Pawan Kalyan: వైకాపా పాలనకు చరమగీతం పాడాలి: పవన్‌

రాష్ట్రాన్ని నడిపించే ఐఏఎస్‌ అధికారులకు 20వ తేదీ వరకు జీతాలు చెల్లించకపోవడం దారుణమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. ఐఏఎస్‌లకు జీతాలు ఇవ్వలేని స్థితిలో రాష్ట్రప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. 

Updated : 06 Oct 2023 19:02 IST

మంగళగిరి: రాష్ట్రాన్ని నడిపించే ఐఏఎస్‌ అధికారులకు 20వ తేదీ వరకు జీతాలు చెల్లించకపోవడం దారుణమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. ఐఏఎస్‌లకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఏపీప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్‌ కల్యాణ్ మాట్లాడారు. ‘‘ వేతనాలు రాక ఒప్పంద ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కన్సాలిడేటెడ్‌ ఫండ్‌ ద్వారా ఐఏఎస్‌లకు జీతాలు వస్తాయి. ఐఏఎస్‌ల జీతాలు మళ్లించారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘనే. రాజ్యాంగ ఉల్లంఘన వైకాపా నేతలకు సహజ గుణంగా మారింది. అసమర్థ ప్రభుత్వ పాలనతో సమస్యలు లేవనెత్తితే దాడులు చేస్తున్నారు. సమస్యలు లేవనెత్తినా ప్రభుత్వానికి జవాబుదారీతనం లేదు. కేసులు వాయిదా వేయించుకోవడానికి సీఎం జగన్‌, ఎంపీలు దిల్లీకి వెళ్తున్నారా? వైకాపా అరాచకాలకు ముగింపు పలకాల్సిన అవసరం ఉంది.’’ అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

వైకాపా వ్యతిరేక ఓటు చీలకూడదు..

భాజపాతో పొత్తు పోయిందని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారని పవన్‌ అన్నారు. అయితే, పొత్తులపై ఎవరికీ చెప్పాల్సిన పని లేదని.. ప్రజలకే చెబుతామని అన్నారు. ఎక్కడ పోటీ చేయాలనేది తమ స్వీయ నిర్ణయమని స్పష్టం చేశారు. జనసేనపై ఆరోపణలు చేయడం కాకుండా ఉద్యోగుల జీతాల కోసం దిల్లీకి వెళ్లాల్సిందన్నారు. ‘‘తెలంగాణ ప్రజల ఆకాంక్ష.. పసుపు బోర్డు కలను కేంద్ర ప్రభుత్వం సాకారం చేసింది. సీఎం జగన్‌ దిల్లీ వెళ్లినా జీడిపప్పు, కొబ్బరి బోర్డుల కోసం కృషి చేయలేదు. పొత్తులు, సీట్లపై కంటే దిల్లీకి వెళ్లి రాష్ట్రానికి బోర్డులు తీసుకురావడంపై దృష్టి పెట్టాల్సింది. సీబీఐ కేసులు వాయిదా వేయించుకోవడానికి దిల్లీ వెళ్తున్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో నేను తెదేపాతో పొత్తు ప్రకటన చేశా. వాస్తవంగా పొత్తు ప్రకటన దిల్లీలో చేసి ఉండాల్సింది. జీ20 సమావేశాల దృష్ట్యా నాయకులు అందుబాటులో లేరు. ఎన్డీయేతో పొత్తులోనే ఉన్నాం.. ఎన్డీయే భేటీకి హాజరయ్యాం కూడా. 2024 ఎన్నికల్లో తెదేపా, జనసే, భాజపా కలిసి వెళ్లాలి. వైకాపా వ్యతిరేక ఓటు చీలకూడదనేదే నా ఆకాంక్ష’’ అని పవన్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని