PM Modi: విరోధులంతా ఒక్కటైనా.. భాజపా సీట్లన్ని గెలవలేకపోయారు!

భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని వరుసగా మూడోసారి ప్రజలు ఆశీర్వదించారని, ఇది వారిచ్చిన చరిత్రాత్మక తీర్పు అని ప్రధాని మోదీ కొనియాడారు.

Published : 05 Jun 2024 04:58 IST

విపక్ష కూటమికి ప్రధాని మోదీ చురకలు
ఏపీలో చంద్రబాబు.. బిహార్‌లో నీతీశ్‌ నాయకత్వానికి ప్రశంసలు

ఈనాడు, దిల్లీ: భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని వరుసగా మూడోసారి ప్రజలు ఆశీర్వదించారని, ఇది వారిచ్చిన చరిత్రాత్మక తీర్పు అని ప్రధాని మోదీ కొనియాడారు. విరోధులంతా ఒక్కటైనా ఈ ఎన్నికల్లో భాజపాకు వచ్చినన్ని సీట్లు కూడా గెలవలేకపోయారంటూ విపక్ష ఇండియా కూటమిపై వాగ్బాణాలు సంధించారు. 1962 తర్వాత ఒకే కూటమికి వరుసగా మూడోదఫా అధికారం అప్పగించడం ఇదే తొలిసారి అన్నారు. దిల్లీలోని భాజపా ప్రధాన కార్యాలయంలో మంగళవారం రాత్రి కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. ఏపీలో చంద్రబాబునాయుడు, బిహార్‌లో నీతీశ్‌కుమార్‌ నేతృత్వంలో ఎన్డీయే కూటమి అద్భుత ఫలితాలు సాధించిందంటూ ప్రశంసించారు. ‘‘ఆశీర్వదించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఇది మంగళకరమైన రోజు. కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీయే సర్కారు ఏర్పాటు కానుంది. ప్రజలు భాజపా, ఎన్డీయేలపై సంపూర్ణ విశ్వాసం ఉంచారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లోనూ ఎన్డీయేకు ఘన విజయం దక్కింది. అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కింలలో కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోయింది. ఒడిశాలో తొలిసారి భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.  కేరళలోనూ భాజపా తొలి సీటు గెలుచుకొంది. తెలంగాణలో కమలం పార్టీ ఎంపీల సంఖ్య రెండింతలైంది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గడ్, దిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో భాజపా దాదాపు క్లీన్‌స్వీప్‌ చేసింది. అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. కేంద్రం ఈ రాష్ట్రాల అభివృద్ధి కోసం ఏ చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టదు. పదేళ్ల క్రితం మార్పు కోసం దేశం తీర్పు ఇచ్చింది. ప్రజలు అప్పగించిన పనిని బాధ్యతాయుతంగా నిర్వర్తించడంతో రెండోసారి గెలిపించారు. గత అయిదేళ్ల కృషిని వివరించడంతో 2024లోనూ మరోసారి ఎన్డీయేను ఆశీర్వదించారు. ఇందుకు ప్రజలకు తలవంచి నమస్కరించి కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా.  మా అమ్మ కాలధర్మం చేసిన తర్వాత తొలి ఎన్నిక ఇది. కానీ కోట్ల మంది తల్లులు, చెల్లెళ్లు అమ్మలేని లోటు రానివ్వకుండా ఆదరించారు. వారి ప్రేమను మాటల్లో వర్ణించలేను. మా విరోధులు అంతా ఒక్కటైనా భాజపా గెలిచినన్ని సీట్లు కూడా సాధించలేక పోయారు. అందుకే దేశం నలుమూలలున్న భాజపా కార్యకర్తలు, ప్రజలకు ధన్యవాదాలు.  మూడోదఫా ప్రభుత్వం భారీ నిర్ణయాలతో దేశంలో సరికొత్త అధ్యాయాన్ని రచిస్తుంది. ఇది నా గ్యారంటీ. సమాజంలోని ప్రతి వర్గాన్ని అభివృద్ధి చేయడమే ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యం. పేదరిక నిర్మూలన జరిగేంత వరకూ విశ్రమించం. ప్రతి రంగంలో మహిళలకు కొత్త అవకాశాలు సృష్టిస్తాం. ప్రపంచంలో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు పూర్తి శక్తితో పనిచేస్తాం. మూడో టర్మ్‌లో అవినీతిని కూకటివేళ్లతో సహా పెకిలించివేయడానికి ప్రాధాన్యం ఇస్తాం’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని