Payyavula Keshav: ఉరవకొండ ట్రెండ్‌కు.. ఎండ్‌ కార్డు వేసిన పయ్యావుల

ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఆంధ్రప్రదేశ్‌లో కొన్నాళ్లుగా వ్యాప్తిలో ఉన్న ఓ ట్రెండ్ బ్రేక్ అయింది. 

Updated : 04 Jun 2024 16:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ ఆధిక్యంతో దూసుకెళ్తోంది. వైకాపాను ఓడిస్తూ.. విజయం దిశగా వడివడిగా వెళ్తోంది. ఈ సమయంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉరవకొండలో తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ విజయం సాధించారు. అలాగే ఎప్పటినుంచో వ్యాప్తిలో ఉన్న సెంటిమెంట్‌ను బ్రేక్ చేశారు.

ఉరవకొండలో గెలిచిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదనే సెంటిమెంట్ పలుమార్లు నిజమైంది. అయితే ఈసారి అందుకు విరుద్ధంగా కేశవ్ గెలవడమే కాకుండా.. రాష్ట్రంలో తెదేపా-భాజపా- జనసేన కూటమి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమైంది. ఈ సెంటిమెంట్ గురించి ఓ సందర్భంలో మాజీ మంత్రి, వైకాపా నేత పేర్ని నాని, కేశవ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. వచ్చే ఎన్నికల్లో కేశవ్‌ మళ్లీ గెలవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నాని నవ్వుతూ అన్నారు. ఆయన ఏ ఉద్దేశంతో ఆ మాటలు అన్నారో అర్థం చేసుకున్న పయ్యావుల... ‘‘నో డౌట్‌... 1994 ఎన్నికల ఫలితాలే 2024లోనూ రిపీట్‌ అవుతాయి...’’ అని వెంటనే బదులిచ్చారు. 1994లో తెదేపా ఉరవకొండలోను గెలిచి, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆ విధంగా వ్యాఖ్యానించారు.

పయ్యావుల చెప్పినట్టుగానే 1994 సీన్‌ రిపీట్ అయింది. తాజాగా ఆయనకు 1,02,046 ఓట్లు రాగా.. వైకాపా అభ్యర్థి వై.విశ్వేశ్వర రెడ్డి 21వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి విజయం సాధించగా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. 2019లో తెదేపా అభ్యర్థి పయ్యావుల కేశవ్‌ విజయం సాధించగా వైకాపా అధికారంలోకి రావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని