Pawan Kalyan: పిఠాపురంలో నా గెలుపు చరిత్రలో నిలిచిపోవాలి: పవన్‌

 వైకాపా కుట్రలు, కుతంత్రాలను సమర్థంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.

Updated : 31 Mar 2024 19:55 IST

పిఠాపురం: వైకాపా కుట్రలు, కుతంత్రాలను సమర్థంగా ఎదుర్కోవాలని పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఎన్డీయే కూటమి కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. పోలింగ్‌ ముగిసే వరకు క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయాలని కోరారు. వర్మ త్యాగం గొప్పదన్న పవన్‌.. ఆయన ఉన్నత స్థానంలో ఉండేలా చూస్తానని హామీ ఇచ్చారు.

‘‘నేను రాష్ట్ర ప్రజల కోసం తగ్గాను. చంద్రబాబు చాలా అనుభవజ్ఞుడు. అందరూ కలిసి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. చంద్రబాబుని జైల్లో పెట్టినప్పుడు తెలుగు తమ్ముళ్ల బాధ నన్ను కదిలించింది. తెదేపా ఎంతో సమర్థవంతమైన పార్టీ. స్ట్రక్చర్‌ కలిగిన పార్టీని నడపడం అంత సులువు కాదు. జనసేన దగ్గర స్ట్రక్చర్‌ లేదు కానీ బలం ఉంది. ఆ బలం స్ట్రక్చర్‌ కలిసి ముందుకు వెళితేనే రాష్ట్రాన్ని కాపాడుకోగలం. ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. నా కోసం పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తన సీటు త్యాగం చేసి నా గెలుపునకు సహకరిస్తాననడం శుభ పరిణామం. చంద్రబాబు చెప్పారు నేను చేస్తా.. అని ఒకే మాట చెప్పారు. ఒంటరిగా పోరాడి గెలిచే దమ్మున్న నాయుడు వర్మ. కానీ, రాష్ట్రం బాగుపడాలని మంచి ఉద్దేశంతో ఆయన సీటు త్యాగం చేయడం శుభ పరిణామం. తెదేపా, భాజపా హక్కులకు, రాజకీయ మనుగడకు ఇబ్బంది లేకుండా పనిచేస్తాం. జనసేన, తెదేపా నాయకుల మధ్య ఏమైనా ఇబ్బందులు ఉంటే సర్దుకుపోవాలి. పిఠాపురంలో నా గెలుపు చరిత్రలో నిలిచిపోవాలి. ఆ బాధ్యత వర్మకు అప్పగిస్తున్నా’’ అని పవన్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని