Pawan Kalyan: ఏ ఉద్దేశంతో చీకట్లో యాత్ర చేయించారు?: పవన్‌ కల్యాణ్‌

సీఎం జగన్‌పై గులకరాయి దాడి వ్యవహారంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా స్పందించారు.

Updated : 15 Apr 2024 18:12 IST

అమరావతి: సీఎం జగన్‌పై గులకరాయి దాడి వ్యవహారంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా స్పందించారు. దాడి విషయంలో బాధ్యత వహించాల్సిన అధికారులతోనే విచారణ చేయిస్తే ఎలా? అని ప్రశ్నించారు. ఈ ఘటనపై డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌, ముఖ్యమంత్రి సెక్యూరిటీ అధికారులపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. 

‘‘వీవీఐపీ కేటగిరీలో ఉన్నారనే కదా సీఎం జగన్‌ ఎక్కడకు వెళ్లినా పరదాలు కట్టి.. చెట్లు కొట్టేసేవారు. అవన్నీ పట్టపగలే నిర్వహించారు కదా? మరి ఏ ఉద్దేశంతో విద్యుత్ కూడా నిలిపివేసి చీకట్లో యాత్ర చేయించారు? బాధ్యులైన అధికారులను బదిలీ చేసి.. సచ్ఛీలత కలిగిన అధికారులకు విచారణ బాధ్యత అప్పగించాలి. అప్పుడే భద్రత చర్యల్లో లోపాలు ఏమిటి? ఇంటెలిజెన్స్‌ వైఫల్యం ఏంటి? తదితర విషయాలు వెలుగులోకి వస్తాయి. రాష్ట్రంలో నిర్వహించిన ఎన్నికల సభల్లో నరేంద్ర మోదీ పాల్గొన్నప్పుడే భద్రతాపరమైన లోపాలు బయటపడ్డాయి. ఇలాంటి అధికారులు ఉంటే ప్రధాని మరోసారి రాష్ట్రంలో పర్యటించినప్పుడు ఇంతే నిర్లక్ష్యం ప్రదర్శిస్తారు. వీళ్లతో ఎన్నికలు ఎలా పారదర్శకంగా నిర్వహించగలరు? ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టిపెట్టాలి’’అని పవన్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని