PM Modi: పాలు పిండకముందే.. నెయ్యి కోసం గొడవ

అయిదేళ్లలో అయిదుగురు ప్రధానుల గురించి మాట్లాడుతున్న విపక్ష ఇండియా కూటమి వైఖరి ఆవు ఇంకా పాలు ఇవ్వకముందే నెయ్యి కోసం కొట్లాడుకున్నట్లుగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Updated : 24 May 2024 06:25 IST

ప్రధాని పీఠంపై ఇండియా   కూటమిలో కొట్లాట 
కాంగ్రెస్‌ వస్తే..   ‘రామ్‌ రామ్‌’ అంటే అరెస్టే
హరియాణా, పంజాబ్‌   సభల్లో నరేంద్ర మోదీ 

మహేంద్రగఢ్‌/పటియాలా: అయిదేళ్లలో అయిదుగురు ప్రధానుల గురించి మాట్లాడుతున్న విపక్ష ఇండియా కూటమి వైఖరి ఆవు ఇంకా పాలు ఇవ్వకముందే నెయ్యి కోసం కొట్లాడుకున్నట్లుగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి ఎవరిని బాధ్యులను చేయాలనే చర్చ ఆ కూటమిలో అపుడే మొదలైందన్నారు. గురువారం హరియాణాలోని మహేంద్రగఢ్, పంజాబ్‌లోని పటియాలా ఎన్నికల సభల్లో ప్రధాని మాట్లాడారు. హరియాణాలో ప్రజలు ‘రామ్‌ రామ్‌’ అని పలకరించుకుంటారని, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ‘రామ్‌ రామ్‌’ అన్నవాళ్లందరినీ అరెస్టు చేస్తుందన్నారు. అలాగే రామమందిరానికి కూడా తాళం వేస్తామంటున్న ఆ పార్టీ ప్రజల విశ్వాసాలను అవమానిస్తోందని చెప్పారు. తన ఓటుబ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్‌ భారత్‌ను విభజించి ఇప్పటికే రెండు ముస్లిం దేశాలను ఏర్పాటు చేసిందన్నారు. ఇక ఏడు జన్మలెత్తినా ఇండియా కూటమి ప్రభుత్వం రాబోదని మోదీ స్పష్టం చేశారు.  

భగవంత్‌ మాన్‌ ‘కాగితపు ముఖ్యమంత్రి’

పంజాబ్‌లోని పటియాలా సభలో ప్రధాని మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్‌ఆద్మీ పార్టీపై విరుచుకుపడ్డారు. మంత్రులందరూ కాలక్షేపం చేస్తుండగా.. ‘దిల్లీ దర్బారు’లో హాజరు వేయించుకోవడంలో ఇక్కడి ‘కాగితపు ముఖ్యమంత్రి’ నిమగ్నమై ఉన్నట్లు విమర్శించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాపారం జోరుగా సాగుతుండగా.. ఇక్కడి ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయి ఉందన్నారు. దిల్లీలో కలిసి పోటీ చేస్తున్న భయంకరమైన అవినీతి పార్టీ, సిక్కు వ్యతిరేక దాడుల నిందితురాలైన మరో పార్టీ పంజాబ్‌లో మాత్రం పరస్పరం తలపడుతున్నట్లుగా ప్రజల ముందు నాటకం ఆడుతున్నాయన్నారు. 1971 యుద్ధంలో 90,000 మందికి పైగా పాక్‌ సైనికులు భారత్‌కు లొంగిపోయారని, అప్పుడు తాను అధికారంలో ఉండి ఉంటే ఆ సైనికులను విడుదల చేసే ముందు పాక్‌ నుంచి కర్తార్‌పుర్‌ సాహిబ్‌ను వెనక్కు తీసుకునేవాడినని మోదీ తెలిపారు. సొంత గురువు అన్నాహజారేకు ద్రోహం చేసి, నిత్యం అబద్ధాలు చెబుతున్న పార్టీ పంజాబ్‌కు మేలు చేయలేదని ఆప్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.   

ముస్లిం రిజర్వేషన్లకే మమత మొగ్గు 

‘‘పశ్చిమబెంగాల్‌లో టీఎంసీ సర్కారు రాత్రికి రాత్రి ముస్లింలకు ఓబీసీ ధ్రువపత్రాలు జారీ చేసింది. వాటిని అందుకున్నవారిలో చొరబాటుదారులు కూడా ఉన్నారు. గత 10 - 12 ఏళ్లుగా ఇచ్చిన ఆ ధ్రువపత్రాలు చెల్లవని కలకత్తా హైకోర్టు తీర్పు చెప్పినా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమోదించడానికి సిద్ధంగా లేరు. ముస్లింలకు ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చి తీరుతానని చెబుతున్నారు. ఇవీ ఇండియా కూటమి ఓటుబ్యాంకు రాజకీయాలు’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. మోదీ బతికున్నంత వరకు దళితులు, గిరిజనుల రిజర్వేషన్లు ఎవరూ గుంజుకోలేరని పునరుద్ఘాటించారు. 


నెయ్యిగారే హరియాణా బాజ్రా ఖిచిడీ..

మహేంద్రగఢ్‌ సభలో ప్రధాని ప్రసంగిస్తూ హరియాణా వంటకాలను కాసేపు తలచుకున్నారు. 1995 ప్రాంతంలో తాను భాజపా రాష్ట్ర ఇన్‌ఛార్జిగా ఉండేవాడినని, ఆ సమయంలో ఇక్కడి వంటలను బాగా ఆస్వాదించినట్లు గుర్తు చేసుకున్నారు. నార్నౌల్‌ పట్టణ సుర్జా హల్వా, మహేంద్రగఢ్‌ మిఠాయిలు, నెయ్యిగారే సజ్జల ఖిచిడీ మరచిపోలేనన్నారు. ఒక గ్లాసు రబడీ, ఓ రొట్టె, ఒక ఉల్లిపాయ ఉంటే చాలు.. ఈ వేసవిలో మన ఆకలి తీరినట్టే అన్నారు. హరియాణా నెయ్యి, వెన్న దమ్మెంతో నేడు యావత్‌ ప్రపంచం చూస్తోందని మోదీ తెలిపారు. ఈ ప్రాంత యువత అత్యధికంగా సైన్యంలో చేరడాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని