Lok Sabha Elections: పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు

Lok Sabha polls: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

Published : 19 Apr 2024 08:39 IST

దిల్లీ: సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ (Lok Sabha Elections) ప్రారంభమైన నేపథ్యంలో ఓటర్లు పెద్ద ఎత్తున తరలిరావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువకులు, తొలిసారి ఓటు వేయబోతున్నవారికి ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

‘‘2024 లోక్‌సభ ఎన్నికలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. 21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో ఓటు వేసే వారందరూ తమ ఓటు హక్కును రికార్డు సంఖ్యలో వినియోగించుకోవాలని కోరుతున్నాను. యువకులు, మొదటిసారి ఓటు వేయనున్నవారు అధిక సంఖ్యలో తరలిరావాలని పిలుపునిస్తున్నాను. ప్రతిఒక్కరి ఓటూ ప్రధానమే!’’ అని మోదీ ఎక్స్‌లో వివిధ భాషల్లో పోస్ట్‌ చేశారు.

మీ ఓటుకు ఆ శక్తి ఉంది..

ఓటు కేవలం అభ్యర్థి భవితవ్యాన్నే కాకుండా దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. స్వయం సమృద్ధ, అభివృద్ధి చెందిన, భద్రమైన భారత్‌ను సృష్టించేందుకు ప్రతిఒక్కరి ఓటుకు శక్తి ఉందని పేర్కొన్నారు. అందుకే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. తొలిసారి ఓటర్లు తప్పకుండా తమ హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య, ఉపాధి అవకాశాలను కల్పించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులను కూడా పోలింగ్‌లో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు.

ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది..

‘‘ఈరోజు తొలి దశ పోలింగ్‌ జరుగుతోంది. ప్రతిఓటు భారతదేశ ప్రజాస్వామ్య భవితవ్యం, రాబోయే తరాల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఓటు హక్కును వినియోగించుకొని దేశ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయండి. ద్వేషాన్ని ఓడించి.. దేశ నలుమూలలా ప్రేమ దుకాణాలను తెరవండి’’ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ పిలుపునిచ్చారు.

దేశ గతిని నిర్ణయించేది మీరే..

‘‘దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడే సమరం నేడు ప్రారంభమైంది. తొలి దశ పోలింగ్‌లో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఓటు వేయండి. దేశ గతిని నిర్ణయించేది మీరే. తొలిసారి ఓటు వేయబోతున్నవారికి నా శుభాకాంక్షలు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయండి’’ అని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్‌ శుక్రవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. వీరిలో 35.67 లక్షల మంది తొలిసారి ఓటర్లు. 20-29 ఏళ్ల మధ్య వయసువారు 3.51 కోట్లు ఉన్నారు. మొత్తం 1.87 లక్షల పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. తమిళనాడులో ఉన్న మొత్తం 39 లోక్‌సభ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్‌ పూర్తికానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని