PM Modi: విపక్షాలది మోసగాళ్ల కూటమి

‘‘జంగిల్‌రాజ్‌ వారసుడు (తేజస్వీ యాదవ్‌ను ఉద్దేశించి) జూన్‌ 4 తర్వాత మోదీ విశ్రాంతి తీసుకుంటారని ప్రచారం చేస్తున్నారు.

Updated : 22 May 2024 06:11 IST

జూన్‌ 4న గట్టి ఎదురుదెబ్బ ఖాయం
బిహార్, యూపీ సభల్లో మోదీ

‘‘జంగిల్‌రాజ్‌ వారసుడు (తేజస్వీ యాదవ్‌ను ఉద్దేశించి) జూన్‌ 4 తర్వాత మోదీ విశ్రాంతి తీసుకుంటారని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ యువరాజు (రాహుల్‌గాంధీని ఉద్దేశించి) నా కన్నీరు చూడాలని కోరుకొంటున్నారు. వీరిద్దరి యూపీ మిత్రుడు (అఖిలేశ్‌ యాదవ్‌) నేను జీవిత చరమాంకానికి చేరుకున్నందునే వారణాసి నుంచి పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారు. పుట్టుకతో శ్రీమంతులైన వీరికి పోరాటాలతో నిండిన జీవితమంటే ఏమిటో తెలియదు.’’

మోదీ

మహారాజ్‌గంజ్, మోతిహారీ (బిహార్‌)/ప్రయాగ్‌రాజ్‌ (యూపీ): తీవ్రమైన మతతత్వ, కులతత్వ, వారసత్వ రాజకీయాలను వందశాతం చేస్తున్న ‘ఇండియా’ కూటమి మోసగాళ్ల కలయికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలపై దాడికి దిగారు. రూ.20 లక్షల కోట్ల కుంభకోణాలకు బాధ్యులైన వీరంతా రాజకీయ కూటమిలా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బిహార్, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రధాని పర్యటించారు. బిహార్‌లోని మహారాజ్‌గంజ్, తూర్పు చంపారన్‌ లోక్‌సభ నియోజకవర్గాల సభల్లో మాట్లాడుతూ.. అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ సనాతనధర్మం వ్యతిరేకుల పక్షాన నిలుస్తున్న ఇండియా కూటమికి జూన్‌ 4న ఫలితాల్లో గట్టి ఎదురుదెబ్బ తప్పదని జోస్యం చెప్పారు. వీరి పాపాలతో దేశం ముందుకు సాగదన్నారు. బిహార్‌ను ఏళ్లతరబడి పాలించిన ఆర్జేడీ, కాంగ్రెస్‌ పార్టీలు ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ పుట్టిన ఈ నేలను దోపిడీ, వలసలకు కేంద్రంగా మార్చాయన్నారు. ఎన్డీయే పాలనలో వాటన్నింటికీ అడ్డుకట్ట వేసినట్లు తెలిపారు. తాను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు బిహార్‌ నుంచి వలస వచ్చినవారిని గౌరవంగా చూసుకున్నామని మోదీ గుర్తు చేశారు. పంజాబ్, తెలంగాణ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో బిహారీల గురించి ఇండియా కూటమి నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినపుడు కాంగ్రెస్‌ రాజకుటుంబం నోరు మెదపలేదని విమర్శించారు. దేశంలో పేదల కడుపులు మాడ్చి.. స్విస్‌ బ్యాంకుల్లో నోట్లకట్టలు దాచుకొన్నవారికి తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, సామాన్యుల కష్టాలు అర్థం కావన్నారు.

వారికి కుంభమేళా కంటే ఓటుబ్యాంకే ముఖ్యం

‘‘ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ల హయాంలో కుంభమేళాల్లో ఏం జరిగింది? తొక్కిసలాటల్లో ఎంతోమంది భక్తులు చనిపోయారు. అభివృద్ధి నిరోధక పార్టీలైన వీటికి కుంభమేళా ఏర్పాట్ల కంటే ఓటుబ్యాంకును కాపాడుకోవడమే ముఖ్యం’’ అని ప్రధాని ధ్వజమెత్తారు. యూపీలోని ప్రయాగ్‌రాజ్‌ సభలో మోదీ మాట్లాడుతూ.. 2024లో జరుగుతున్న ఈ ఎన్నికలు భారత భవిష్యత్తు అనే త్రివేణి ఏ దిశలో పయనించాలో నిర్ణయిస్తాయని చెప్పారు. జీ20 వంటి సమావేశాల నిర్వహణ ద్వారా భారత్‌కు విదేశాల్లో లభిస్తున్న ఆదరణను ఇండియా కూటమి జీర్ణం చేసుకోలేకపోతోందని విమర్శించారు. ‘‘రామమందిరాన్ని బహిష్కరించి, సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాలతో పోల్చిన వ్యక్తులను వచ్చే ఏడాది కుంభమేళా ఏర్పాట్లకు అనుమతిద్దామా? శ్రీరాముణ్ని అవమానించినవారిని ప్రయాగ్‌రాజ్‌ ప్రజలు ఎన్నటికీ క్షమించరు’’ అని ప్రధాని తెలిపారు.  

మేము వచ్చాకే మహిళలకు రక్షణ : ప్రధాని

వారణాసి: ఉత్తర్‌ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పాలనలో మహిళలకు రక్షణ లభిస్తోందని, ఆకతాయిలు నేరాలకు పాల్పడే ధైర్యం చేయలేకపోతున్నారని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఎంపీగా తాను పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గ పరిధిలోని మహిళలతో మంగళవారం ఏర్పాటుచేసిన సదస్సును ఉద్దేశించి ప్రధాని మాట్లాడారు. సమాజ్‌వాదీ పార్టీ పాలనలో మహిళలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడేవారన్నారు. అత్యాచారం కేసులో దోషులకు మరణశిక్షను వ్యతిరేకిస్తూ సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడైన ములాయంసింగ్‌ యాదవ్‌ దశాబ్దం కిందట చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోదీ గుర్తు చేశారు. ‘‘అబ్బాయిలన్నాక తప్పులు చేస్తారు’’ అంటూ అప్పట్లో ములాయం వ్యాఖ్యానించడం దుమారం రేపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని