Pinnelli: ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి

పోలింగ్‌ రోజు, ఆ తర్వాత వైకాపా చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి.

Published : 22 May 2024 00:04 IST

అమరావతి: పోలింగ్‌ రోజు, ఆ తర్వాత వైకాపా చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. మే 13వ తేదీ పోలింగ్‌ జరుగుతున్న సమయంలో మాచర్ల ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఓ పోలింగ్‌ బూత్‌లోకి చొరబడి ఈవీఎంను ధ్వంసం చేసిన దృశ్యాలు తాజాగా వెలుగులోకి రావడం కలకలం రేపింది. 

రెంటచింతల మండలం పాల్వాయిగేట్‌ పోలింగ్‌ కేంద్రం(202)లోకి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి.. పోలింగ్‌ బూత్‌లోని సిబ్బందిని బెదిరిస్తూ.. ఈవీఎంను ధ్వంసం చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలింగ్‌ ఏజెంట్‌పైనా ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. ఈ దృశ్యాలన్నీ వెబ్‌ క్యామ్‌లో రికార్డవ్వగా.. సిట్‌ దర్యాప్తులో అవి వెలుగులోకి వచ్చాయి. అయితే, ఈ ఘటనకు సంబంధించి  పోలీసులు తీసుకున్న చర్యలు వెల్లడించలేదు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో సిట్‌ దర్యాప్తు చేయడంతో వైకాపా అరాచకాల్లో కొన్ని ఘటనలు వెలుగు చూశాయి.

కఠిన చర్యలకు ఈసీ ఆదేశం

పోలింగ్‌ రోజు మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎంలను ధ్వంసం చేయడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈవీఎంల ధ్వంసంపై కఠినంగా వ్యవహరించాలని, బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని  ఏపీ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. మాచర్ల పరిధిలో 7 చోట్ల ఈవీఎంల ధ్వంసం దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తున్నట్లు సీసీ కెమెరాలో నమోదైంది. ఈవీఎంల ధ్వంసంపై సీసీ కెమెరాల దృశ్యాలను ఎన్నికల సిబ్బంది పోలీసులకు ఇచ్చారు. ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు ఈసీకి పోలీసులు తెలియజేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని