ఒకే విమానంలో నీతీశ్‌, తేజస్వి.. కీలక భేటీల వేళ ఆసక్తికర పరిణామం

ఎన్నికల ఫలితాలు విడుదలైన వేళ భవిష్యత్తు కార్యాచరణపై అధికార, విపక్ష కూటములు చర్చలకు పిలుపునిచ్చాయి. ఈ సమయంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 

Updated : 06 Jun 2024 00:26 IST

దిల్లీ: ఈ సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో భాజపా సొంతంగా 272  సీట్ల మెజార్టీ మార్కును దాటలేకపోవడం, అటు విపక్ష ‘ఇండియా’ కూటమి అనూహ్యంగా పుంజుకున్న తరుణంలో బుధవారం రాజకీయ పక్షాలు కీలక భేటీలు నిర్వహిస్తున్నాయి. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నాయి. ఈ తరుణంలో ఓ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బిహార్‌ సీఎం, జేడీయూ అగ్రనేత నీతీశ్‌కుమార్, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ ఒకే విమానంలో దిల్లీకి బయల్దేరడం గమనార్హం. వేర్వేరు కూటములకు చెందిన వీరు ఒకే విమానంలో ప్రయాణించడం చర్చనీయాంశంగా మారింది.

ఇదిలాఉంటే మంగళవారం ఫలితాల వేళ జేడీయూ నేత కేసీ త్యాగి మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ ఎన్డీయే బ్లాక్‌లోనే కొనసాగుతుందన్నారు. ఇండియా కూటమిలో చేరుతుందనే ఊహాగానాలను తిరస్కరించారు. ప్రస్తుతం భాజపా నేతృత్వంలోని కూటమిలో తెదేపా, జేడీయూ కీలక పాత్ర పోషించనున్నాయి. చంద్రబాబు, నీతీశ్‌లు గతంలో ఎన్డీయే భాగస్వాములుగా ఉన్నా రాజకీయ వైరుద్ధ్యాల కారణంగా బయటికి వచ్చి ఈ సార్వత్రిక ఎన్నికలకు ముందే తిరిగి కలిసిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంటే.. మిత్రపక్షాలను మార్చడం ద్వారా బిహార్‌లో సుదీర్ఘకాలంగా అధికారంలో కొనసాగుతున్న నీతీశ్‌కుమార్‌.. భాజపాకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ‘ఇండియా’ కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే, ‘ఇండియా’ కూటమి కన్వీనర్‌గా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికైనప్పటినుంచి నీతీశ్‌ అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే ‘ఇండియా’ కూటమిని వీడి తిరిగి ఎన్డీయే గూటికి చేరి తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ కూటమికి 30 సీట్లు రాగా, అందులో 12 మంది జేడీయూ ఎంపీలే.

ఇక, తమ భాగస్వామ్య పక్ష పార్టీలతో సమావేశాల్లో పాల్గొనేందుకు ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌, జేడీఎస్‌ అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి, ఎల్‌జేపీ (రామ్‌విలాస్‌) అధినేత చిరాగ్ పాసవాన్‌ దిల్లీకి బయల్దేరి వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని