Janasena: జయహో.. జనసేన

జనసేన జయకేతనం ఎగరవేసింది. తెలుగుదేశం, భాజపాతో పొత్తులో భాగంగా పోటీ చేసిన 21 చోట్లా గెలిచి సంచలన విజయాన్ని నమోదు చేసింది.

Updated : 05 Jun 2024 07:27 IST

జనం మనసులు గెలిచిన సేనాని 
పోటీ చేసిన 21 స్థానాల్లోనూ విజయభేరి
వైకాపాకు వచ్చినవాటి కంటే దాదాపు రెట్టింపు 
శాసనసభలో రెండో స్థానం
ఈ ఫలితాలతో పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఖరారు

ఈనాడు - అమరావతి: జనసేన జయకేతనం ఎగరవేసింది. తెలుగుదేశం, భాజపాతో పొత్తులో భాగంగా పోటీ చేసిన 21 చోట్లా గెలిచి సంచలన విజయాన్ని నమోదు చేసింది. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నట్లుగానే వంద శాతం స్ట్రైక్‌రేట్‌ సాధించింది. అధికార వైకాపా సాధించిన సీట్ల కంటే రెట్టింపు సీట్లు గెలిచింది. జగన్‌ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా 175 స్థానాల్లో పోటీ చేసి, కేవలం 11 స్థానాలకే పరిమితమైతే.. 21 సీట్లలో పోటీ చేసిన జనసేన అన్నింట్లోనూ గెలిచి, సత్తా చాటింది. శాసనసభలో తెలుగుదేశం తర్వాత అత్యధిక స్థానాలున్న రెండో పార్టీగా అవతరించింది. ఈ విజయంతో పవన్‌ కల్యాణ్‌ రాజకీయాల్లోనూ ‘పవర్‌’స్టార్‌గా నిలిచారు. ఈ ఎన్నికల్లో సాధించిన సీట్లతో జనసేనకు గాజు గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం శాశ్వతంగా కేటాయించబోతుండటం ఆ పార్టీకి మరో మధురానుభూతిని మిగల్చనుంది. మొదటి నుంచి సత్తా చూపిస్తున్న ఉభయగోదావరి, విశాఖ జిల్లాల్లోనే కాకుండా ఉత్తరాంధ్ర, కృష్ణా గుంటూరు, రాయలసీమ జిల్లాల్లోనూ విజయం జనసేనకు కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ సత్తా చాటింది. పిఠాపురం శాసనసభ స్థానం నుంచి 70,354 ఓట్ల మెజారిటీతో గెలిచిన జనసేనాని పవన్‌ కల్యాణ్‌ తొలిసారి శాసనసభలో అడుగుపెడుతున్నారు. తొలి నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరించిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సైతం తెనాలి నుంచి గెలుపొందారు.

దారుణ ఓటమి నుంచి విజయం దిశగా..

రాష్ట్ర విభజన తర్వాత జనసేన పార్టీ ప్రారంభించిన పవన్‌ కల్యాణ్‌ 2014 ఎన్నికల్లో బరిలో దిగకుండా తెదేపా, భాజపాలకు మద్దతు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన జనసేన ఒకే ఒక్క స్థానంలో గెలుపొందింది. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సైతం భీమవరం, గాజువాకల నుంచి ఓటమి పాలయ్యారు. చాలా త్వరగా ఆ ఓటమి నుంచి బయటపడి పార్టీని ముందుకు నడిపించారు. వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాట పంథాలో దూసుకెళ్లారు. 2019 జూన్‌ నెలలో జగన్‌ ప్రభుత్వం ఏర్పడితే.. పవన్‌ ఆగస్టులోనే ప్రజా సమస్యలపై ఉద్యమం ప్రారంభించారు. రాజధాని అమరావతిలో నిర్మాణాలు నిలిపివేసిన వైనంపై ఆగ్రహించారు. రైతులకు కౌలు చెల్లించడం లేదని గళమెత్తారు. జగన్‌ వంద రోజుల పాలనా వైఫల్యాలపై 33 పేజీల పుస్తకం విడుదల చేశారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై విశాఖలో లాంగ్‌మార్చ్‌ నిర్వహించి ప్రజా సమస్యలపై పోరాటమే తన పంథా అని ప్రకటించారు. డొక్కా సీతమ్మ ఆహారశిబిరాలు, రైతు సౌభాగ్య దీక్షలతో కార్యక్రమాలను మరింత పదును ఎక్కించారు. అమరావతి పోరాటంలో పవన్‌ కల్యాణ్‌ కీలకపాత్ర పోషించారు. రాజధాని రైతులకు మద్దతు ప్రకటించే క్రమంలో పోలీసులు అడ్డుకోగా ముళ్లకంచెలు సైతం దాటుకుంటూ కాలినడకన పర్యటించారు. రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై జనసేన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించింది. డిజిటల్‌ క్యాంపెయిన్‌ నిర్వహించారు. పవన్‌ కల్యాణ్‌ స్వయంగా రహదారుల నిర్మాణానికి శ్రమదానం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నారు. 

జనం బాధలు వింటూ..

ముఖ్యమంత్రి ప్రజల బాధలు పట్టించుకోకుండా ప్యాలెస్‌కు పరిమితమైతే జనసేన అధినేత రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి జనవాణి కార్యక్రమాలు నిర్వహించి, ప్రజల సమస్యలు విన్నారు. వాటి పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు సొంత డబ్బులతో ఆర్థిక సాయం అందించారు. పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర సైతం పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచింది. విశాఖలోనూ, చంద్రబాబు అరెస్టు సమయంలో రాష్ట్ర సరిహద్దుల్లోనూ పవన్‌ కల్యాణ్‌ ఎదుర్కొన్న పోలీసు నిర్బంధాలు ఆ పార్టీ శ్రేణులను మరింత సంఘటిత శక్తిగా మలిచాయి. పవన్‌ ఓ పక్క పార్టీని ప్రజాజీవితంలో భాగం చేస్తూనే.. తెదేపా, భాజపాతో పొత్తులకు ప్రాధాన్యమిస్తూ ముందుకెళ్లారు. ఐదేళ్ల పోరాటం, ఆయన వైఖరి, రాజకీయ నిర్ణయాలు ఈ రోజు జనసేనకు ఈ స్థాయి విజయాన్ని అందించాయి.


ఉభయగోదావరి జిల్లాల్లో 11 చోట్ల విజయం

జనసేనకు మొదటి నుంచి ఉభయగోదావరి జిల్లాలు మంచి పట్టున్న ప్రాంతాలు. పొత్తులో భాగంగా ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లోనే ఏకంగా 11 స్థానాల్లో పోటీ చేశారు. అన్నింట్లోనూ ఘనవిజయం సాధించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో, ఉమ్మడి కడప జిల్లా రైల్వే కోడూరు ఎస్సీ నియోజకవర్గంలో సైతం జనసేన గెలిచింది. 2019 ఎన్నికల్లో గెలిచిన రాజోలులో మరోసారి విజయ ఢంకా మోగించింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ఎస్టీ నియోజకవర్గంలో, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎస్టీ నియోజకవర్గంలోనూ గ్లాసు గుర్తుతో అభ్యర్థులు గెలుపొందడం విశేషం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని