YS JAGAN: గులకరాయి గురితప్పింది.. ఈసారి ఫలించని జగన్‌ సానుభూతి నాటకం!

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తెదేపాపై అభాండాలు మోపి... రాజకీయంగా లబ్ధి పొందేందుకు కోడికత్తి దాడి ఘటనను అడ్డం పెట్టుకున్న జగన్‌మోహన్‌రెడ్డి ఈసారి గులకరాయి ఘటనను అలాగే మలుచుకునేందుకు యత్నించారు.

Updated : 05 Jun 2024 11:23 IST

గత ఎన్నికల్లో పనిచేసిన  ‘కోడికత్తి’ బాగోతం 

ఈనాడు, అమరావతి: గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తెదేపాపై అభాండాలు మోపి... రాజకీయంగా లబ్ధి పొందేందుకు కోడికత్తి దాడి ఘటనను అడ్డం పెట్టుకున్న జగన్‌మోహన్‌రెడ్డి ఈసారి గులకరాయి ఘటనను అలాగే మలుచుకునేందుకు యత్నించారు. గులకరాయి తగిలిందని తనపై హత్యాయత్నం చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేయించుకున్నారు. నుదుటిపై బ్యాండేజీతో ఎన్నికల ప్రచారంలో పాల్గొని సానుభూతి పొందేందుకు ప్రయత్నించారు. అప్పట్లో దళిత యువకుడు జనపల్లి శ్రీనివాసరావును బలి చేసినట్లుగానే.. ఈసారి బీసీ యువకుడు వేముల సతీష్‌ను బలిపశువు చేయాలని చూశారు. తనను చంపించేందుకు తెదేపా నాయకులే అతనితో దాడి చేయించారంటూ నమ్మబలకాలని చూశారు. అయితే ఈసారి జగన్‌ కుతంత్రం పారలేదు. వాటిని జనం విశ్వసించలేదు. దీన్ని మరో కోడికత్తి 2.0 నాటకంగా భావించి జగన్‌కు గుణపాఠం చెప్పారు. 

నుదుటిపై బ్యాండేజీతో నవ్వులపాలు 

గులకరాయి ఘటనలో గాయపడిన వెంటనే జగన్‌ ప్రచార వాహనంలోనే ప్రథమ చికిత్స చేయించుకుని తిరిగి బస్సు యాత్రను కొనసాగించారు. అదేరోజు రాత్రి విజయవాడ జీజీహెచ్‌కు వెళ్లి చికిత్స తీసుకున్నారు. ఆసుపత్రి లోపలికి వెళ్లేటప్పుడూ గాయానికి చిన్న బ్యాండేజ్‌ వేసుకుని వెళ్లారు. బయటకొచ్చేటప్పుడూ చిన్న ప్లాస్టర్‌తో కనిపించారు. రెండు రోజుల తర్వాత అదే గాయంపైన కొంచెం పెద్ద ప్లాస్టర్‌ వేసుకున్నారు. ఆ తర్వాత దాని పరిమాణాన్ని కొద్దికొద్దీగా పెంచుకుంటూ వచ్చారు. దాదాపు 15 రోజులపాటు ఆ బ్యాండేజీతోనే బస్సు యాత్రలో పాల్గొంటూ సానుభూతి పొందాలని చూశారు. యాత్ర ముగిసిన వెంటనే ప్లాస్టర్‌ తీసేశారు. జగన్‌కు తగిలిన గులకరాయే తన కంటికి సైతం తగిలిందంటూ వైకాపా నాయకుడు వెలంపల్లి శ్రీనివాసరావు అయితే కంటికి పెద్ద కట్టుకుని, దానిపై కళ్లద్దాలు పెట్టుకుని నాటకాన్ని రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ చూసి జనం నవ్వుకున్నారు. 

తెదేపాకు ఆపాదించేందుకు విఫలయత్నం 

కోడికత్తి కేసును ఎలాగైతే తెదేపాపై నెట్టేస్తూ దుష్ప్రచారం చేశారో... అదే తరహాలో గులకరాయి కేసును కూడా తెదేపాకే ఆపాదించేందుకు ప్రయత్నించారు. దీనిపై ఏకంగా హత్యాయత్నం కేసు నమోదు చేయించి... కొందరిని అదుపులోకి తీసుకుని.. తెదేపా నాయకుల పేర్లు చెప్పాలని వారిపై ఒత్తిడి చేశారు. చివరికి వేముల సతీష్‌ అనే యువకుడిని నిందితుడిగా పేర్కొని జైల్లో పెట్టారు. తనకు ఆ ఘటనతో ఏ సంబంధమూ లేదని ఎంత మొత్తుకున్నా పోలీసులు వినలేదని, నేరం అంగీకరించాల్సిందేనంటూ తుపాకీ పెట్టి మరీ బెదిరించారని, తన తల్లిదండ్రుల్ని చంపేస్తామన్నారని సతీష్‌ కన్నీటి పర్యంతమయ్యారు. ఆయనకు బెయిల్‌ రానివ్వకుండా చివరి క్షణం వరకూ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నించింది. కింది కోర్టు బెయిల్‌ మంజూరు చేస్తే దాన్ని అడ్డుకునేందుకు హైకోర్టును ఆశ్రయించగా. న్యాయస్థానం అందుకు నిరాకరించింది. దీంతో నెలన్నర రోజులపాటు జైల్లో మగ్గిన సతీష్‌ రెండు రోజుల కిందటే విడుదలయ్యారు. ఇవన్నీ జగన్‌పై ప్రజల్లో ప్రతికూలతకు కారణమయ్యాయి. 

రాజకీయ కుట్ర లేదని తేల్చేసినా... 

కోడికత్తి కేసుతో తెదేపాకు ఎలాంటి సంబంధమూ లేదని, రాజకీయ కుట్ర లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ఆధారాలతో సహా తేల్చేసినా... మరింత లోతైన దర్యాప్తు జరపాలంటూ పదేపదే కోర్టులను ఆశ్రయిస్తూ కేసు విచారణ ముందుకు సాగకుండా చేశారు. బాధితుడిగా కోర్టు ముందుకొచ్చి సాక్ష్యం చెప్పాలని న్యాయాధికారి ఆదేశించినా... హాజరవకుండా ట్రాఫిక్‌ సమస్యలను సాకుగా చూపారు. 2024 సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యేంత వరకు ఈ కేసును కొలిక్కి రానీయకూడదనే లక్ష్యంతోనే కాలయాపన ఎత్తుగడలు అమలు చేశారు. శ్రీనివాసరావు బయటకొస్తే.. అసలు నిజానిజాలేంటో వెలుగులోకి వచ్చి రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతోందనే భయం, ఆందోళనతో బెయిల్‌ రాకుండా అడ్డుకున్నారు. తన రాజకీయ స్వార్థం కోసం ఓ దళిత యువకుడి జీవితాన్ని బలిచేశారు. ఫలితంగా జనపల్లి శ్రీనివాసరావు అయిదేళ్లపాటు విచారణ ఖైదీగానే జైలు గోడల మధ్య మగ్గిపోయారు. అటు విచారణ ముందుకు సాగనీయక, ఇటు బెయిలూ రానివ్వక నిరుపేద యువకుడి జీవితంతో చెలగాటమాడారు. చివరికి అసలు నాటకం బయటికొచ్చి... జగన్‌ ఓటమికి బాటలు వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని