Amit Shah: కల్యాణ్‌ సింగ్‌ ఆకాంక్షను మోదీ నెరవేర్చారు: అమిత్‌ షా

రామమందిరం అంశాన్ని కాంగ్రెస్‌ (Congress) ఏళ్ల తరబడి సాగదీస్తూ వచ్చిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ (Narendra modi) బలమైన సంకల్పం కారణంగానే రామ మందిర నిర్మాణం పూర్తి కావొస్తోందని చెప్పారు.

Published : 22 Aug 2023 01:54 IST

లఖ్‌నవూ : భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌ (Congress) ప్రభుత్వం రామమందిర అంశంతో కాలయాపన చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ (Narendra modi) బలమైన సంకల్పంతో మందిర నిర్మాణానికి మార్గం సుగమం చేసి మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌ సింగ్‌ ఆకాంక్షను నెరవేర్చాని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌ రెండో వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ‘హిందూ గౌరవ్‌ దివాస్’ సభలో అమిత్‌ షా మాట్లాడారు. ‘బాబూజీ (కల్యాణ్‌ సింగ్‌) చేసిన ప్రారంభానికి నరేంద్రమోదీ ఒక రూపునిచ్చారు. గడిచిన 9 ఏళ్లలో బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని’ చెప్పారు. కల్యాణ్‌సింగ్‌కు నివాళిగా 2024లో ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో భాజపాను గెలిపించడానికి కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దాంతో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం భాజపాకు కంచుకోట అనే సందేశం దేశం మొత్తానికి వెళ్తుందని ఆకాంక్షించారు. 

రెండు చోట్ల నుంచి సీఎం కేసీఆర్‌ పోటీ.. భారాస అభ్యర్థుల తొలి జాబితా విడుదల

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్‌ బాధ్యతలు స్వీకరించిన తరువాతే రామ మందిర ఉద్యమానికి ఊపు వచ్చిందని షా పేర్కొన్నారు. బాబూజీ ప్రారంభించిన పనిని ప్రధాని నరేంద్రమోదీ పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ రామ మందిరం అంశాన్ని సాగదీస్తూ వచ్చిందని షా విమర్శించారు. అత్యున్నత న్యాయం స్థానం తీర్పు వెలువరించిన తరువాత ప్రధాని నరేంద్రమోదీ ఎలాంటి రక్తపాతం లేకుండా భూమిపూజ జరిగేలా చూశారని కొనియాడారు. ప్రధాని మోదీ నాయకత్వ కృషి ఫలితంగా 550 ఏళ్ల తర్వాత మళ్లీ రామ్‌లల్లా తన మహోన్నత ఆలయంలో ఉండనున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులకు ఇది సంతృప్తి, గర్వం కలిగించే రోజు అని షా వ్యాఖ్యానించారు. 

రామభక్తులైన కరసేవకులు అయోధ్యను చుట్టుముట్టినప్పుడు బుల్లెట్లు ప్రయోగించి వారిని ఆపాలని కల్యాణ్‌సింగ్‌కు ఆదేశాలు అందాయని షా తెలిపారు. అలా చేయడం ఇష్టం లేక సీఎం పదవికే ఆయన రాజీనామా చేశారని గుర్తు చేశారు. కల్యాణ్‌ సింగ్‌ ఇచ్చిన సలహాలు, సూచనల కారణంగానే 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో 73 చోట్ల ఎన్డీయే విజయ దుందుభి మోగించిందన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని