AP Political status: దర్జాగా నాయకులు.. జైళ్లలో కార్యకర్తలు!

ఎవరు నేరానికి పాల్పడినా సరే.. ఆ నేర తీవ్రతను బట్టే వారిపైన చర్యలు ఉండాలి. రాష్ట్రంలో మాత్రం... నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారు తమ హోదా, పలుకుబడి, అధికారం, స్థాయి, డబ్బును అడ్డం పెట్టుకుని ఆయా కేసుల్లో ప్రత్యేక వెసులుబాటు పొందుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Updated : 28 May 2024 07:35 IST

డబ్బు, పలుకుబడి, అధికారంతో కేసుల నుంచి తప్పించుకుంటున్న నేతలు 
అవేవీలేక చెరసాలల్లో మగ్గుతున్న అనుచరులు 
ఈనాడు - అమరావతి 

వరు నేరానికి పాల్పడినా సరే.. ఆ నేర తీవ్రతను బట్టే వారిపైన చర్యలు ఉండాలి. రాష్ట్రంలో మాత్రం... నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారు తమ హోదా, పలుకుబడి, అధికారం, స్థాయి, డబ్బును అడ్డం పెట్టుకుని ఆయా కేసుల్లో ప్రత్యేక వెసులుబాటు పొందుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వారు హత్య, హత్యాయత్నం వంటి తీవ్ర కేసుల్లో నిందితులుగా ఉన్నా సరే... పోలీసులు అసలు వారిని అరెస్టే చేయకుండా చూడటంతోపాటు వారు పరారయ్యేందుకు, అజ్ఞాతంలో గడిపేందుకు కావాల్సినంత సమయమిస్తున్నారు. ఈ లోగా వారు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు. అత్యంత ఖరీదైన న్యాయవాదులతో వాదనలు వినిపించి ముందస్తు బెయిల్‌ లేదా తాత్కాలిక ఉపశమనం వంటివి పొందుతున్నారు. అవే కేసుల్లో నిందితులుగా ఉన్న ఆయా నాయకుల అనుచరులు, కార్యకర్తలు మాత్రం హైకోర్టును ఆశ్రయించ లేక, ఖరీదైన న్యాయవాదులను పెట్టుకునే ఆర్థిక స్తోమత లేక అరెస్టై రోజుల తరబడి స్థానిక జైళ్లల్లోనే గడుపుతున్నారు. కనీసం బెయిల్‌ పిటిషన్లు కూడా వేసుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన ఘటనలను పరిశీలిస్తే ఇదే స్పష్టమవుతోంది. ఇక్కడ న్యాయవ్యవస్థ తప్పులేదు. డబ్బు,  అధికారం, పలుకుబడితో సాధించుకుంటున్న తీరు అలా ఉంది. 

ఆవేశాలు పెంచుకుని..

ఏ రాజకీయ పార్టీలోనైనా సరే నాయకులు తమపై ఎన్ని కేసులు, అభియోగాలు ఉన్నా దర్జాగా ఉంటున్నారు. కానీ వారి కోసం ఆవేశాలు పెంచుకుని వారి తరఫున ఘర్షణలు, అల్లర్లల్లో పాల్గొంటున్న వారి అనుచరులు, కార్యకర్తలే జీవితాలను బలి చేసుకుంటున్నారు. కేసుల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో రాజకీయ అల్లర్లు, ఘర్షణల్లో తలపడే కార్యకర్తల్లో ఎక్కువ మంది సామాన్యులే. ఎప్పటికప్పుడు ఏదో ఒక పనిచేసుకుంటే తప్ప పూట గడవని వారే.. వీరు కేసుల్లో చిక్కుకుంటే లక్షల రూపాయలు ఖర్చు చేసి హైకోర్టు వరకూ వెళ్లలేరు.. ఖరీదైన న్యాయవాదులను పెట్టుకోలేరు. దీంతో రోజుల తరబడి జైల్లో మగ్గిపోతూ, సంవత్సరాల తరబడి ఆయా కేసుల విచారణ కోసం తిరుగుతూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఎన్నికల్లో గెలిస్తే పదవులు, హోదాలు దక్కించుకుని అధికారం చెలాయించేది నాయకులైతే... వారి కోసం కేసుల్లో ఇరుక్కుపోయి జీవితాలను కోల్పోతున్నది సామాన్య కార్యకర్తలే. గురజాల నియోజకవర్గం మోర్జంపాడులో జరిగిన రాజకీయ ఘర్షణలకు సంబంధించి ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను ఇటీవల పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన రిమాండులో ఉన్నారు. ఇలా ఎంతో మంది విద్యావంతులైన యువకులూ బలైపోతున్నారు. ఒక్కసారి కేసుల్లో చిక్కుకుంటే వారికి ఉద్యోగాలు రావు. యాంటిసిడెంట్‌ సర్టిఫికెట్లు లభించవు. విదేశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు తప్పవు. 

ఒక్కరికీ బెయిల్‌ రాలేదు..

  • తిరుపతి జిల్లాలో నమోదైన కేసులు: 4
  • అరెస్టైన వారు: 14 మంది
  • ఒక్కరికీ బెయిల్‌ రాలేదు. అందరూ పది రోజులుగా జైల్లోనే ఉన్నారు. 
  • తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వద్ద తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం ఘటనలో 13 మందిపై కేసు నమోదైంది. వీరంతా ప్రస్తుతం జైల్లో ఉన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని రామిరెడ్డిపల్లి, కూచువారిపల్లి గ్రామాల్లో జరిగిన హింసాత్మక ఘటనల్లో 37 మందిపై కేసు నమోదైంది. ఒక్కర్నే అరెస్టు చేయగలిగారు.

హత్య కేసులో నిందితుడైన అవినాష్‌రెడ్డి ఒక్క క్షణమైనా జైలుకెళ్లలేదు

వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డిని నిందితుడిగా చేర్చిన వెంటనే సీబీఐ ఆయన్ను అరెస్టు చేయలేదు. ఆ తర్వాత కొన్నాళ్లకు అవినాష్‌ను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తే వైకాపా శ్రేణులు సీబీఐ బృందాలను అడ్డుకున్నాయి. సీబీఐకి అవసరమైన సహకారం ఇవ్వకుండా వైకాపా ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అవినాష్‌కు సహకరించి అరెస్టు కాకుండా కాపాడింది. ఈలోగా ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు మీద పిటిషన్లు దాఖలు చేసి, ఖరీదైన న్యాయవాదుల్ని తీసుకొచ్చి వాదనలు వినిపించి ఉపశమనం పొందారు. ఒక్క క్షణం కూడా జైలుకు వెళ్లలేదు. కేవలం సాంకేతికంగా కాగితాలపై మాత్రమే అరెస్టయ్యారు.


ఈవీఎం ధ్వంసం కేసులో.. ఒడిశాలో భాజపా ఎమ్మెల్యే జైల్లో

డిశాలోని చిలకా నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే ప్రశాంత్‌ జగ్‌దేవ్‌ ఈ నెల 25న జరిగిన ఎన్నికల్లో ఖుర్దా జిల్లాలోని ఓ పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేశారు. అక్కడి సిబ్బందిని దుర్భాషలాడారు. ఆ కేంద్రంలో సీసీ ఫుటేజీలు ఉన్నప్పటికీ అవి పరిశీలించాల్సిన అవసరం లేకుండానే ఈ ఘటనపై సంబంధిత ప్రిసైడింగ్‌ అధికారి చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు అదే రోజు అర్ధరాత్రి జగదేవ్‌ను అరెస్టు చేశారు. న్యాయస్థానం ఆయనకు రిమాండ్‌ విధించింది. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. 


మాచర్లలో పిన్నెల్లి విధ్వంసకాండ కళ్లకు కట్టినా అరెస్టు లేదు..

మాచర్ల నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు ధ్వంసం చేసిన దృశ్యాలను లోకమంతా చూసింది. ఆ విధ్వంసకాండ మొత్తం వెబ్‌ కెమెరాల్లోనూ రికార్డైంది. సాంకేతికంగా పక్కాగా ఆధారాలున్నా ఘటన జరిగిన వారం రోజుల వరకూ ఆయన పేరే నిందితుల జాబితాలో చేర్చలేదు. ఆ తర్వాత కూడా వెంటనే అరెస్టు చేయలేదు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లేందుకు, పరారైపోయేందుకు కావాల్సినంత సమయం ఇచ్చారు. ఈలోగా ఆయన హైకోర్టును ఆశ్రయించి జూన్‌ 6వ తేదీ వరకూ చర్యలు తీసుకోకుండా రక్షణ పొందారు.


సీఎంపై గులకరాయి విసిరిన ఘటనలో నెలన్నర రోజులుగా జైల్లోనే

ముఖ్యమంత్రి జగన్‌పైకి గులకరాయి విసిరిన ఘటనలో నిందితుడైన సతీష్‌కుమార్‌ అలియాస్‌ సత్తిని విజయవాడ పోలీసులు ఏప్రిల్‌ 18న అరెస్టు చేశారు. హత్యాయత్నం, నేరపూరిత కుట్ర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాదాపు నెలన్నర రోజులవుతున్నా సతీష్‌కుమార్‌కు బెయిల్‌ రాలేదు. ప్రస్తుతం ఆయన జైల్లోనే గడుపుతున్నారు.


సీఐపై హత్యాయత్నం చేసినా పిన్నెల్లిని అరెస్టు చేయరు...

మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడిపై హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పోలింగ్‌ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలు, దాడులు, హత్యాయత్నం ఘటనల్లో వీరిరువురూ నిందితులుగా ఉన్నారు. కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి చేసి, గాయపరిచి హత్యాయత్నానికి తెగబడ్డారని పిన్నెల్లి సోదరులపై కేసు నమోదైంది. పాల్వాయిగేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేస్తుండగా అడ్డుకోబోయిన నంబూరి శేషగిరిరావుపై ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యాయత్నం చేశారంటూ మరో కేసు నమోదైంది. ఈ కేసుల్లో పిన్నెల్లి సోదరులను పోలీసులు ఇప్పటివరకూ అరెస్టు చేయలేదు. ఈ రెండు కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోసం రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

గతేడాది ఆగస్టులో పుంగనూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల్లో వందల మందిపై హత్యాయత్నం సెక్షన్లు కింద కేసులు పెట్టి 300 మందిని అరెస్టు చేశారు. వారంతా దాదాపు 45 రోజుల పాటు జైల్లోనే గడిపారు. అంతకు ముందు అంగళ్లులో చంద్రబాబు పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఘటనల్లో కూడా హత్యాయత్నం సెక్షన్‌ కింద కేసు పెట్టి దాదాపు 100 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారంతా 45 రోజులపైనే జైల్లో ఉన్నారు. సామాన్య కార్యకర్తలు ఎలా బలైపోతున్నారో చెప్పేందుకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. 


పల్నాడు హింసాకాండలో..

ల్నాడు జిల్లాలో పోలింగ్‌ రోజు ఆ తర్వాత జరిగిన హింసాకాండకు సంబంధించి నమోదైన మొత్తం కేసులు: 150 

  • ఈ కేసుల్లో నిందితులు: 1,666 మంది ఞ అరెస్టైన వారు: 100 మంది 
  • బెయిల్‌పై బయటకు వచ్చిన వారు: 20 మంది 
  • ఇంకా జైల్లోనే ఉన్నవారు: 80 మంది 
  • ఎన్ని రోజులుగా జైల్లో ఉన్నారు: 10 
  • మారణాయుధాలతో దాడి, హత్యాయత్నం, ప్రజాప్రాతినిధ్య చట్టం, మరికొన్ని ఇతర సెక్షన్ల కింద నమోదైన కేసుల్లో వీరంతా జైల్లో ఉన్నారు. 
  • ప్రధానంగా మాచర్ల నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలకు కారణమైన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం ఘటనలో హైకోర్టును ఆశ్రయించి జూన్‌ 6 వరకూ అరెస్టు కాకుండా రక్షణ పొందారు. హత్యాయత్నం కేసుల్లోనూ ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేసుకున్నారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తీర్పు రిజర్వు చేసింది. తుమృకోట, జెట్టిపాలెంలో ఈవీఎంల ధ్వంసం కేసుల్లో 10 మంది బెయిల్‌పై బయటకు వచ్చారు.

తాడిపత్రి ఘర్షణల్లో...

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఘర్షణలకు సంబంధించి నమోదైన కేసులు: 7

  • ఆయా కేసుల్లో నిందితులు: 728 మంది  ఞ ఇప్పటివరకూ అరెస్టైన వారు: 102 మంది
  • ఎన్ని రోజులుగా జైల్లో ఉన్నారు: 10  ఞ బెయిల్‌పై విడుదలైన వారు: లేరు
  • మారణాయుధాలతో దాడి, అల్లర్లు, హత్యాయత్నం కేసుల్లో వీరంతా జైల్లో ఉన్నారు. 

ఈ కేసుల్లో నిందితులైన వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, తెదేపా నేత జేసీ అస్మిత్‌రెడ్డి మాత్రం హైకోర్టును ఆశ్రయించి జూన్‌ 6 వరకూ అరెస్టు కాకుండా రక్షణ పొందారు.


ఉల్లంఘనలకు ఎవరు పాల్పడినా ఒకేలా పరిగణించాలి

- ఏ.సత్యప్రసాద్, సీనియర్‌ న్యాయవాది

ట్టాన్ని కొంతమందికి దగ్గరగా, మరికొంతమందికి దూరంగా ఉంచడానికి వీల్లేదు. న్యాయం ఎవరికైనా ఒకే రకంగా ఉండాలి. చట్టంతో అవసరం ఉన్న వ్యక్తుల కంటే.. ఉల్లంఘించే వారే ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు. అందుకు వ్యవస్థలు దోహదపడుతున్నాయి. పోలీసు, జ్యుడిషియరీ వ్యవస్థలు వ్యక్తుల స్థాయినిబట్టో, వ్యక్తిగత ప్రాధాన్యతల ఆధారంగానో వ్యవహరించకూడదు. చట్టాలను అందరికి ఒకేవిధంగా, సమానంగా వర్తింపచేయాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉంది. వ్యక్తుల హోదాను దృష్టిలోపెట్టుకుని చట్టాలను అమలు చేస్తే అలాంటి చట్టాలు నిరుపయోగం, దుర్వినియోగం అవుతాయి. ధనబలం, కండబలం ఉన్న వారికి ఓ న్యాయం, బలహీనులకు మరో న్యాయం చేయడం సరికాదు. చట్టం ముందు అందరూ సమానులే అనే మౌలిక సూత్రానికి రానురాను ప్రాధాన్యత తగ్గిపోతోంది. పెద్ద, చిన్న, పేద, ధనిక అనే వ్యత్యాసం లేకుండా ఉల్లంఘనలకు ఎవరు పాల్పడినా కోర్టులు సమానంగా చూడాలి. నిబంధనలకు కట్టుబడి వ్యవహరించాలి.


చట్టం అమలు అందరికి సమానంగా లేదు

- పి.రాజారావు, సీనియర్‌ న్యాయవాది, గుంటూరు 

కేసుల నమోదు దశ నుంచే వ్యక్తుల స్థాయిని దృష్టిలోపెట్టుకొని పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తోంది. దర్యాప్తుదశలోనూ అంతే. కొందరు పీపీలు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లుగా కాకుండా.. ‘పోలీసు ప్రాసిక్యూటర్లు’గా వ్యవహరిస్తున్నారు. వారి వాదనలు ఆయా నిందితుల రాజకీయ ప్రయోజనాలను కాపాడేలా ఉంటున్నాయి. పీపీలు, ఏపీపీల వాదన విధానం వల్లనే కోర్టులు విభిన్న ఉత్తర్వులిస్తున్నాయి. చట్టం అమలు అందరికి సమానంగా జరగడం లేదు. చట్టాలు అధికారబలం ఉన్నవారికి ఒక విధంగా, సామాన్యులకు మరో విధంగా అమలు కాకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు, న్యాయవ్యవస్థపై ఉంది. నిందితుల స్థాయి పెద్దదయితే తక్కువ శిక్షకు వీలున్న సెక్షన్లను పోలీసులు నమోదు చేస్తున్నారు. స్థాయినిబట్టి సెక్షన్లను నమోదు చేయడం సరికాదు. ప్రభుత్వ పెద్దలు వ్యవస్థలను లొంగదీసుకొని వారి కనుసన్నల్లో నడిపిస్తున్నారు. పోలీసులు సీఆర్‌పీసీ, రాజ్యాంగ నిబంధనలకు కట్టుబడి పనిచేయడం లేదు. న్యాయస్థానాలు సైతం నిందితులకు బెయిలు మంజూరు చేసే సమయంలో నేరచరిత్రను చూడాలి. బెయిలిస్తే సాక్షులను ప్రభావితం చేస్తారాలేదా అనేది చూడాలి. అంతేతప్ప వ్యక్తుల హోదాను దృష్టిలో పెట్టుకోకూడదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని