Peethala Murthy Yadav: ఉత్తరాంధ్రలో జవహర్‌రెడ్డి కుమారుడు 800 ఎకరాలు కాజేశారు: పీతల మూర్తి యాదవ్‌

ఉత్తరాంధ్రలో ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి కుమారుడు తన బినామీలతో 800 ఎకరాలు కాజేశారని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ ఆరోపించారు. పేద రైతుల ఎసైన్డ్‌ భూములను లాక్కున్నారన్నారు.

Updated : 26 May 2024 13:56 IST

విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డి కుమారుడు తన బినామీలతో 800 ఎకరాలు కాజేశారని జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ ఆరోపించారు. పేద రైతుల ఎసైన్డ్‌ భూములను లాక్కున్నారన్నారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తవమైతే ఏ శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. 

‘‘సింహాచల చందనోత్సవం సమయానికి ముందు జవహర్‌రెడ్డి స్వామి దర్శనం చేసుకున్నారు. దర్శనానికి వెళ్లడంలో తప్పులేదు.. కానీ తర్వాత ఎక్కడికి వెళ్లారో తెలుసు. స్నేహితుడి ఇంట్లో పెళ్లికి వెళ్లామంటున్నారు. ఆయన ఇల్లు ఎటువైపు ఉంది? సీఎస్‌ ఎటు వెళ్లారు?ఎన్నికల వేళ భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణంపై సమీక్ష జరిపారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంటే భోగాపురం మీదే ప్రేమ ఎందుకు?కుమారుడిని ముందే పంపి అగ్రిమెంట్లు చేసుకున్నారు. ఫ్రీహోల్డ్‌ సర్టిఫికెట్లు ముందే ఇచ్చారు. భోగాపురం సమీపంలోని కంచేరులో అనుమతులు మంజూరు చేస్తూ విజయనగరం ప్రస్తుత కలెక్టర్‌ నాగలక్ష్మి ప్రొసీడింగ్స్‌ ఇచ్చారు.

పూసపాటిరేగ మండలం ఎరుకొండ, చిన్నబత్తిలివలస, కోవాడ, పొన్నాడ గ్రామాలతో పాటు విశాఖ జిల్లాలోని భీమిలి మండలం పద్మనాభం, ఐనాడ, బుద్దివలస, కొరడామద్ది, నరసాపురం, పాండ్రంగి, తిమ్మాపురం తదితర గ్రామాల్లో ఫ్రీ హోల్డ్‌ సర్టిఫికెట్లు ఇచ్చేశారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు అనే ప్రభుత్వం చేసిన న్యాయం ఇదేనా? వైకాపా నాయకులు విజయనగరం, విశాఖ జిల్లాల్లో ఫ్రీ హోల్డ్‌ సర్టిఫికెట్లు తీసుకుని దోచేశారు. సీఎస్‌ జవహర్‌రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీనిపై సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి. జీవో నంబర్‌ 596 వచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు జరిగిన లావాదేవీలపై విచారణ చేయాలి. సీఎం జగన్‌ సతీమణి భారతి పేరు చెప్పి ఈ లావాదేవీలన్నీ వేగంగా జరిగేలా చేశారు. ఆ భూములు రైతుల చేతుల్లో లేవు. త్వరలో దీని వెనుక ఉన్న తహసీల్దార్ల పేర్లు బయటపెడతాను. మళ్లీ వైకాపా ప్రభుత్వం రాదని తెలిసే రహస్యంగా ఈ లావాదేవీలు జరిపారు’’ అని పీతల మూర్తియాదవ్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని