Lok Sabha Elections: కులమతాలదే పైచేయి!

కులమతాల ప్రాభవం ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని 14 నియోజకవర్గాల్లో 25వ తేదీన పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ మొత్తం 162 మంది పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ 14లో 9 భాజపా, బీఎస్పీ 4, సమాజ్‌వాదీ ఒకటి గెలుచుకున్నాయి.

Updated : 24 May 2024 06:20 IST

భాజపా, సమాజ్‌వాదీల అడ్డాల్లో పోరు
ఉత్తర్‌ప్రదేశ్‌ ఆరోవిడతలో 14 స్థానాల్లో పోలింగ్‌
అలహాబాద్, లఖ్‌నవూ నుంచి నీరేంద్ర దేవ్‌

కులమతాల ప్రాభవం ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని 14 నియోజకవర్గాల్లో 25వ తేదీన పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ మొత్తం 162 మంది పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ 14లో 9 భాజపా, బీఎస్పీ 4, సమాజ్‌వాదీ ఒకటి గెలుచుకున్నాయి. పూర్వాంచల్‌లోని ఈ నియోజకవర్గాల్లో మాఫియా, బలవంతుల ఆధిపత్యమూ అధికమే. యాదవ్‌లు, ముస్లింలు, కుర్మీలు, బ్రాహ్మణులు, హిందువుల ఆధిపత్యమున్న ఈ ప్రాంతాల్లో భాజపా, సమాజ్‌వాదీ, బీఎస్పీ గెలుస్తూ వస్తున్నాయి. 

గోమతీ తీరం

 • యోధ్య డివిజన్‌లోని సుల్తాన్‌పుర్‌ గోమతీ తీరాన ఉంది. ఈ నియోజకవర్గంలో 93శాతం మంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటారు. 21.29% ఎస్సీలున్నారు. అత్యధికంగా ఉన్న ఓబీసీలు ఫలితాన్ని నిర్ణయిస్తారు. ముస్లింలు, ఠాకుర్లు, బ్రాహ్మణులూ గణనీయంగానే ఉన్నారు. 
 • 2014, 2019లలో భాజపా విజయం సాధించింది. ఈసారి భాజపా నుంచి మేనకా గాంధీ, సమాజ్‌వాదీ తరఫున రాంభౌల్‌ నిషాద్, బీఎస్పీ టికెట్‌పై ఉద్రాజ్‌ వర్మ పోటీ చేస్తున్నారు. మరోసారి మేనకా గాంధీకే అనుకూలంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

అంబేడ్కర్‌కు గుర్తుగా..

 • రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌కు గుర్తుగా అంబేడ్కర్‌ నగర్‌ జిల్లాను 1995లో మాయావతి ఏర్పాటు చేశారు. టాండా ఎర్రమట్టికి ఈ ప్రాంతం ప్రసిద్ధి. వ్యవసాయం, మరమగ్గాలు ఇక్కడ జీవనాధారం. 4లక్షల మంది దళితుల నిర్ణయంపైనే ఇక్కడి ఫలితం ఆధారపడి ఉంది.  
 • 2014లో భాజపా, 2019లో బీఎస్పీ ఇక్కడ విజయం సాధించాయి. ఈసారి భాజపా తరఫున రితేశ్‌ పాండే, సమాజ్‌వాదీ అభ్యర్థిగా లాల్జీ వర్మ, బీఎస్పీ నుంచి ఖమర్‌ హయత్‌ పోటీ చేస్తున్నారు. మాయావతి ఒకప్పుడు పోటీ చేసిన ఈ నియోజకవర్గంలో నేతలంతా భాజపా, సమాజ్‌వాదీలవైపు వెళ్లిపోయారు. దీంతో రెండు పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

ఉ‘సిరి’ 

 • దేశంలోనే ఉసిరి ఉత్పత్తికి ప్రతాప్‌గఢ్‌ పేరుగాంచింది. ఎస్సీలు 19.9%, ముస్లింలు 14% ఉన్నారు. ఎన్నికల ఫలితాన్ని రాజ్‌పూత్‌లు, కుర్మీలు, బ్రాహ్మణులు శాసిస్తారు. 
 • 2014లో అప్నాదళ్, 2019లో భాజపా గెలిచాయి. భాజపా అభ్యర్థిగా సంగం లాల్‌ గుప్తా, సమాజ్‌వాదీ నుంచి శివ్‌పాల్‌ సింగ్‌ పటేల్‌ తలపడుతున్నారు. రామ మందిరం, ఆర్టికల్‌ 370 రద్దు, మోదీ మ్యాజిక్‌ ప్రభావం ఉన్నా విజయంపై ఉత్కంఠ నెలకొంది. 

మల్లెల సుగంధం

 • గోమతీ తీరాన ఉన్న జౌన్‌పుర్‌ మల్లెల సుగంధాలకు కేంద్రం. ఇక్కడి స్వీట్లూ ప్రసిద్ధి పొందాయి. హిందువులు 88శాతం ఉంటారు. రాజ్‌భర్లు, కొయిరీలు, గుర్జార్లు, ప్రతీహార్లు అధికంగా ఉంటారు. 
 • 2014లో భాజపా, 2019లో బీఎస్పీ గెలిచాయి. భాజపా తరఫున కృపాశంకర్‌ సింగ్, సమాజ్‌వాదీ నుంచి బాబు సింగ్‌ కుశ్వాహా, బీఎస్పీ అభ్యర్థిగా శ్యాం సింగ్‌ యాదవ్‌ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ముక్కోణ పోటీ జరుగుతోంది. 

సారవంత నేల

 • స్సీలకు రిజర్వు అయిన లాల్‌ గంజ్‌లో సారవంతమైన భూములున్నాయి. ఆలుగడ్డలు, మొక్కజొన్న, గోధుమ, కూరగాయలు ప్రధాన పంటలు. ముస్లింలు, యాదవులు, దళితుల జనాభా అధికం. వీరే ఫలితాన్ని నిర్ణయిస్తారు.  
 • 2014లో భాజపా, 2019లో బీఎస్పీ గెలిచాయి. ఈసారి భాజపా తరఫున నీలం సోంకర్, సమాజ్‌వాదీ నుంచి దరోగా ప్రసాద్‌ సరోజ బరిలోకి దిగారు. గట్టి పోటీ నెలకొంది. 

బౌద్ధ క్షేత్రం

 • నేపాల్‌ సరిహద్దుల్లోని హిమాలయాలవద్ద శ్రావస్తీ ఈ నియోజకవర్గం ఉంటుంది. బౌద్ధ క్షేత్రం కావడంతో ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. కోసల రాజ్యం రాజధానిగా ఉండేది. 17శాతం ఎస్సీలున్నారు. 68% హిందువులున్నారు. 
 • 2014లో భాజపా, 2019లో బీఎస్పీ గెలిచాయి. ఈసారి భాజపా అభ్యర్థిగా సాకేత్‌ మిశ్ర, సమాజ్‌వాదీ నుంచి రాం శిరోమణి వర్మ, బీఎస్పీ తరఫున ముయినుద్దీన్‌ అహ్మద్‌ ఖాన్‌ తలపడుతున్నారు. అత్యంత వెనుకబడిన ఈ ప్రాంతంలో ముస్లింల ఓట్లే కీలకం. 20శాతంగా ఉన్న బలహీనవర్గాల వారి ఓట్లపై అన్ని పార్టీలు గురిపెట్టాయి. 

నెహ్రూ నియోజకవర్గం

 • తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ పోటీ చేసిన నియోజకవర్గం ఫూల్‌పుర్‌. వరుసగా 3సార్లు ఆయన గెలిచారు. ఓబీసీలే ఫలితాన్ని తేలుస్తారు.  
 • 2014, 2019లలో భాజపా గెలిచింది. అయితే 2018లో జరిగిన ఉప ఎన్నికలో సమాజ్‌వాదీ విజయం సాధించింది. భాజపా నుంచి ప్రవీణ్‌ పటేల్, సమాజ్‌వాదీ అభ్యర్థిగా అమర్‌నాథ్‌ సింగ్‌ మౌర్య, బీఎస్పీ తరఫు జగన్నాథ్‌ పాల్‌ పోటీ చేస్తున్నారు. ఎస్సీలు, ఓబీసీలు సమాజ్‌వాదీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఠాకుర్లు, లాలాలు, బనియాలు, బ్రాహ్మణుల మద్దతు భాజపాకు లభిస్తోంది.

సాధువులు, పండితుల భూమి

 • ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా అత్యంత ఎక్కువగా వార్తల్లో నిలిచే నియోజకవర్గం ఆజంగఢ్‌. వివాదాస్పద సమాజ్‌వాదీ నేత ఆజంఖాన్‌కు ఇక్కడ గట్టి పట్టు ఉండటమే కారణం. యూపీ తూర్పు ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతం సాధువులు, పండితులకు నిలయం. ఆశ్రమాలు అధికంగా ఉంటాయి. ఇక్కడ 21% యాదవులు, 19% దళితులు, 17% ముస్లింలు ఉంటారు.
 • 2014, 2019లలో సమాజ్‌వాదీ పార్టీ గెలిచింది. ఈసారి భాజపా నుంచి దినేశ్‌ లాల్‌ యాదవ్, సమాజ్‌వాదీ తరఫున ధర్మేంద్ర యాదవ్‌ తలపడుతున్నారు. ముస్లింలు, యాదవుల అండతో మరోసారి గెలిచేందుకు సమాజ్‌వాదీ ప్రయత్నిస్తోంది. 

బుద్ధుడి జన్మస్థలం

 • రాప్తీ నదిపై ఉన్న డుమారియా గంజ్‌ గౌతమ బుద్ధుడి జన్మ స్థలమైన లుంబిని (కపిలవస్తు) ఉన్న నియోజకవర్గం. 54% హిందువులు, 43% ముస్లింలు. మొత్తం మీద 12% ఎస్సీలుంటారు. 

 • 2014, 2019లలో భాజపా నేత జగదాంబికా పాల్‌ ఇక్కడి నుంచి గెలిచారు. మూడోసారి భాజపా అభ్యర్థిగా జగదాంబికా పాల్, సమాజ్‌వాదీ నుంచి భీష్మ శంకర్, బీఎస్పీ పక్షాన నదీం పోటీ చేస్తున్నారు. హ్యాట్రిక్‌పై భాజపా నమ్మకంగా ఉంది.

వశిష్ఠుడి ఆశ్రమం

 • శిష్ఠ మహర్షి ఆశ్రమం ఉన్న ప్రాంతం బస్తీ. హిందీ పండితుడు, విమర్శకుడు, కథా రచయిత రామచంద్ర శుక్లా సొంత ప్రాంతమిది. 21% ఎస్సీలుంటారు.  

 • 2014, 2019లలో భాజపా నేత హరీశ్‌ ద్వివేది విజయం సాధించారు. మరోసారి ఆయనే పోటీ చేస్తున్నారు. సమాజ్‌వాదీ తరఫున రాం ప్రసాద్‌ చౌధరి, బీఎస్పీ నుంచి లవ్‌కుష్‌ పటేల్‌ బరిలో ఉన్నారు. హ్యాట్రిక్‌పై ద్వివేది కన్నేశారు.

మహిళలే మహారాణులు

 • పురుషుల కంటే మహిళలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం మచిలీశహర్‌. ఇక్కడ ప్రతి వేయి మంది పురుషులకు 1,040 మంది మహిళలున్నారు. 22.7% ఎస్సీలున్నారు. 90 శాతం హిందువులే. 
 • 2014, 2019లలో భాజపా గెలిచింది. భాజపా నుంచి భోలానాథ్, సమాజ్‌వాదీ తరఫున ప్రియా సరోజ్, బీఎస్పీ అభ్యర్థిగా కృపా శంకర్‌ సరోజ్‌ బరిలోకి దిగారు. ఈసారి ఎలాగైనా పట్టు సాధించాలని సమాజ్‌వాదీ ప్రయత్నిస్తోంది. అటు భాజపా మెజారిటీ పెంచుకోవాలని తలపోస్తోంది. 

కబీర్‌ దాస్‌ కోసం..

 • ప్రముఖ సాధువు, కవి కబీర్‌ దాస్‌ పేరుతో సంత్‌ కబీర్‌ నగర్‌ ఏర్పాటైంది. హొసైరీ పరిశ్రమకు ప్రసిద్ధి. దేశంలో అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఇదీ ఒకటి. 22% ఎస్సీలు, 76శాతం హిందువులు ఉన్నారు.  
 • 2014, 2019లలో భాజపా విజయం సాధించింది. భాజపా అభ్యర్థిగా ప్రవీణ్‌ కుమార్‌ నిషాద్, సమాజ్‌వాదీ తరఫున లక్ష్మీకాంత్‌ పప్పు నిషాద్, బీఎస్పీ నుంచి నదీం అష్రాఫ్‌ తలపడుతున్నారు. భాజపాకు సమాజ్‌వాదీ సవాలు విసురుతోంది. ముస్లింలలో ప్రాబల్యమున్న నదీం బీఎస్పీ తరఫున బరిలో ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. 

త్రివేణీ సంగమం

 • లాల్‌ బహదూర్‌ శాస్త్రి, వీపీ సింగ్, మురళీ మనోహర్‌ జోషి, అమితాబ్‌ బచ్చన్‌ లాంటి ఉద్ధండులు పోటీ చేసిన అలహాబాద్‌ గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం. ఇది భాజపాకు కంచుకోట. ముస్లింలు, భూమిహార్లు, బ్రాహ్మణులు ఉంటారు. 
 •  2014, 2019లలో భాజపా విజయం సాధించింది. ఈసారి భాజపా అభ్యర్థిగా నీరజ్‌ త్రిపాఠీ, కాంగ్రెస్‌ నుంచి ఉజ్వల్‌ రమణ్‌ సింగ్, బీఎస్పీ తరఫున రమేశ్‌ కుమార్‌ పటేల్‌ బరిలో నిలిచారు. ముగ్గురూ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి కొత్తవారే. 

తివాచీల నగరం

 • త్తర్‌ ప్రదేశ్‌లో అత్యంత చిన్న జిల్లా అయిన భదోహీ తివాచీల తయారీకి ప్రసిద్ధి. గంగా పరీవాహక ప్రాంతంలో ఉంటుంది. బనారస్‌ చీరలు, వెదురు బుట్టల తయారీకీ ఈ ప్రాంతం పేరొందింది. 45శాతం ముస్లింలుంటారు. అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన ఈ నియోజకవర్గంలో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం కనిపించదు.
 • 2014, 2019లలో మోదీ ప్రభంజనం కారణంగా భాజపా విజయం సాధించింది. ఈసారి భాజపా నుంచి వినోద్‌ కుమార్‌ బింద్, తృణమూల్‌ తరఫున లలితేశ్‌పతి త్రిపాఠి, బీఎస్పీ అభ్యర్థిగా హరిశంకర్‌ పోటీ చేస్తున్నారు. తృణమూల్‌ అభ్యర్థికే ఈ నియోజకవర్గంలో మొగ్గు కనిపిస్తోంది. ఇక్కడ బ్రాహ్మణుల ఆధిపత్యముంటుంది. త్రిపాఠి ఆ వర్గానికి చెందినవారే. ఆయనకు యాదవులు, ముస్లింలూ మద్దతిస్తున్నారు. దళితులు, అగ్రవర్ణాలవారి ఓట్లపై భాజపా ఆధారపడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని