PM Modi: ఈ దేశ మెజారిటీ వర్గాన్ని.. ద్వితీయశ్రేణి పౌరులుగా మారుస్తారు

మత ప్రాతిపదికన రిజర్వేషన్ల కేటాయింపునకు రాజ్యాంగాన్ని తిరగరాయాలని చూస్తున్న విపక్ష ‘ఇండియా’ కూటమి దేశంలోని మెజారిటీ వర్గీయులను ద్వితీయశ్రేణి పౌరులుగా మార్చాలని చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Updated : 27 May 2024 06:24 IST

ఇండీ జమాత్‌కు జిహాదీల మద్దతు
విపక్షాలపై ప్రధాని మోదీ ధ్వజం

మవూ, దేవరియా, మిర్జాపుర్‌ (యూపీ): మత ప్రాతిపదికన రిజర్వేషన్ల కేటాయింపునకు రాజ్యాంగాన్ని తిరగరాయాలని చూస్తున్న విపక్ష ‘ఇండియా’ కూటమి దేశంలోని మెజారిటీ వర్గీయులను ద్వితీయశ్రేణి పౌరులుగా మార్చాలని చూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్‌ ప్రాంతం కిందికి వచ్చే పలు లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఆదివారం జరిగిన ఎన్నికల సభల్లో ప్రధాని ప్రసంగించారు. ఈ పార్టీలు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టి, భిన్న కులాలు పరస్పరం కలహించుకునేలా చేయాలని చూస్తున్నాయని దుయ్యబట్టారు. పూర్వాంచల్‌ను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు ఈ ప్రాంతాన్ని మాఫియా, పేదరికం, నిస్సహాయతలకు కేంద్రంగా మార్చాయని విమర్శించారు. విపక్షాలు మూడు పెద్ద కుట్రలకు రంగం సిద్ధం చేస్తున్నాయని, ఈ విషయమై ప్రజలను అప్రమత్తం చేయడానికే తాను పూర్వాంచల్‌కు వచ్చానన్నారు. మతప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చేలా రాజ్యాంగ మార్పు.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు హరించడం.. మొత్తం రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టడం ఆ మూడు కుట్రలుగా మోదీ వివరించారు. దళితులతో సమానంగా ముస్లింలకు రిజర్వేషన్లు కేటాయించాలని సమాజ్‌వాదీ పార్టీ 2012లోనే తన మ్యానిఫెస్టోలో రాసిందని, కాంగ్రెస్‌ పార్టీ పలు విద్యాలయాలను రాత్రికి రాత్రి మైనారిటీ విద్యాసంస్థలుగా మార్చివేసిందన్నారు. ఎన్నికల సమయంలో ఆయా ప్రాంతాల ఆలయాలను సందర్శించినట్లు నటించే విపక్ష నాయకులు అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నారని ప్రధాని తెలిపారు.

‘‘మోదీకి వ్యతిరేకంగా ఓట్‌ జిహాద్‌ ఫత్వాలు’’

విపక్షాల బండారం బహిర్గతం చేస్తున్నందుకు తనకు వ్యతిరేకంగా ఓట్‌ జిహాద్‌ల ఫత్వాలు (ఆదేశాలు) జారీ చేస్తున్నాయని మోదీ చెప్పారు. సరిహద్దు వెంబడి ఉన్న జిహాదీలు ‘ఇండీ జమాత్‌’కు మద్దతు పలుకుతున్నారని.. అటు పాకిస్థాన్‌లోనూ మన విపక్షాల కోసం ప్రార్థనలు జరుగుతున్నాయని తెలిపారు. దళారీ లావాదేవీలకు అలవాటుపడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం గతంలో భారత్‌ నుంచి బ్రహ్మోస్‌ క్షిపణులను కొనుగోలు చేయాలని చూసిన దేశాలకు అడ్డంకులు సృష్టించిందని మోదీ ఆరోపించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ను మాఫియాకు సురక్షిత ప్రదేశంగా మార్చిన సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్రం పరువు తీసిందన్నారు. భాజపా సర్కారు వచ్చాకనే ఇక్కడి మాఫియాకు వణుకు మొదలైందని చెప్పారు. యాదవ వర్గీయుల ప్రతిభను సమాజ్‌వాదీ పార్టీ నిర్లక్ష్యం చేస్తోందని, ములాయంసింగ్‌ యాదవ్‌ కుటుంబసభ్యులకే టికెట్లు కేటాయించడం ఇందుకు నిదర్శనమన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని