సంక్షోభం అంచునే హిమాచల్‌.. రెబల్ వర్గం వైపు మరికొందరు ఎమ్మెల్యేలు

హిమాచల్(Himachal Pradesh) సంక్షోభం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. తమతో మరో 9 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ రెబల్‌ ఎమ్మెల్యే ఒకరు చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. 

Published : 02 Mar 2024 19:13 IST

శిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌ (Himachal Pradesh)లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. అందుకు అక్కడి నేతల వ్యాఖ్యలు బలం చేకూర్చుతున్నాయి. తమతో మరికొందరు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ రెబల్‌ ఎమ్మెల్యే రాజీందర్ రాణా వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు (Sukhvinder Singh Sukhu) పాలనలో వారంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారన్నారు. ఈమేరకు ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు.

‘‘సుఖు స్నేహితులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మంత్రులు, ఎన్నికైన ప్రజాప్రతినిధులకు తగిన గౌరవం లభించడం లేదు. క్రాస్‌ ఓటింగ్‌లో పాల్గొన్న తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాకుండా మరో తొమ్మిది మంది మాతో టచ్‌లో ఉన్నారు. మంత్రి విక్రమాదిత్య సింగ్‌ దిల్లీకి వెళ్తూ మమ్మల్ని కలిశారు. ప్రభుత్వంతో సర్దుబాటు చేసుకోమని మాకు చెప్పలేదు. ప్రభుత్వంతో ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మాకు తిరిగివచ్చే ఉద్దేశం లేదు’’ అని రాణా స్పష్టంచేశారు.

క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడటంపై స్పందిస్తూ.. ‘‘రాష్ట్రానికి చెందిన ఎంతోమంది నేతలు ఉండగా.. బయటినుంచి వచ్చిన అభిషేక్‌ మను సింఘ్వీని నిలబెట్టడంతో మేం కలత చెందాం. హిమాచల్ ప్రయోజనాల కోసమే అలా చేశాం’’ అని వెల్లడించారు. 68మంది సభ్యులున్న హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 40, భాజపాకు 25 మంది ఎమ్మెల్యేలున్నారు. మరో ముగ్గురు స్వతంత్రులు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు కాంగ్రెస్‌, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు భాజపాకు ఓటేశారు. దీంతో కాంగ్రెస్‌, భాజపాలకు 34 చొప్పున ఓట్లు వచ్చాయి. ఫలితం టై కావడంతో నిబంధనల ప్రకారం లాటరీ తీశారు. అందులో భాజపాకు చెందిన హర్ష్‌ మహాజన్‌ను అదృష్టం వరించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సింఘ్వీ పరాజయం పాలయ్యారు.

ఈ క్రాస్‌ ఓటింగ్ తర్వాత ఆరుగురు ఎమ్మెల్యేలపై సుఖు సర్కార్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం సంక్షోభం ముగిసిందని కాంగ్రెస్ పరిశీలకులు ప్రకటించారు. కానీ ఆ వెంటనే ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ ప్రతిభాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమకంటే ప్రధాని మోదీ నేతృత్వంలోని భాజపా మెరుగ్గా పనిచేస్తోందని ఆమె మాట్లాడటం చర్చనీయాంశమైంది. ఇదిలాఉంటే.. ఆమె కుమారుడు విక్రమాదిత్య సింగ్‌ ఫేస్‌బుక్‌ బయో నుంచి తన అధికారిక గుర్తింపు తొలగించారు. ఆయన ఇప్పటివరకు పీడబ్ల్యూడీ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని