PM Modi: ప్రజా విశ్వాసమే నా సంపద

ప్రజలు తనపై ఉంచిన అపారమైన విశ్వాసమే తనవద్ద ఉన్న ఏకైక, అమూల్యమైన సంపద అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ‘నేనూ ఒక మనిషినే.

Published : 21 May 2024 04:59 IST

నేనూ ఒక మనిషినే.. తప్పులు జరగొచ్చు 
కశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నాం
దక్షిణాదిలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తాం
‘పీటీఐ’ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ

ప్రజలు తనపై ఉంచిన అపారమైన విశ్వాసమే తనవద్ద ఉన్న ఏకైక, అమూల్యమైన సంపద అని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ‘నేనూ ఒక మనిషినే. తప్పులు జరిగి ఉండొచ్చు. కానీ నేను ఏదీ దురుద్దేశంతో చేయలేదు. దేశానికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే విషయంలో ఏ ఒక్క ప్రయత్నాన్నీ నేను విడిచిపెట్టను. తు.చ.తప్పకుండా త్రికరణ శుద్ధితో నేటికీ నా పని నేను చేసుకుని వెళ్తున్నాను’ అని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఒడిశాకు వచ్చిన ఆయన పీటీఐ వార్తా సంస్థతో ముఖాముఖి మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

బ్రాండ్‌ మోదీ.. అందుకే పనిచేస్తోంది

‘‘నేను కార్యసాధకుడిని. ఎవరు ఎక్కడ ఉండాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. బ్రాండ్‌ మోదీ అనేది ఎవరో నిర్మించింది కాదు. అది నా రెండు దశాబ్దాల ప్రజా జీవితంపై ప్రజలు వ్యక్తపరిచిన నమ్మకం నుంచి ఉద్భవించింది. అందుకే అది పనిచేస్తోంది. ఏదో కావాలనుకుని నేను పుట్టలేదు.. ఏదో చేయడానికి పుట్టాను. 13 ఏళ్లు సీఎంగా, పదేళ్లు ప్రధానిగా ఉన్నాను. వందేళ్లు పైబడిన నా తల్లి తన చివరి రోజులను ప్రభుత్వాసుపత్రిలో గడిపింది. ఇలాంటి దేశానికి బ్రాండ్‌ అవసరం లేదు. నా జీవితం కొంత భిన్నమని దేశం అర్థం చేసుకుంది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలబెట్టడానికి ఏది అవసరమైతే అది చేస్తా. తమ జీవితాలను మెరుగుపరచడానికి చిత్తశుద్ధితో, అవిశ్రాంతంగా కష్టపడి పనిచేస్తానని, అలసత్వాన్ని దరిచేరనివ్వనని ప్రజలు నమ్మారు. ప్రజాశీర్వాదం నాకెంతో బలం. అదే నన్ను నడిపిస్తోంది. మండుటెండలో నేను రోడ్‌షోలో పాల్గొన్నా అన్ని వయోవర్గాల ప్రజలు అభివాదం చేసి, నేను చెప్పేది వింటున్నారు. అది నా అదృష్టం. వారి కళ్లలో ఆశారేఖను చూసినప్పుడు ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలన్న నా దృఢసంకల్పం మరింత బలపడుతుంది. 

మైనారిటీలకు వ్యతిరేకంగా మాట్లాడలేదు

మైనారిటీలకు వ్యతిరేకంగా నేనెప్పుడూ ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అయితే ఎవరినీ ప్రత్యేక పౌరులుగా అంగీకరించేందుకు సిద్ధంగా లేను. భాజపా ఎప్పుడూ మైనారిటీలకు వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 సీట్ల లక్ష్యాన్ని దాటుతుంది. దక్షిణాదిలో అతిపెద్ద పార్టీగా భాజపా అవతరిస్తుంది. 

విపక్ష ఇండియా కూటమి పలు రాష్ట్రాల్లో ఖాతా తెరవడానికి ఇబ్బందులు పడుతోంది. ఆ కూటమి కార్యకర్తలు కూడా వాటి అభ్యర్థులకు ఓట్లు వేయడం లేదు. రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తిని కాంగ్రెస్‌ నిరంతరం ఉల్లంఘిస్తోంది. ఓటుబ్యాంకు రాజకీయాలతో మైనారిటీలను ప్రసన్నం చేసుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. వాటిని బట్టబయలు చేయడమే నా లక్ష్యం. అర్బన్, పురుషాధిక్య, ఉత్తరాది పార్టీ అని భాజపాపై విపక్షాలు అభాండాలు వేస్తుంటాయి. కానీ అత్యధిక సంఖ్యలో దళిత, ఓబీసీ, ఎస్టీ ఎంపీ/ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ మాది. రాజ్యాంగం, దాని రూపకర్తలు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కోరుకోలేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను మేం రద్దు చేస్తామని చెప్పడం దుష్ప్రచారం, హాస్యాస్పదం. నాకు 250 జతల దుస్తులు ఉన్నాయని విపక్షాలు చెప్పడం నా రాజకీయ ప్రస్థానంలో అతిపెద్ద ఆరోపణ’’ అని మోదీ చెప్పారు.


ప్రధాని ఇంటర్వ్యూపై సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా స్పందిస్తూ- ఎక్కడ అవకాశమున్నా ముస్లింలపై మోదీ ద్వేషాన్ని కక్కుతున్నారని అన్నారు. విద్య, ఆరోగ్యం గురించి ప్రధాని మాట్లాడనేలేదని రాజ్యసభ సభ్యుడు కపిల్‌ సిబల్‌ విమర్శించారు. ఆప్, తృణమూల్‌ వంటి ఇతర పార్టీల నేతలూ ప్రధానిని తప్పుబట్టారు.

భువనేశ్వర్‌ 


ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం 

‘ఉమ్మడి పౌరస్మృతి, ఒకే దేశం-ఒకే ఎన్నిక.. ఈ రెండూ భాజపా మ్యానిఫెస్టోలో భాగమే. ఇచ్చిన హామీలను మేం తప్పకుండా నెరవేరుస్తాం. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు మేం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటాం. దానికి తగ్గ పరిస్థితుల్ని తీసుకువచ్చేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నాం. అధికారం చేపట్టాక తొలి 100 రోజుల్లో అమలు చేయాల్సిన ప్రణాళికను ముందే నిర్ణయించుకోవడం నాకు సీఎంగా ఉన్నప్పటి నుంచే అలవాటు. పాకిస్థాన్‌ విషయానికి వచ్చేసరికి విపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ దేశ ప్రయోజనాలను పణంగా పెట్టేది. అందుకే వాటికి పాకిస్థాన్‌ వత్తాసు పలుకుతుంది. ఉద్యోగ కల్పనలో మునుపటి ప్రభుత్వాలతో పోలిస్తే మా రికార్డే మెరుగు. ప్రపంచంలో మెరుగైన అవకాశాలన్నీ మనకు లభించేలా చేశాం. కేంద్ర ఉద్యోగాల్లో గత ఏడాది లక్షలమందికి నియామక ఉత్తర్వులు ఇచ్చాం. దేశంలో విక్రయిస్తున్న మొబైల్‌ ఫోన్లలో 99% దేశీయంగా తయారైనవే. దర్యాప్తు సంస్థల్ని స్వేచ్ఛగా పనిచేయనివ్వాలి’ అని మోదీ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని