నవీన్‌ పట్నాయక్‌ ఆంతరంగికుడిగా పేరొందిన మాజీ ఐఏఎస్‌ అధికారి వీకే పాండ్యన్‌ (VK Pandian) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ (BJD) ఓటమి నేపథ్యంలో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఆదివారం ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేశారు. తాను నవీన్‌ పట్నాయక్‌కు సహాయకారిగా ఉండాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ఇప్పుడు  రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. తన ప్రయాణంలో ఎవర్నైనా నొప్పించి ఉంటే క్షమించాలని కోరారు. అలాగే, తనపై జరిగిన ప్రచారం వల్ల పార్టీ ఓటమి పాలై ఉంటే అందుకూ క్షమించాలన్నారు. నవీన్‌ మరోసారి విజయం సాధించని పక్షంలో తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని గతంలో చెప్పిన పాండ్యన్‌.. అందుకు తగ్గట్టే తన నిర్ణయాన్ని వెలువరించారు.

తమిళనాడుకు చెందిన పాండ్యన్‌ ఒడిశా కేడర్‌ ఐఏఎస్‌ అధికారిగా రాష్ట్రానికి వచ్చి.. నవీన్‌ విధేయుడిగా మారి రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారు. ఎన్నికల ముందు ఉద్యోగానికి రాజీనామా చేసి బిజూ జనతా దళ్‌లో చేరారు. నవీన్‌ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే ఆయన్ను విమర్శకులు ‘సూపర్ సీఎం’ అని పిలిచేవారు. బయటివ్యక్తి అంటూ భాజపా బలమైన ముద్ర వేసింది. ఎన్నికల ప్రచార అస్త్రంగానూ వాడుకుంది. నవీన్‌ వారసుడంటూ ప్రచారం చేసింది. ఓ విధంగా ఒడిశాలో బీజేడీ అప్రతిహత విజయాలకు బ్రేక్‌ పడింది పాండ్యన్‌ వల్లేనన్న విశ్లేషణలు వినవస్తున్నాయి. 

పాండ్యన్‌ వైపే వేళ్లన్నీ..

ఒడిశాలో బిజూ జనతా దళ్‌ ఓటమి తర్వాత ఇప్పుడు వేళ్లన్నీ పాండ్యన్‌ వైపే చూపిస్తున్నాయి. పార్టీ ఘోర ఓటమికి పాండ్యనే బాధ్యుడని, సీనియర్‌ నాయకులను పక్కనపెట్టడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఎన్నికల సమీక్ష సందర్భంగా నవీన్‌ పట్నాయక్‌ ముందే పలువురు నేతలు ప్రస్తావించినట్లు తెలిసింది. గతంలో పాండ్యన్‌ లేకుండా ఏ చర్చ కూడా జరపని నవీన్‌ కూడా.. ఆయన లేకుండానే సమీక్ష నిర్వహించడం గమనార్హం.

మరోవైపు నవీన్‌ మాత్రం పాండ్యన్‌ను వెనుకేసుకొచ్చారు. ఉత్తముడని, నిజాయతీగా విధులు నిర్వహించారని విలేకరుల సమావేశంలో కొనియాడారు. పార్టీ కోసం అంకిత భావంతో పనిచేశారని, ఆయన ఎలాంటి తప్పు చేయలేదన్నారు. పాండ్యన్‌ తన రాజకీయ వారసుడు కాదని, ప్రజలే భవిష్యత్తులో వారసుడిని నిర్ణయిస్తారని వెల్లడించారు. అయితే, తన హయాంలో పాలనను పాండ్యన్‌కు అప్పగించేసిన నవీన్‌ పట్నాయక్‌కు.. ఓటమి పాలైనా జ్ఞానోదయం కాలేదని భాజపా రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు బిరించి త్రిపాఠి ఎద్దేవాచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని