Political Parties: ఇబ్బడిముబ్బడిగా రాజకీయ పార్టీలు

దేశంలో రాజకీయ పార్టీల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2009 ఎన్నికలతో పోల్చితే ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన రాజకీయ పార్టీల సంఖ్యలో 104 శాతం పెరుగుదల నమోదైనట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్‌) విశ్లేషణలో వెల్లడైంది.

Published : 30 May 2024 05:26 IST

2009తో పోల్చితే ప్రస్తుత ఎన్నికల్లో 104% అధికం
ఏడీఆర్‌ విశ్లేషణలో వెల్లడి

దిల్లీ: దేశంలో రాజకీయ పార్టీల సంఖ్య పెరుగుతూనే ఉంది. 2009 ఎన్నికలతో పోల్చితే ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన రాజకీయ పార్టీల సంఖ్యలో 104 శాతం పెరుగుదల నమోదైనట్లు ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్‌) విశ్లేషణలో వెల్లడైంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో 368 పార్టీలు పోటీ చేయగా, 2014లో 464, 2019లో 677, 2024లో 751 రాజకీయ పార్టీల అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో 8,360 మంది పోటీచేస్తుండగా వారిలో 1,333 మంది జాతీయ పార్టీల తరఫున, 532 మంది ప్రాంతీయ పార్టీల తరఫున, 2.580 మంది నమోదైన గుర్తింపు పొందని పార్టీల తరఫున పోటీచేస్తున్నారు. వీరందరితోపాటు 3,915 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. 

  • జాతీయ పార్టీల తరఫున బరిలో నిలిచిన 1,333 మంది అభ్యర్థుల్లో 433 మంది నేరచరితులు. వారిలో 295 మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. 
  • జాతీయ పార్టీలతో పోల్చితే ప్రాంతీయ పార్టీల అభ్యర్థుల్లో నేరచరితుల నిష్పత్తి ఎక్కువగా ఉంది. 532 మంది ప్రాంతీయ పార్టీల అభ్యర్థుల్లో 249 మంది నేరచరితులు కాగా, వారిలో 169 మందిపై తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. 
  • నమోదైన గుర్తింపు పొందని పార్టీల నుంచి బరిలో నిలిచిన 2,580 మంది అభ్యర్థుల్లో 401 మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. వారిలో 316 మంది తీవ్రమైన క్రిమినల్‌ కేసులను ఎదుర్కొంటున్నారు. 
  • 3,915 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 550 మందిపై క్రిమినల్‌ కేసులు ఉండగా, వారిలో 411 మందిపై అత్యంత తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. 
  • జాతీయ పార్టీల్లో 906 మంది (మొత్తం అభ్యర్థులు 1,333), ప్రాంతీయ పార్టీల్లో 421 మంది (మొత్తం అభ్యర్థులు 532), నమోదైన గుర్తింపు పొందని పార్టీల్లో 527 మంది  (మొత్తం అభ్యర్థులు 2,580), స్వతంత్ర అభ్యర్థుల్లో 673 మంది (మొత్తం అభ్యర్థులు 3,915) కోటీశ్వరులు ఉన్నారు.

పోటీలో ఉన్న సిటింగ్‌ ఎంపీల ఆస్తుల్లో పెరుగుదల

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేస్తున్న 324 మంది సిటింగ్‌ ఎంపీల సగటు ఆస్తుల విలువ గత ఐదేళ్లలో 43 శాతం మేర పెరిగినట్లు ఏడీఆర్‌ తెలిపింది. 2019లో వీరి సగటు ఆస్తుల విలువ రూ.21.55 కోట్లు ఉండగా, ప్రస్తుతం రూ.30.88 కోట్లకు చేరింది.


మహిళా అభ్యర్థులు పెరుగుతున్నారు..

లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తున్న మహిళల సంఖ్య గత 15 ఏళ్లుగా స్థిరంగా పెరుగుతోందని ఏడీఆర్‌ తెలిపింది. 2009 ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల్లో 7 శాతం మంది మహిళలు ఉండగా, 2024లో ఆ శాతం    9.6కు చేరినట్లు వెల్లడించింది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 8,360 మంది పోటీచేస్తున్నారు. వారిలో 8,337 మంది అభ్యర్థుల వివరాలను ఏడీఆర్‌ విశ్లేషించింది. ఈ 8,337 మంది అభ్యర్థుల్లో 797 మంది (9.6 శాతం) మహిళలు ఉన్నారు. 2009 (7శాతం), 2014 (8శాతం), 2019 (9శాతం)లతో పోల్చితే ఇదే అధికం కావడం విశేషం. ప్రస్తుత ఎన్నికల్లో భాజపా తరఫున మొత్తం 440 మంది అభ్యర్థులు పోటీచేస్తుండగా వారిలో 69 మంది (16%) మహిళలు కావడం విశేషం. కాంగ్రెస్‌ పార్టీ తరఫున 327 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో 41 మంది (13%) మహిళా అభ్యర్థులు ఉన్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని