BJP: అది ‘పరివార్‌ బచావో’ ర్యాలీ.. ఇండియా కూటమి సభపై భాజపా

BJP: దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఇండియా కూటమి దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నేడు భారీ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై భాజపా మండిపడింది.

Updated : 31 Mar 2024 11:53 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో ‘లోక్‌తంత్ర బచావో ర్యాలీ’ పేరిట విపక్ష ‘ఇండియా కూటమి’ నిర్వహిస్తున్న ర్యాలీపై అధికార భాజపా (BJP) విరుచుకుపడింది. అది ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ కాదని.. ‘కుటుంబాన్ని రక్షించండి.. అవినీతిని కప్పిపుచ్చండి’ అనే కార్యక్రమమని ఎద్దేవా చేసింది. తమ పాత నేరాలన్నింటినీ కప్పిపుచ్చుకనే పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయని భాజపా ఎంపీ సుధాంశు త్రివేది ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు. ఒకప్పుడు అవినీతి వ్యతిరేక ఉద్యమానికి వేదికగా నిలిచిన రామ్‌లీలా మైదానంలో ఇప్పుడు అవినీతిపరులను చూడబోతున్నామన్నారు. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఇండియా కూటమి (INDIA Bloc) దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నేడు భారీ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

భాజపా వ్యాఖ్యలపై ఇండియా కూటమిలోని శివసేన (యూబీటీ) నేత ఉద్ధవ్‌ ఠాక్రే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అవినీతిపరులందరినీ భాజపా దర్యాప్తు సంస్థల ద్వారా బెదిరించి పార్టీలో చేర్చుకుంటోందని ఆరోపించారు. ప్రఫుల్ పటేల్‌, నవీన్‌ జిందాల్, గాలి జనార్దన్‌ రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేసిన భాజపా ఇప్పుడు వారందరినీ పార్టీలో చేర్చుకుందన్నారు. దీంతో భాజపా- ‘భ్రష్ట్‌ జనతా పార్టీ’గా మారిందని అన్నారు. పదే పదే కుటుంబం ప్రస్తావన తీసుకొచ్చే ఆ పార్టీ నేతలకు అసలు ఆ పదానికి అర్థమే తెలియదని ఎద్దేవా చేశారు. కుటుంబం అంటే బాధ్యత అని వ్యాఖ్యానించారు. ‘మేరా పరివార్‌..’ అంటూ ప్రచారం ప్రారంభించిన వారు.. అందరి బాధ్యతను తీసుకోవాలని అన్నారు. ఎన్నికల బాండ్లు బహిర్గతం కావడంతో భాజపా అసలు రంగు బయటపడిందన్నారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇండియా కూటమి ర్యాలీలో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) సతీమణి సునీత కూడా పాల్గొననున్నారు. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ సందేశాన్ని ఆమె చదివి వినిపిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ ర్యాలీలో రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే, శరద్‌ పవార్‌, ఉద్ధవ్‌ ఠాక్రే, అఖిలేశ్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌ సహా పలువురు హాజరు కానున్న విషయం తెలిసిందే.

మరోవైపు విపక్ష పార్టీల ర్యాలీ నేపథ్యంలో దిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని