Pawan Kalyan: చంద్రబాబు ఎంతో ధైర్యశాలి

‘చంద్రబాబు చాలా ధైర్యశాలి. మందుపాతర పేలి జీపు ఎగిరిపడినా.. జంకకుండా లేచి వచ్చిన వ్యక్తి’ అని జనసేన అధినేత, ఆ పార్టీ శాసనసభా పక్ష నేత పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు.

Published : 12 Jun 2024 03:34 IST

ఆ అనుభవం, నాయకత్వం రాష్ట్రానికి చాలా అవసరం: పవన్‌ కల్యాణ్‌

చంద్రబాబు జైలు జీవితం గురించి వివరిస్తూ ఆయన చేయి పట్టుకుని భావోద్వేగానికి గురైన పవన్‌

ఈనాడు-అమరావతి: ‘చంద్రబాబు చాలా ధైర్యశాలి. మందుపాతర పేలి జీపు ఎగిరిపడినా.. జంకకుండా లేచి వచ్చిన వ్యక్తి’ అని జనసేన అధినేత, ఆ పార్టీ శాసనసభా పక్ష నేత పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. ‘వివిధ దేశాల అధ్యక్షుల్ని సైతం తెలుగు రాష్ట్రాలపై దృష్టి సారించేలా చేయగలిన శక్తి సామర్థ్యాలు చంద్రబాబుకు ఉన్నాయి. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం, అభివృద్ధిపై అపార అవగాహన, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే సమర్థుడు. ఆయన దార్శనికతకు సైబరాబాద్‌ నిదర్శనం. చంద్రబాబు నాయకత్వం, అనుభవం రాష్ట్రానికి చాలా అవసరం’ అని పేర్కొన్నారు. ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబును ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. ఆ తర్వాత తెదేపా అధినేత సమక్షంలోనే చెప్పాల్సి ఉందంటూ.. ‘జైల్లో చంద్రబాబును చూశాను.. ఆయన చాలా నలిగిపోయారు. భువనేశ్వరి బాధను చూసి.. కన్నీళ్లు పెట్టొద్దని మంచిరోజులు వస్తాయని చెప్పాను.. ఆ మంచి రోజులు ఇప్పుడొచ్చాయి’ అని వివరించారు. ‘చంద్రబాబుకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెబుతున్నా..’ అని అన్నారు.

పొత్తు ఎలా ఉండాలో.. దేశానికే తెలియజెప్పాం 

‘పొత్తు ఎలా ఉండాలో.. ఒక్క ఓటు కూడా చీలకుండా ఎలా పనిచేయాలో.. కలిసికట్టుగా చేసి చూపించాం. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి విజయం పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో జరిగిన ఎన్డీయే సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చింది. తమ రాష్ట్రాల్లో పొత్తుతో ఎలా ముందుకెళ్లాలో తెలియజెప్పింది’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వనని 2021 మార్చి 14న ఇప్పటం సభలో చెప్పా. మాట మీద నిలబడ్డాం’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని