PM Modi: నాడు కేదార్‌నాథ్‌.. నేడు కన్యాకుమారి: ప్రధాని ధ్యాన సాధనకు వేదిక

2019 ఎన్నికల ప్రచారం అనంతరం మోదీ కేదార్‌నాథ్‌ వెళ్లారు. 2024లో ఆయన తన రోల్‌ మోడల్‌ అయిన వివేకానందుడి స్మారకం ఉన్న కన్యాకుమారికి వెళ్లనున్నారు. 

Updated : 30 May 2024 16:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సార్వత్రిక ఎన్నికల ప్రచార ఘట్టం నేటితో పూర్తికానుంది. పంజాబ్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని మోదీ (PM Modi) హోషియార్‌పుర్‌తో ముగించుకోనున్నారు. అనంతరం ఆయన కన్యాకుమారికి బయల్దేరి వెళ్లనున్నారు. అక్కడ ఆయన సుమారు 45 గంటలపాటు గడిపేలా కార్యక్రమాలను ప్లాన్ చేశారు. ఇప్పటికే భద్రతా దళాలు, అధికారులు ఆ ప్రాంతంలో ఏర్పాట్లు పూర్తిచేశారు. అక్కడి ధ్యాన మండపంలో ప్రధాని మోదీ దాదాపు 15 గంటలకు పైగా మెడిటేషన్‌ చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కన్యాకుమారిలోని భగవతి అమ్మాన్‌ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈసందర్భంగా తిరువళ్లువార్‌ విగ్రహాన్ని సందర్శించే అవకాశం ఉంది. 2019లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన కేదార్‌నాథ్‌ వద్ద గుహల్లో ధ్యానం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నుంచి వాటికి విశేష ప్రాచుర్యం లభించింది. 

3 వేల మంది పోలీసు బలగాలు..

ప్రధాని మోదీ పర్యటనను దృష్టిలోపెట్టుకొని 3,000 మందికిపైగా పోలీసులను కన్యాకుమారి, వివేకానందా రాక్‌ మెమోరియల్‌ వద్ద మోహరించారు. ఇప్పటికే ఈ ప్రాంతంలోని సముద్రంలో భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్‌ గస్తీని ముమ్మరం చేశాయి. తమిళనాడు తీర రక్షణ బృందాలు కూడా ఇక్కడ రంగంలోకి దిగాయి. మూడు రోజులపాటు చేపలవేటను నిషేధించారు. ఇక కన్యాకుమారికి వచ్చే యాత్రికులను తనిఖీలు చేస్తున్నారు. 

స్వామి వివేకానందా స్మారకమే ఎందుకు..?

ప్రధాని బస చేయనున్న స్వామి వివేకానందా స్మారకం.. కన్యాకుమారి నుంచి 500 మీటర్ల దూరంలో సముద్రం మధ్యలో ఉంటుంది. వవతురాయి బీచ్‌ నుంచి అక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడ బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రం కలుస్తాయి. 1892లో స్వామి వివేకానందా ఇక్కడే మూడు పగళ్లు, మూడు రాత్రులు ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించారని భక్తులు నమ్ముతారు. స్వామి వివేకానందాను ప్రధాని మోదీ తన రోల్‌మోడల్‌గా భావిస్తారు. ఆయన యువకుడిగా ఉన్న రోజుల్లో రామకృష్ణ మిషన్‌ సభ్యుడు. ఈ సంస్థను వివేకానందుడే స్థాపించాడు. గతేడాది ఆ సంస్థ 125వ వార్షికోత్సవంలో కూడా మోదీ పాల్గొన్నారు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని