Pawan Kalyan: మొదట ప్రజల ఇబ్బందులు గుర్తిద్దాం

‘ప్రజలు ఈ స్థాయిలో అఖండ విజయాన్ని అందించడమంటే వారికి అత్యున్నత పాలన ఇవ్వాలని చెప్పడమే. ఈ విజయం కక్ష సాధింపు చర్యల కోసం కాదు. పగ, ప్రతీకారాలు తీర్చుకునేందుకు అంతకన్నా కాదు.

Published : 12 Jun 2024 03:41 IST

అత్యున్నత పాలన కోసమే ఇంత అఖండ విజయం
జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌
పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నిక

జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్‌ ఎన్నికైన సందర్భంగా అభినందిస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు

ఈనాడు-అమరావతి: ‘ప్రజలు ఈ స్థాయిలో అఖండ విజయాన్ని అందించడమంటే వారికి అత్యున్నత పాలన ఇవ్వాలని చెప్పడమే. ఈ విజయం కక్ష సాధింపు చర్యల కోసం కాదు. పగ, ప్రతీకారాలు తీర్చుకునేందుకు అంతకన్నా కాదు. నాతో సహా గెలిచిన ఎమ్మెల్యేలంతా దీన్ని బాధ్యతగా తీసుకుందాం. ప్రజల ప్రేమ, అభిమానం, నమ్మకం అనే ఇంధనంతో పార్టీ నడిచింది. గెలిచిన ఎమ్మెల్యేలంతా తొలుత నియోజకవర్గాల్లో కీలకమైన సమస్యలు, ప్రజల ఇబ్బందులను గుర్తించాలి. ఏయే అంశాలు మొదటి ప్రాధాన్యాలో తెలుసుకోవాలి. వాటిని పరిష్కరించేందుకు తొలి ప్రాధాన్యం ఇద్దాం’ అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఉదయం జనసేన శాసనసభా పార్టీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ శాసనసభా పక్ష నేతగా పవన్‌కల్యాణ్‌ ఎన్నికయ్యారు. తొలుత పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పవన్‌కల్యాణ్‌ పేరును ప్రతిపాదించగా సభ్యులంతా ఏకగ్రీవంగా బలపరిచారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే...

పగలు, ప్రతీకారాలకు సమయం కాదు

‘జనసేన పార్టీ విలువలను, స్ఫూర్తిని పార్టీ ఎమ్మెల్యేలంతా ముందుకు తీసుకువెళ్లాలి. పగలు, ప్రతీకారాలకు ఇది సమయం కాదని శ్రేణులకు కూడా అర్థమయ్యేలా నాయకులు చెప్పాలి. పాలకొండ వెళ్లినప్పుడు అక్కడ పొలాల్లోకి ఏనుగులు చొరబడి పంటలను పాడు చేస్తున్నాయని రైతులు చెప్పారు. రాష్ట్రంలో చిన్న నీటి పారుదల పనులు తక్కువ నిధులు వెచ్చిస్తే పూర్తయ్యేవి ఉన్నాయన్నారు. అలాంటి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అలాగే విద్య, వైద్యం, ఉపాధి, భద్రత, సాగు, తాగునీరు అందిస్తామని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాం. వాటికి పార్టీ ఎమ్మెల్యేలు కట్టుబడి ఉండాలి. ప్రజల భద్రతకు కూటమి ప్రభుత్వంలో పూర్తి భరోసా ఉంటుంది. యువత ఆకాంక్షలకు అనుగుణంగానూ పని చేయకపోతే వారు నిలదీస్తారని గుర్తు పెట్టుకోవాలి. ప్రజలు కోపంతో ఓ మాట అన్నా దాన్ని వేరుగా తీసుకోకూడదు. వారి ఆగ్రహానికి కారణాలు వెదికి వాటిని పరిష్కరించేలా చూడాలి. ఒకవేళ ప్రజల సమస్యలు కేంద్రంతో ముడిపడినవైతే వాటిని ఆ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా చొరవ తీసుకుందాం. పార్టీ తరఫున కూడా ప్రత్యేక కమిటీగా ఏర్పడి ప్రజా సమస్యల పరిష్కారానికి సమన్వయం చేసుకుందాం’ అని పవన్‌కల్యాణ్‌ ఉద్బోధించారు.

విమర్శలు సహేతుకంగా ఉండాలి

‘ప్రజాస్వామ్యంలో విమర్శలు సహేతుకంగా ఉండాలి. వ్యక్తిగత విమర్శలు చేయొద్దు. ప్రత్యర్థులు చేసినా ప్రజాస్వామ్యయుతంగానే ఎదుర్కొందాం. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిధులు దాటి మాట్లాడకూడదు. సమయపాలన పూర్తి స్థాయిలో పాటించాలి. ఒక ప్రణాళిక ప్రకారం పార్టీ పరిధిలో పని చేయాలి. ఏ విధానానికి సంబంధించి అయినా అందరూ కలిసి చర్చించి నిర్ణయం తీసుకుందాం. ఎన్డీయే పక్షాలతో స్నేహంగా మెలగాలి. క్షేత్రస్థాయిలో అన్ని పార్టీలను వెంటబెట్టుకుని వెళ్లాలి. ఇదే స్ఫూర్తి ఐదేళ్ళూ కొనసాగించి ప్రజల మన్ననలు పొందాలి’ అని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ పవన్‌కల్యాణ్‌ చిత్తశుద్ధి, రాష్ట్రం కోసం తప్పించిన విధానమే గెలిపించాయన్నారు. ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుందామన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని