మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు

కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్‌ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని  మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Published : 19 May 2024 06:03 IST

కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్‌ 
లాఠీలతోనే తూటాలు ఎదుర్కోవాలని చెప్పేది  
ఇప్పుడు ఆయుధాల ఎగుమతి స్థాయికి చేరాం 
బలమైన ప్రభుత్వం ఉంటే శత్రువు భయపడతాడు: మోదీ

అంబాలా సభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ

 అంబాలా, దిల్లీ: కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్‌ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని  మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తొలుత అంబాలాలో, తర్వాత గోహానాలో మాట్లాడుతూ- మునుపటి యూపీయే పాలనపై పలు విమర్శలు చేశారు. ‘‘జీపుల కుంభకోణానికి పాల్పడడంతో పాటు సైన్యాన్ని, సైనికులను కాంగ్రెస్‌ వంచించింది. వారి ప్రాణాలు కాపాడే బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు, నాణ్యమైన దుస్తులు, బూట్లు వంటివీ కొనేది కాదు. తుపాకుల బదులు లాఠీలు ఇచ్చి, వాటితోనే ఉగ్రవాదుల తూటాలను ఎదుర్కోవాలని చెప్పేది. బోఫోర్స్‌ కుంభకోణం, జలాంతర్గాముల కుంభకోణం, హెలికాప్టర్‌ స్కాం.. ఇలాంటివి ఎన్నో కాంగ్రెస్‌ పాలనలో వెలుగుచూశాయి. వీటిద్వారా సైనిక దళాలను బలహీనపరిచేది. ఎందుకో తెలుసా? అలా చేయడం వల్ల విదేశాల నుంచి ఆయుధాల సమీకరణ పేరుతో భారీగా ఆర్జించవచ్చు. నేను అధికారంలోకి వచ్చాక సైనిక దళాలు స్వయం సమృద్ధి సాధించేలా చేశాను. ఒకప్పుడు దిగుమతి చేసుకునే ఆయుధాలను ఇప్పుడు మనం ఎగుమతి చేస్తున్నాం. సైనిక దళాలకు పెద్దసంఖ్యలో సైనికుల్ని సమకూరుస్తున్న హరియాణా ప్రజల నరనరానా దేశభక్తి ప్రవహిస్తుంది’’ అని చెప్పారు.

పాక్‌ చేతిలో భిక్ష పాత్ర

పొరుగుదేశమైన పాకిస్థాన్‌ చేతిలో ఒకప్పుడు బాంబులు ఉండేవని, ఇప్పుడు మాత్రం భిక్ష పాత్ర ఉందని మోదీ ఎద్దేవా చేశారు. భారత్‌లో బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు శత్రువు భయపడతాడని, ఏం చేయాలన్నా వందసార్లు ఆలోచించుకుంటాడని చెప్పారు. ‘‘జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని ఇచ్చిన 370వ అధికరణాన్ని రద్దు చేసింది మా బలమైన సర్కారే. దానివల్ల కశ్మీర్‌ ఇప్పుడు అభివృద్ధి పథంలో పయనిస్తోంది. 370 అనే అడ్డంకిని కబ్రిస్థాన్‌ (శ్మశానం)లో పూడ్చిపెట్టాం. దానిని పునరుద్ధరించే కలను కాంగ్రెస్‌ మరిచిపోవాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ ఎన్నికలు కురుక్షేత్ర సమరం. ఒకపక్క అభివృద్ధి, మరో పక్క ఓటు జిహాద్‌ ఉన్నాయి. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులు ఉండడానికి ఆ పదవి ‘మాతూరామ్‌ జిలేబీ’యా?’’ అని ప్రశ్నించారు. 


ఫిర్‌ ఏక్‌బార్‌.. మోదీ సర్కార్‌ 

హరియాణాలో ప్రతిఇల్లూ ‘ఫిర్‌ ఏక్‌బార్‌..’ (మళ్లీ ఒకసారి..) అని అంటోందని మోదీ చెప్పినప్పుడు ప్రజలంతా ‘..మోదీ సర్కార్‌’ అని నినదించారు.  లోక్‌సభ ఫలితాల వెల్లడికి ఇంకా 17 రోజులే మిగిలాయని, కాంగ్రెస్‌ సహా ఇండియా కూటమిలోని పక్షాలకు తొలి నాలుగు దశల్లో శూన్యహస్తమే లభించిందని చెప్పారు. సాయంత్రం దిల్లీలో జరిగిన మొదటి ప్రచార సభలో ప్రధాని మాట్లాడుతూ- ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ఇండియా కూటమి ఎంతకైనా తెగిస్తుందని చెప్పారు. 2014 ఎన్నికల సమయంలో దిల్లీలోని 123 ప్రధాన ప్రాంతాల్లో స్థలాలను ఓట్ల దృష్టితో వక్ఫ్‌బోర్డుకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. అవినీతి పార్టీలైన కాంగ్రెస్, ఆప్‌ ఒకదానినొకటి సమర్థించుకుంటున్న తీరును లోకం గమనిస్తోందన్నారు. పార్లమెంటు భవనం, 10-జన్‌పథ్‌ దర్బార్‌ కొలువై ఉన్న కొత్తదిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకూ కాంగ్రెస్‌కు బలం లేదని ఎద్దేవా చేశారు. తనకు వారసులంటూ ఎవరైనా ఉంటే అది 140 కోట్ల మంది భారతీయులేనని చెప్పారు. ఎన్నికల ప్రక్రియను పరిశీలించడానికి వివిధ దేశాల దౌత్య కార్యాలయాల ప్రతినిధులు ఈ సభకు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని