కేంద్రంలో ఎన్‌డీఏకు మెజార్టీ.. కీలక పాత్ర పోషించనున్న తెదేపా, జేడీయూ

కేంద్రంలో ఈ సారి సంకీర్ణ ప్రభుత్వం తప్పదని ఫలితాలు చూస్తే దాదాపు అర్థమైపోతోంది. భాజపా మ్యాజిక్‌ ఫిగర్‌కు కనీసం 30 స్థానాలకు దూరంగా ఆగిపోయే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తన స్కోర్‌ రెట్టింపు చేసుకున్నా.. అది అధికారం చేపట్టే స్థాయిలో లేదు. 

Published : 04 Jun 2024 18:05 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ మెజార్టీని సాధించింది. గతంతో పోలిస్తే దాదాపు 50కి పైగా సీట్లు తగ్గినా.. కూటమిలోకి పునరాగమనం చేసిన తెదేపా, జేడీయూలకు చెప్పుకోదగ్గ స్థాయిలో స్థానాలు రావడంతో 272 మార్కును సులువుగా దాటేసింది. కూటమిలో భాజపా అతిపెద్ద పార్టీగా నిలిచినా.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని మాత్రం సొంతంగా సాధించలేకపోయింది. మిత్రపక్షాల మద్దతుతో ప్రధాని అభ్యర్థిని నిర్ణయించే అవకాశం ఉంది.

కలిసొచ్చిన పొత్తులు..

రెండుసార్లు పరిపాలించడంతో చాపకింద నీరులా పెరిగిపోయిన వ్యతిరేకతను భాజపా అగ్రనాయకత్వం ముందే గ్రహించినట్లుంది. దీంతో ఓ మెట్టు దిగి పొత్తులు పెట్టుకొంది. ఈ క్రమంలోనే బిహార్‌లో నీతీశ్‌కు ఆహ్వానం పలికింది. మరోవైపు పాత మిత్రుడు చంద్రబాబుతోనూ దోస్తీ చేసింది. ఈ నిర్ణయం సరైందని తేలింది. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఎన్‌డీఏకు వ్యతిరేక పవనాలు వీచి సీట్లు తగ్గినా.. ఈ రెండు చోట్ల మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలు  లభించాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వ ఏర్పాటులో ఈ రెండు పార్టీలే కింగ్‌మేకర్ల పాత్రను పోషించనున్నాయి. ఏపీలో తెదేపా 16, జనసేన 2, భాజపా 3 స్థానాలు సాధించాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి చంద్రబాబు శ్రద్ధ చూపడం.. గెలుపు గుర్రాలకే టికెట్లను ఇవ్వడంతో కూటమి విజయం నల్లేరుపై బండి నడకలా సాగింది. పొరుగునున్న ఉత్తరప్రదేశ్‌ మాదిరిగా బిహార్‌లో కూటమి దెబ్బతినలేదు. జేడీయూ, భాజపా, ఎల్‌జేపీ కలిసి 30 స్థానాలు దక్కించుకొన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనే ఎన్‌డీఏకు 51 స్థానాలు రావడం విశేషం.

కేరళలో బోణీ..

అందరూ అనుకున్నట్లే ఈ సారి భాజపా దక్షిణాదిన కేరళలో బోణీ కొట్టింది. త్రిసూర్‌ నుంచి పోటీ చేసిన సినీనటుడు సురేష్‌ గోపీ విజయం సాధించాడు.

ఆ రాష్ట్రాల్లో క్లీన్‌ స్వీప్‌..

ఎన్‌డీఏ కూటమి మిత్ర పక్షాలతో కలిసి మధ్యప్రదేశ్‌, దిల్లీ, సిక్కిం, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, త్రిపుర, దామన్‌లో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈ రాష్ట్రాల్లో ఇండియా పక్షం ఖాతా కూడా తెరవలేదు. తెలంగాణలో భాజపా సీట్ల సంఖ్యను 4 నుంచి 8కి పెంచుకొంది. పెద్ద సంఖ్యలో సీట్లున్న యూపీ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో కొంత దెబ్బతినడంతో మెజార్టీ గణనీయంగా తగ్గింది.

లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా భాజపా

లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా భాజపా నిలిచింది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, ఝార్ఖండ్‌ వంటి రాష్ట్రాల్లో పార్టీ రాణించడం, తెలంగాణ, ఒడిశా వంటి చోట్ల సీట్లను మెరుగు పర్చుకోవడం నష్టని వారణకు కారణమైంది.

ఏపీకి మంచి రోజులు..

పదేళ్ల నుంచి ఏపీలో గెలిచిన అభ్యర్థులకు కేంద్రంలో కీలక పాత్ర పోషించే అవకాశాలు దక్కలేదు. ఈసారి తెదేపా మద్దతుతోనే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలో పోలవరం వంటి ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు వేగం పుంజుకునే అవకాశాలున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు