Congress: మోదీ, అమిత్‌ షాలను ప్రజలు తిరస్కరించారు: రాహుల్ గాంధీ

లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ (Congress) నేతలు మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ (Modi)ని ప్రజలు తిరస్కరించారని విమర్శించారు. 

Published : 04 Jun 2024 19:25 IST

దిల్లీ: 400కిపైగా స్థానాలు సాధించడమే లక్ష్యంగా ఈసారి బరిలో దిగిన ఎన్డీయే.. 300 కన్నా దిగువ స్థానాలకు పరిమితమైంది. భాజపా(BJP)కు సొంతంగా 300 కంటే ఎక్కువ సీట్లు రావొచ్చన్న ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు తప్పాయి. 150 సీట్లకు కాస్త అటూఇటూగా విపక్ష కూటమి పరిమితమవుతుందన్న అభిప్రాయమూ మారింది. ఇండియా కూటమి ఇప్పటికే 150కి పైగా స్థానాలు దక్కించుకోగా.. ఇంకా 40కి పైగా స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ సమయంలో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ దేశం మోదీ, అమిత్‌షాను తిరస్కరించిందని రాహుల్ గాంధీ అన్నారు. 

‘‘రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ఈ దేశ ప్రజలు కలసికట్టుగా పోరాటం చేస్తారని నేను అనుకున్నాను. ఈసందర్భంగా దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ నేతలు ఎంతో చేశారు. ఇండియా కూటమి భాగస్వాములను మేం గౌరవిస్తాం. ఆ కూటమి దేశం కోసం పేదలకు అనుకూలమైన విజన్‌ను అందించింది. ఈ రాజ్యాంగంపై దాడిని ప్రతిఘటించిన ప్రజలపై ఎంతో గర్వంగా ఉంది’’ అని రాహుల్ అన్నారు. అలాగే పాత మిత్రులైన పీడీపీ, జేడీయూతో సంప్రదింపులు జరుపుతారా? అని అడగ్గా.. ‘‘రేపు మా ఇండియా కూటమి నేతలతో సమావేశం ఉంటుంది. వారితో సంప్రదింపులు చేయకుండా ఎలాంటి ప్రకటనలు చేయం’’ అని స్పష్టంచేశారు. అలాగే రెండు సీట్లలో సాధించిన విజయం గురించి స్పందించారు. రాహుల్‌ కేరళలో, వయనాడ్‌తో పాటు యూపీలోని రాయ్‌బరేలీలో భారీ మెజార్టీతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ‘‘నేను రెండు స్థానాల్లో ఉండటం కుదరదు. దానిపై ఆలోచిస్తున్నాను. ఏ సీటు వదులుకోవాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని వెల్లడించారు. 

ఖర్గే మాట్లాడుతూ.. ‘‘ఇది ప్రజలకు, ప్రజాస్వామ్యానికి దక్కిన విజయం. ఇది మోదీ, ప్రజలకు మధ్య జరిగిన పోరాటం. ప్రజలు ఎవరికీ పూర్తి ఆధిక్యాన్ని ఇవ్వలేదు. ఇది మోదీకి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పు అని స్పష్టమవుతోంది. మోదీ పేరు మీదుగా ఓట్లు అడిగారు కాబట్టి ఇది ఆయనకు రాజకీయంగానే గాకుండా నైతికపరమైన ఓటమి’’ అని అన్నారు. ఆయన చేసిన ప్రచారం ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని, కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి ఆయన చెప్పిన అబద్ధాలను ప్రజలు చూశారన్నారు. ‘‘ప్రభుత్వ యంత్రాంగం అడుగడుగునా మమ్మల్ని అడ్డుకుంది. మా బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. కానీ మేం పోరాడాం. ప్రజలు మాకు మద్దతుగా నిలిచారు’’ అని ఖర్గే అన్నారు. ప్రధాని మోదీ ప్రజల విశ్వాసం కోల్పోయారని, ఆయన రాజీనామా చేయాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని