AP Poll violence: నేతల స్వార్థానికి మా బిడ్డల భవిష్యత్తు బలి

బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మహేశ్‌రెడ్డి ఓటేద్దామని నరసరావుపేట వచ్చారు. వైఎస్సార్‌ మీద అభిమానంతో వైకాపా నిర్వహించే కార్యక్రమాల్లోనూ తరచూ పాల్గొంటున్నారు. పోలింగ్‌ రోజు సాయంత్రం నరసరావుపేటలోని గుంటూరు రోడ్డులో జరిగిన అల్లర్లలో పాల్గొన్నారు.

Updated : 22 May 2024 07:33 IST

ఎక్కడున్నారో.. ఎలా ఉన్నారో?
అల్లర్లలో ఇరుక్కున్న నిందితుల తల్లిదండ్రుల ఆవేదన
ఈనాడు డిజిటల్, నరసరావుపేట

మాచర్ల నియోజకవర్గంలోని ఓ గ్రామంలో పోలింగ్‌ రోజు నెలకొన్న ఘర్షణ

బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మహేశ్‌రెడ్డి ఓటేద్దామని నరసరావుపేట వచ్చారు. వైఎస్సార్‌ మీద అభిమానంతో వైకాపా నిర్వహించే కార్యక్రమాల్లోనూ తరచూ పాల్గొంటున్నారు. పోలింగ్‌ రోజు సాయంత్రం నరసరావుపేటలోని గుంటూరు రోడ్డులో జరిగిన అల్లర్లలో పాల్గొన్నారు. నాయకుడి ప్రకటనలతో రెచ్చిపోయి కర్రలతో రోడ్డుపై పరుగులు పెట్టారు. ప్రస్తుతం పోలీసుల నుంచి 41ఏ నోటీసు రావడంతో అతని తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎప్పుడూ గొడవల జోలికి పోని తమ కుమారుడు ఇలా కేసుల్లో ఇరుక్కోవడంతో ఆందోళన చెందుతున్నారు.

మాచర్లకు చెందిన ఓ యువకుడు డిగ్రీ పూర్తి చేసి, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఇటీవల వెలువడిన గ్రూపు-2 ప్రిలిమ్స్‌ పరీక్షలో కూడా అర్హత సాధించాడు. పిన్నెల్లి సోదరులంటే ఇతనికి పిచ్చి. ఎన్నికల కోడ్‌ వచ్చినప్పటి నుంచి చదువు పక్కనపెట్టి, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. పోలింగ్‌ మరుసటి రోజు కారంపూడిలో జరిగిన అల్లర్ల ఘటనలో పాల్గొన్నాడు. వీడియోలో కనిపించిన ఆనవాళ్లతో కేసు నమోదు చేసి, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదవడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత కోల్పోయినట్టేనని అతని తల్లిదండ్రులు బాధపడుతున్నారు.

ఇలా పల్నాడు జిల్లాలో పోలింగ్‌ అల్లర్లలో తలదూర్చిన యువకుల కుటుంబాలు భయాందోళనలతో బతుకుతున్నాయి. ఇళ్లకు పోలీసులు రావడం, నోటీసులు, అరెస్టులు అంటూ తిరగడంతో ఎప్పుడేం జరుగుతుందోనని భయపడుతున్నారు. ఎన్నికల గొడవల్లో తలదూర్చిన యువత సొంతూళ్లో ఉండలేక ఎక్కడో దూరాన ఉన్న బంధువుల ఇళ్లల్లో తలదాచుకుంటున్నారు. సినిమాలు చూసి కొందరు.. హీరోల్లా వెంటపడి తరిమికొట్టే అవకాశం వచ్చిందని మరికొందరు.. తమ అభిమాన నేత రెచ్చగొట్టారని ఇంకొందరు.. ఐదేళ్లుగా తమను హింసించి అక్రమ కేసులు పెట్టారని, ఇప్పుడు సమయం వచ్చిందని మరికొందరు.. ఇలా పోలింగ్‌ రోజు, మరుసటి రోజున జరిగిన అల్లర్లలో తలదూర్చారు. నరసరావుపేటలో అయితే బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ వేసి, కర్రలు చేతపట్టి దాడులకు దిగారు. కారంపూడిలో ఏకంగా ఇనుపరాడ్లు చేతపట్టుకుని ప్రధాన రహదారిపై పట్టపగలు వీరంగం వేశారు. వెనకుండి వారిని రెచ్చగొట్టిన నాయకులంతా ప్రస్తుతం హాయిగా ఏసీ గదుల్లో సేదతీరుతున్నారు. కానీ అమాయకులైన అనుచరణగణమంతా బలైంది. అప్పుడు రెచ్చగొట్టిన నేతలు నేడు మీకేం కాదని బాధిత యువతకు భరోసా ఇచ్చే పరిస్థితి కనపడటం లేదు. దీంతో అల్లర్ల కేసుల్లో ఇరుక్కున్నవారి తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు నాశనమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మెడకు కేసుల ఉచ్చు

పోలింగ్‌ రోజు, మరుసటి రోజు జరిగిన గొడవలపై ఈసీ సీరియస్‌గా స్పందించడంతో ప్రత్యేక దర్యాప్తు బృందం జిల్లాలో పర్యటించింది. సిట్‌ రాక ముందు చాలా స్టేషన్లలో కేసుల్లో పురోగతి లేదు. కొంతమందికే 41ఏ నోటీసులిచ్చి వదిలేశారు. సిట్‌ పర్యటించాక పోలింగ్‌ రోజున, మరుసటి రోజున జరిగిన అల్లర్ల వీడియోల సీసీఫుటేజీలను క్షుణ్నంగా పరిశీలించి, ఎవరెవరు పాల్గొన్నారో అందరిపై కేసులు పెట్టడం ముమ్మరం చేశారు. అంతేకాదు అంతకుముందు సాధారణ కేసులు పెట్టిన వారిపై తాజాగా 307 కేసులు పెడుతున్నారు. అప్పుడేదో ఉద్రేకంలో రాళ్లు, కర్రలు పట్టుకుని పరుగులు పెట్టామే కానీ కావాలని చేసింది కాదని యువత ఇప్పుడు బాధపడుతున్నారు.

ఇందులోనూ కాసుల కక్కుర్తి..

అల్లర్లలో పాల్గొన్న వారికి 41ఏ నోటీసులు ఇచ్చి ఠాణాకు రప్పించాక కొందరు పోలీసులు ‘కాసుల’ బేరమాడుతున్నట్లు సమాచారం. నరసరావుపేట రూరల్‌ పరిధిలోని ఓ ఎస్సై తన బుద్ధి పోనిచ్చుకోవడం లేదని 41ఏ నోటీసులు అందుకున్నవారు చెబుతున్నారు. సిట్‌ రాక ముందు ఆ ఎస్సై కేసులు లేకుండా చూస్తానని తమ వద్ద రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకూ దండుకున్నారని.. ఇప్పుడేమో కేసులు కట్టి తమను అదుపులోకి తీసుకుని హింసిస్తున్నారని వాపోయారు. అసలే కేసుల్లో ఇరుక్కుని ఇబ్బందుల్లో ఉంటే మరోపక్క డబ్బుల కోసం రాబందుల్లా కొందరు పోలీసులు పీక్కుతింటున్నారని వివాదాల్లో తలదూర్చిన బాధితులు బాధపడుతున్నారు.


రాజకీయాలు వద్దని చెప్పినా వినలేదు.. 

- మాచర్ల నియోజకవర్గంలో ఓ తల్లి 

మనకు రాజకీయాలు పడవు. అధికార పార్టీ వెంట వెళ్లొద్దని ఎన్నోసార్లు చెప్పా. వినలేదు. పోలింగ్‌ రోజు జరిగిన గొడవల్లో మా అబ్బాయికి రాళ్ల దెబ్బలు తగిలాయి. మర్నాడే ఊరి నుంచి పంపేశా. కేసులు పెట్టి జైల్లో పెడతారని బాధగా ఉంది. నా కోడలు ప్రస్తుతం గర్భిణి. అంత ఆర్థిక స్తోమత లేనివాళ్లం. ఫలితాలు విడుదలైన వారం వరకూ రావద్దని ఒట్టేయించుకుని పంపించా. దూరంగా ఉన్నా వాడు క్షేమంగా ఉండడమే కావాలి.


నాన్న ఎక్కడికెళ్లాడు, ఎప్పుడొస్తాడు? అని పిల్లలు అడుగుతున్నారు..

- నరసరావుపేటలో ఓ మహిళ

ఉపాధి కోసమని నరసరావుపేట వచ్చాం. నా భర్త ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. స్నేహితులతో కలిసి అప్పుడప్పుడు రాజకీయ కార్యక్రమాలకు వెళ్లేవాడు. పోలింగ్‌రోజు సాయంత్రం వాళ్ల స్నేహితులు పిలిస్తే గుంటూరు రోడ్డులో గొడవ జరుగుతోందని వెళ్లాడు. పోలీసులేమో 41ఏ నోటీసులిచ్చారు. ఆయన్ను జైల్లో పెడితే మా బతుకులేం కావాలి? కొన్నిరోజులైనా ఈ గొడవలకు దూరంగా ఉండాలని మా బంధువుల ఇంటికి పంపించా. రోజూ పిల్లలు.. అమ్మా నాన్న ఎప్పుడొస్తాడు? ఎక్కడున్నాడు అని అడుగుతుంటే సమాధానం చెప్పలేకపోతున్నా. ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు