మళ్లీ భాజపా గెలిస్తే.. శరద్‌ పవార్, ఉద్ధవ్‌ జైలుకే

మహారాష్ట్రలోని  భివండీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు.

Updated : 18 May 2024 06:21 IST

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్‌ సంచలన వ్యాఖ్యలు

ముంబయి సభలో మాట్లాడుతున్న కేజ్రీవాల్‌ 

భివండీ, అమృత్‌సర్‌ : మహారాష్ట్రలోని  భివండీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భాజపా మరోసారి  అధికారంలోకి వస్తే ఎన్సీపీ (ఎస్‌పీ) అధ్యక్షుడు శరద్‌ పవార్, శివసేన (యూబీటీ) అధినేత, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేను కటకటాల్లోకి నెడుతుందని వ్యాఖ్యానించారు. పేద ప్రజలకు ఉన్నతస్థాయి విద్యను అందించడం, మెరుగైన వైద్య వ్యవస్థను నిర్మించడం వల్లే తనను అరెస్టు చేయించి జైలుకు పంపారని ఆరోపించారు. తానేమీ తన కోసం ఓట్లు అడగడం లేదని.. దేశాన్ని రక్షించేందుకు అభ్యర్థిస్తున్నానని భివండీలో ప్రజలతో అన్నారు. భాజపా గెలవదు గానీ.. ఒకవేళ జూన్‌ 4న గెలిస్తే మాత్రం సుప్రియా సూలే, శరద్‌ పవార్, ఉద్ధవ్‌ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేలను జైలుకు పంపుతుందని వ్యాఖ్యానించారు. జైలులో ఉన్న సమయంలో మధుమేహంతో బాధపడుతున్న తనకు 15 రోజుల పాటు మందులు ఆపేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిందని ఈ సందర్భంగా కేజ్రీవాల్‌ ఆరోపించారు. అలాగే పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఆప్‌ శ్రేణులు, నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ..దేశంలోని ప్రస్తుత పరిస్థితి రష్యాలో మాదిరి ఉందని పేర్కొన్నారు. ఆ దేశంలో నియంతృత్వం కొనసాగుతోందని, ప్రతిపక్ష నేతలను కారాగారాల్లో బంధిస్తున్నారని మన దేశంలో కూడా అలాగే ఉందని తెలిపారు. అయితే నియంత పాలనను దేశం అంగీకరించబోదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని