Pawan Kalyan: వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనే కూటమిగా వచ్చాం: పవన్‌

దుర్మార్గమైన పాలనను అంతం చేయడానికే తెదేపా, భాజపా, జనసేన కలిశాయని పవన్‌కల్యాణ్‌ మరోసారి స్పష్టం చేశారు.

Updated : 30 Mar 2024 22:21 IST

పిఠాపురం: అధికార వైకాపా ఫ్యాన్‌కు సౌండ్‌ ఎక్కువ.. గాలి తక్కువ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కూటమిదే అధికారమన్న ఆయన.. జగన్‌ అహంకారానికి ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. దుర్మార్గమైన పాలనను అంతం చేయడానికే తెదేపా, భాజపా, జనసేన కలిశాయని మరోసారి స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి శనివారం జనసేనాని ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తన కోసం సీటు త్యాగం చేసిన తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి వర్మకు ధన్యవాదాలు తెలిపారు.

పిఠాపురాన్ని గుండెల్లో పెట్టుకునేందుకు వచ్చా

‘‘పిఠాపురం నుంచి పోటీ చేస్తానని కలలో కూడా అనుకోలేదు. ఎంతో విశిష్ఠత కలిగిన నేల ఇది. నియోజకవర్గాన్ని గుండెల్లో పెట్టుకునేందుకు వచ్చా. అధికారంలోకి రాగానే ఇక్కడి ఆసుపత్రులన్నీ బాగు చేస్తా. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తా. నా సన్నిహితులతో మాట్లాడి ఇక్కడ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పెట్టిస్తా. మోడల్‌ నియోజకవర్గంలా తీర్చిదిద్దుతా. పిఠాపురంలోనే ఇల్లు కట్టుకుంటా. ఓడినా దశాబ్దం నుంచి ఒంటరిగా పోరాటం చేస్తున్నా. నన్ను ఓడించడానికి చిత్తూరు జిల్లా నుంచి మిథున్‌రెడ్డి వచ్చారు. మండలానికి ఓ నాయకుడిని పెట్టారు. రూ.వందల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమయ్యారు.

వైకాపా నేతలు ఏం చేశారు?

కాకినాడ సెజ్‌కు భూములు ఇచ్చిన రైతులకు మేలు జరగలేదు. ఉప్పాడ తీరం కోతకు గురవుతుంటే వైకాపా నేతలు ఏం చేశారు? రకరకాల దోపిడీలు చేసిన జగన్‌, మిథున్‌రెడ్డి, పెద్దిరెడ్డి పేదలట! కాకినాడ పోర్టు.. డ్రగ్స్‌, బియ్యం, డీజిల్‌ మాఫియాకు అడ్డాగా మారింది. ఎన్నికల ఖర్చుకు కావాల్సిన డబ్బును ఆ పోర్టులోనే దాచారు. యువతకు రూ.5 వేల జీతం కావాలా? 25 ఏళ్ల భవిష్యత్తు కావాలా? జగన్‌ మాయమాటలకు మోసపోకండి. జగన్‌ అవినీతిపరుడు.. గద్దె దించాల్సిన సమయం వచ్చింది. వైకాపా వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనే కూటమిగా వచ్చాం. కూటమి కావాలో.. వైకాపా కావాలో.. ప్రజలు ఆలోచించాలి’’ అని పవన్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని