Mallikarjun Kharge: మా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: ఖర్గే

విపక్ష కూటమి బలంగా పుంజుకొందని కాంగ్రెస్‌ అధినేత అభిప్రాయపడ్డారు. ఉత్తరాదిన భాజపా గణనీయంగా సీట్లను కోల్పోతోందని జోస్యం చెప్పారు. 

Published : 21 May 2024 11:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ వ్యాప్తంగా ఐదు విడతల పోలింగ్‌ ముగిసే నాటికి విపక్ష కూటమి బలంగా పుంజుకొందని కాంగ్రెస్‌ (Congress) అధినేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) విశ్వాసం వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం, రాజ్యాంగానికి ముప్పు, ప్రజాస్వామ్యంపై దాడి వంటివే ప్రధాన అంశాలుగా ఎన్నికలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఆయన ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. 

2019 ఎన్నికలతో పోలిస్తే 2024లో తాము ప్రతి రాష్ట్రంలో బాగా మెరుగుపడినట్లు ఖర్గే తెలిపారు. భాజపాను ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా అడ్డుకొంటామన్న విశ్వాసం ఉందన్నారు. ప్రభుత్వంతో పోరాడేందుకు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారని.. తాము వారికి సాయం చేస్తున్నామని పేర్కొన్నారు. 

ఇక బిహార్‌లో కాంగ్రెస్‌-ఆర్జేడీ కలిసి భాజపా భావజాలంపై పోరాడుతున్నాయని వెల్లడించారు. దళిత, వెనుకబడిన వర్గాలు బలంగా తమ కూటమికి మద్దతు పలుకతున్నాయన్నారు. ఇక యూపీలో 2019లో ఎస్పీ, కాంగ్రెస్‌ వేర్వేరుగా పోటీచేయడంతో నాడు బలహీనపడినట్లు అంచనావేశారు. ఈ సారి ఇరు పార్టీల నేతలు కలిసి ప్రచారం చేయడం కూడా కూటమికి కలిసొచ్చే అంశమన్నారు. రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో పార్టీ గతం కంటే ఎక్కువ సీట్లను సాధిస్తోందన్నారు. మహారాష్ట్రలో ఎంఏవీ అలయన్స్‌ మంచి సంఖ్యలో స్థానాలను సాధిస్తుందన్నారు. 

గతంలో యూపీఏ అధికారంలో ఉన్న రెండు విడతల్లో కాంగ్రెస్‌కు 140, 206 స్థానాలే వచ్చాయని ఖర్గే గుర్తు చేశారు. అప్పుడు కూడా ఉపాధి హామీ, ఆర్టీఐ, ఆర్టీఈ, ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ, ఇండో-యూఎస్‌ న్యూక్లియర్‌ డీల్‌ వంటి మంచి పనులు చేశామన్నారు. భాజపాను ఓడించాలనే లక్ష్య సాధనలో భాగంగానే వేర్వేరు రాష్ట్రాల్లో విభిన్నమైన వ్యూహాలను అనుసరించినట్లు కాంగ్రెస్‌ చీఫ్‌ తెలిపారు. కేరళలో ఎవరు గెలిచినా భాజపాను వ్యతిరేకిస్తారన్నారు. అలానే దిల్లీ, హరియాణ, గుజరాత్‌లలో ఆప్‌ అలానే పనిచేస్తుందని వివరించారు.  కేవలం పంజాబ్‌లో కాంగ్రెస్‌, ఆప్‌ మాత్రమే ప్రధాన పార్టీలు కావడంతో వేర్వేరుగా పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు