Jupally: కొత్త బ్రాండ్ల మద్యం కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు: మంత్రి జూపల్లి

తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామనేది దుష్ప్రచారమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Published : 21 May 2024 16:44 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామనేది దుష్ప్రచారమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదని, అసలు పరిశీలనే జరగలేదని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దొంగే దొంగ అన్నట్లుగా భారాస నేతల మాటలు ఉన్నాయి. గత ప్రభుత్వం చాలా శాఖల్లో బిల్లులు పెండింగ్‌లో పెట్టింది. రైతు భరోసాకు సంబంధించి రూ.6వేల కోట్లకు పైగా చెల్లింపులు మా ప్రభుత్వంలో జరిగాయి. ఈ నెలలోనే రూ.370 కోట్ల చెల్లింపులు చేశాం. 

మద్యం కొరత ఉంటే ప్రభుత్వానికే నష్టం.. ప్రజలకు కాదు. బ్లాకులో అమ్మిన ఘటనలపై ఎక్సైజ్‌ శాఖ కేసులు నమోదు చేసింది. టానిక్‌లకు గత ప్రభుత్వం ఇచ్చిన పన్ను మినహాయింపులను రద్దు చేశాం. తయారీ యూనిట్ల వద్ద ఎలాంటి అక్రమాలు జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పోలీసులు నిరంతరం పరిశీలిస్తున్నారు. గతంలో పైరవీలు, ముడుపులు ఉంటే తప్ప ఉద్యోగుల బదిలీలు జరిగేవి కావు. ఇప్పుడు అలాంటివేవీ లేకుండానే పోర్టల్‌ ద్వారా బదిలీలు జరుగుతున్నాయి. తప్పుడు రాతలు రాసిన పత్రికపై పరువునష్టం దావా వేస్తాం. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత ఎక్సైజ్‌శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తాం’’ అని జూపల్లి తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని