PM Modi: 76 రోజులు.. 206 ర్యాలీలు.. సగం ఆ నాలుగు రాష్ట్రాల్లోనే: మోదీ ‘ప్రచార సునామీ’ ఇదీ..!

PM Modi: ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ సుడిగాలి ప్రచారం చేపట్టారు. ముఖ్యంగా యూపీ, బిహార్‌, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో అత్యధికంగా ర్యాలీలు నిర్వహించారు.

Updated : 30 May 2024 17:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: లోక్‌సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. జూన్‌ 1న జరిగే చివరి విడత పోలింగ్‌కు గురువారం సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. ఈ ఎన్నికలతో హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్న భాజపా (BJP) ప్రచారంలోనూ ఆ దూకుడు సాగించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) సుడిగాలి పర్యటనలు చేపట్టారు. ఒక్కో రోజు మూడు నుంచి ఐదు సభల్లో పాల్గొని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. మొత్తంగా ఎన్నికల (Lok Sabha Elections) షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత నుంచి ఈ రెండున్నర నెలల్లో ప్రధాని దాదాపు 200కు పైగా ర్యాలీలు నిర్వహించారు.

మే నెలలోనే 96 సభలు..

ఈ ఏడాది మార్చి 16న ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. అప్పటి నుంచి భాజపా ప్రచార (Election Campaign) వేగాన్ని పెంచింది. ఈ 76 రోజుల్లో ప్రధాని దేశం నలుమూలలా ర్యాలీలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. 22 రోజుల పాటు నిత్యం నాలుగు చోట్ల ప్రచారాలు చేపట్టారు. మూడు పర్యాయాలు అయితే ఒక్క రోజులోనే ఐదేసి సభలు నిర్వహించారు. ఈ మే నెలలోనే ప్రధాని 96 ప్రచార కార్యక్రమాల్లో (Modi Campaign) పాల్గొన్నారు.

ఆ నాలుగు రాష్ట్రాలపై గురి..

ప్రధాని చేపట్టిన ప్రచారాల్లో దాదాపు సగం ర్యాలీలు కేవలం నాలుగు రాష్ట్రాల్లోనే ఉండటం గమనార్హం. 80 మంది ఎంపీలను ఎన్నుకునే ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 31 సభలు (Election Rallies) నిర్వహించారు. ఆ తర్వాత బిహార్‌పై దృష్టిపెట్టిన ప్రధాని ఆ రాష్ట్రంలో 20 ర్యాలీల్లో పాల్గొన్నారు. ఇక, మహారాష్ట్రలో 19, పశ్చిమ బెంగాల్‌లో 18 ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. 2019తో పోలిస్తే మహరాష్ట్రలో ఈసారి మోదీ రెట్టింపు స్థాయిలో ర్యాలీలు నిర్వహించారు. మొత్తంగా ఈ నాలుగు రాష్ట్రాల్లో కలిపి 88 ర్యాలీలు చేపట్టారు.

దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి..

ఈ ఎన్నికల్లో దక్షిణాదిలో బలాన్ని పెంచుకోవాలని చూస్తున్న కమలదళం ప్రచారంలోనూ ఆ దిశగా వ్యూహాలు అమలు చేసింది. ఇక్కడి ఐదు రాష్ట్రాల్లో ప్రధాని 35 ర్యాలీలు నిర్వహించారు. అత్యధికంగా కర్ణాటక, తెలంగాణలో 11, తమిళనాడులో 7 సార్లు ప్రచారం సాగించారు. కర్ణాటకలో గత ఎన్నికల్లో భాజపా అత్యధిక స్థానాలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ కాంగ్రెస్‌ అధికారంలో ఉండటంతో భాజపా ప్రత్యేక దృష్టి సారించింది.

ఇక, తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో ప్రధాని (Narendra Modi) ఐదు ర్యాలీలు చేపట్టారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజు జనతా దళ్‌తో పొత్తు కుదరకపోవడంతో ఆ రాష్ట్రంపైనా భాజపా దృష్టిపెట్టింది. అక్కడ మోదీ 10 ప్రచారాలు నిర్వహించారు. పూరీలో ఆయన చేపట్టిన భారీ రోడ్‌ షోకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. 

అటు మధ్యప్రదేశ్‌లో 10, ఝార్ఖండ్‌లో 7, రాజస్థాన్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో నాలుగు, హరియాణాలో మూడు ర్యాలీలు నిర్వహించారు. కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్‌లోనూ ప్రధాని ఓసారి పర్యటించారు. ఇవేగాక, పలు జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూలిచ్చారు. ఈ ఎన్నికల సీజన్‌లో మోదీ తన చివరి ప్రచారాన్ని నేడు పంజాబ్‌లోని హోషియార్‌పుర్‌లో నిర్వహించనున్నారు. అది పూర్తి చేసుకుని ఈ సాయంత్రం కన్యాకుమారిలో ధ్యానానికి వెళ్లనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు