లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌.. ఆధిక్యంలో మెజార్టీ మార్క్‌ దాటిన ఎన్డీయే

ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా తొలిగంటల్లో ఫలితాల సరళి వెల్లడవుతోంది. భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఆధిక్యంలో మెజార్టీ మార్కు దాటింది. 

Updated : 04 Jun 2024 10:10 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల సమరంలో చివరి అంకమైన కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. మరోసారి ఎన్డీయేదే అధికారమని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ముక్తకంఠంతో తేల్చిచెప్పగా.. ఫలితాలు అందుకు విరుద్ధంగా ఉంటాయని విపక్ష ఇండియా కూటమి నేతలు వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో 542 లోక్‌సభ స్థానాలకు జరుగుతోన్న ఓట్ల లెక్కింపులో భాజపా నేతృత్వంలోని కూటమి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఆధిక్యంలో మెజార్టీ మార్కును దాటేసింది. (lok sabha elections 2024)

ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు కావాల్సిన కనీస మెజార్టీ 272. గుజరాత్‌లోని సూరత్‌ లోక్‌సభ స్థానంలో భాజపా అభ్యర్థి ముకేశ్‌ దలాల్‌ ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కాబట్టి.. మిగిలిన 542 సీట్లలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ప్రస్తుతానికి భాజపా 294 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా..  కాంగ్రెస్, దాని భాగస్వామ్య పార్టీలకు చెందిన అభ్యర్థులు 188 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇతరులు 51 స్థానాల్లో ముందున్నారు. 

తొలిగంటల్లో మహారాష్ట్రలో రెండు కూటముల మధ్య పోటీ హోరాహోరీగానే ఉంది. ఎన్డీయే 22 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుండగా.. ఇండియా కూటమి 23 స్థానాల్లో ముందజలో ఉంది. ఇక పశ్చిమ్‌ బెంగాల్ పరిస్థితి అలాగే ఉంది. ఒంటరిగా బరిలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ 22 సీట్ల ఆధిక్యంలో ఉండగా.. భాజపా 16 సీట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. కేంద్రంలో అధికారాన్ని ఏర్పాటు చేయడంలో అత్యంతకీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ టఫ్ ఫైట్ కనిపిస్తోంది. భాజపా 40 స్థానాల్లో  ముందువరుసలో ఉండగా..ఇండి కూటమి 39నియోజకవర్గాల్లో ఆధిక్యంలో ఉంది. అక్కడ మొత్తం 80 లోక్‌సభ స్థానాలున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని