Amit Shah: నవీన్‌ బాబూ.. రత్నభాండాగారం అసలు తాళం చెవి ఎక్కడ ఉంది?: అమిత్‌ షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఒడిశాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

Published : 17 May 2024 18:14 IST

రౌర్కెలా: ఒడిశాలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో బిజూ జనతాదళ్‌ను ఓడించేందుకు భాజపా (BJP) తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులోభాగంగా సీఎం నవీన్‌ పట్నాయక్‌పై విమర్శల బాణాలు సంధిస్తోంది. తాజాగా భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit shah) ఒడిశాలోని రౌర్కెలాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు దేశంలో జరిగిన నాలుగు దశల ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భాజపా 270 సీట్లు ఖాయం చేసుకొని 400 దిశగా దూసుకెళ్తోందని వ్యాఖ్యానించారు. ఈసారి ఒడిశాలోనూ కమలం వికసిస్తుందన్న ఆయన.. ఇక్కడ 75 అసెంబ్లీ, 15 లోక్‌సభ సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. 

మెజార్టీ రాకపోతే.. ‘ప్లాన్‌ బి’ ఉందా..? అమిత్‌ షా సమాధానమిదే..

‘‘కొన్నాళ్లుగా కోట్లాదిమంది పూరీ జగన్నాథ్‌ స్వామి భక్తులు రత్నభాండాగారం గురించే ఆలోచిస్తున్నారు. ఈ భాండాగారం తాళం చెవిల మిస్టరీని బయటపెట్టాలని కోరుకొంటున్నారు. నవీన్‌ పట్నాయక్‌ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, వారి నమ్మకాలు, విశ్వాసాలతో ఆడుకుంటున్నారు. నవీన్‌ బాబూ.. రత్న భాండాగారం అసలు తాళం చెవి ఎక్కడ ఉందో చెప్పండి? ఈ విషయాన్ని ఒడిశా ప్రజలు తెలుసుకోవాలనుకొంటున్నారు. నకిలీ తాళాలు ఎవరు తయారుచేశారు? దీనిపై ఏర్పాటుచేసిన విచారణ కమిషన్‌ నివేదికను ఎందుకు తొక్కిపెట్టారు? భాజపా ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల్లోనే ఆ కమిషన్‌ నివేదికను బహిర్గతం చేస్తాం’’ అని అమిత్ షా హామీ ఇచ్చారు.

‘‘ఈ ఎన్నికలు నరేంద్ర మోదీని మూడోసారి ప్రధానిని చేసేందుకు, భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దేందుకు, దేశంలో మూడు కోట్ల మంది అక్కాచెల్లెళ్లను లక్షాధికారులుగా మార్చేందుకు, దేశంలో మూడు కోట్ల మంది పేదలకు ఇళ్లు అందించేందుకు, ఒడిశాలో నవీన్‌పట్నాయక్‌ సర్కార్‌ను తొలగించి అభివృద్ధిలో నవశకానికి నాంది పలికేందుకు జరుగుతున్న ఎన్నికలు’’ అని అమిత్ షా అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు